Cm Revanth Reddy: ప్రత్యేక యూనివర్సిటీ, ఎయిర్‌పోర్ట్, నిధులు, పరిశ్రమలు- ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్ వరాల జల్లు
రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమై నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. Cm Revanth Reddy
Cm Revanth Reddy Representative Image (Image Credit To Original Source)
- పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు నిధులు
- ఎయిర్ పోర్ట్ తీసుకొచ్చే బాధ్యత మాది
- అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, స్టేడియం, కొత్త కలెక్టరేట్
Cm Revanth Reddy: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు నిధులు, పరిశ్రమలు కేటాయించాలనే సంకల్పం తనకుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా చనాకా-కొరాటా పంప్ హౌస్ ను ప్రారంభించారు సీఎం రేవంత్. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అంటే తనకెప్పుడూ అభిమానమే అని సీఎం రేవంత్ అన్నారు. కొమురం భీం, రాంజీ గోండుల పోరాటం ఆదర్శనీయం అని చెప్పారు. పోరాటాలు చేసి సాధించుకున్న ఆదిలాబాద్ వెనకబడే ఉందన్న సీఎం రేవంత్.. అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు నిధులు, పరిశ్రమలు కేటాయించాలనే సంకల్పం తనకుందన్నారు.
గత పాలకులు తలుచుకుంటే చనాకా-కోరాటా పంప్ హౌస్, సదర్మట్ బ్యారేజ్ ఏనాడో పూర్తయి సాగునీరు అంది ఉండేదన్నారు. కానీ, గత పాలకులు పదేళ్లు కాలయాపన చేశారని విమర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ మంజూరుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఆదిలాబాద్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుందామని, దీనికి నేతలంతా సహకరించాలని కోరారు.
అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్, స్టేడియం, కొత్త కలెక్టరేట్ అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమై నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ గత పాలకుల స్వార్థంతో ఆగిపోయిందని సీఎం రేవంత్ ఆరోపించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్ కట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు ఇస్తామని హామీ ఇచ్చారు. దానిపై నివేదికలు తయారవుతున్నాయని వెల్లడించారు.
ఎర్ర బస్సు రావడమే కష్టమయ్యే జిల్లాకు విమానాలు తీసుకొచ్చే (ఎయిర్ పోర్ట్) బాధ్యత మాది అని రేవంత్ అన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిర్ పోర్టుకి శిలాఫలకం ఏర్పాటు చేయిస్తామన్నారు. అతిపెద్ద పారిశ్రామిక వాడను 10వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధాని దగ్గరికి వెళ్తున్నామన్న సీఎం రేవంత్.. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కేంద్రం నిధుల కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నేను ప్రధానిని పదే పదే కలుస్తానని అంటారు.. ఆయనను కలిస్తేనే ప్రాజెక్టులు, నిధులు వస్తాయి, మన ప్రాంతానికి మేలు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అని రేవంత్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తేల్చి చెప్పారు.
పదేళ్లు పాలించినా కేంద్రం నుంచి నిధులు తేలేదు..
పదేళ్లు పాలించినా గత పాలకులు కేంద్రాన్ని ఏమీ అడగలేదని ధ్వజమెత్తారు. అడగనిది అమ్మైనా అన్నం పెట్టదన్నారు. కేంద్రం ఇస్తా అన్న నిధులు కూడా తీసుకోకపోవడంతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని వాపోయారు. అప్పులు తెలంగాణ ప్రజలకు ఉరితాడుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3వేల 500 ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. సన్న వడ్లు పండించిన రైతులకు 500 బోనస్, 50 లక్షల ఇళ్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వరంగా మారిందన్నారు.
రాజధాని నడి బొడ్డున వెయ్యి కోట్ల భూమిని మహిళా సంఘాలకు కేటాయించామన్నారు. ఐటీఐ విధానాలు మార్చి 100 నియోజకవర్గాల్లో సాంకేతికపరమైన కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నాగోబా జాతరకు 22 కోట్లు మంజూరు చేస్తామన్నారు. 300 కోట్ల రూపాయలతో సమ్మక్క సారలమ్మల మందిరాన్ని గొప్పగా పునర్ నిర్మించుకున్నామన్నారు.
పదేళ్ళ పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు..
30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ప్రపంచ సంస్థలు పెట్టుబడులు పెట్టబోతున్నాయని రేవంత్ తెలిపారు. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తానంటే.. ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటారా? అని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఎన్నో గొప్ప పనులు చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడు చేసేవి ఇలాంటి విమర్శలా? అని రేవంత్ నిలదీశారు. రాజకీయంగా బీఆర్ఎస్ సమాధి ఖాయమన్నారు. బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి.. వేల కోట్లు దోపిడీ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే..
ప్రజలు ఆశీర్వదిస్తే మరింత ఉత్సాహంగా ముందుకెళ్తామన్నారు. సర్పంచ్ స్థానాల్లో 60 శాతం ఆదరించారని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వంతో కలిసి పని చేసే వాడిని గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ పిలుపునిచ్చారు. ఇక నుండి ఓడిపోయినోళ్లు, పడిపోయినోళ్ళ గురించి తాను మాట్లాడదల్చుకోలేదన్నారు. 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ప్రజా పాలన-ప్రగతి బాట కార్యక్రమంలో సీఎం రేవంత్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ నగేష్, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి శిలా ఫలకాలను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read: ఖైరతాబాద్ ఉపఎన్నికకు సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్.. గెలిచేందుకు ఖతర్నాక్ ప్లాన్..!
