Khairtabad Assembly Constituency: ఖైరతాబాద్ ఈసారి ఎగరబోయే జెండా ఎవరిది.. ట్రయాంగిల్ ఫైట్‌లో తడాఖా చూపేదెవరు?

గ్రేటర్ హైదరాబాద్‌లో.. రాజకీయ వివాదాలకు కేరాఫ్ ఖైరతాబాద్ సెగ్మెంట్. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోటలో.. ఈసారి ఎగరబోయే జెండా ఎవరిది? ట్రయాంగిల్ ఫైట్‌లో తడాఖా చూపేదెవరు?

Khairtabad Assembly Constituency: ఖైరతాబాద్ ఈసారి ఎగరబోయే జెండా ఎవరిది.. ట్రయాంగిల్ ఫైట్‌లో తడాఖా చూపేదెవరు?

Khairtabad Assembly Constituency: తెలంగాణలో హైదరాబాద్ ఎంత ఫేమస్సో.. హైదరాబాద్‌లో.. ఖైరతాబాద్ అంతకంటే ఫేమస్. ఈ ఏరియా పేరు వినగానే.. అందరికీ బడా గణేశ్ గుర్తొస్తాడు. అదే.. రాజకీయం విషయానికొస్తే.. కాంగ్రెస్ లీడర్.. పీజేఆరే కళ్ల ముందు కనిపిస్తారు. అలాంటి.. ఖైరతాబాద్ పాలిటిక్స్.. ఎప్పుడు రసవత్తరంగానే ఉంటాయ్. అలాగే.. కొనసాగుతూ ఉంటాయ్. గ్రేటర్ హైదరాబాద్‌లో.. రాజకీయ వివాదాలకు కేరాఫ్ ఈ సెగ్మెంట్. ఇప్పుడు.. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ.. అధికార బీఆర్ఎస్‌తో పాటు విపక్షాల్లోనూ పోటీ పెరిగిపోయింది. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న ఆశావహులంతా.. సడన్‌గా టికెట్ రేసులోకి దూసుకొచ్చేశారు. దాంతో.. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పొలిటికల్ టెంపరేచర్ అమాంతం పెరిగిపోయింది. మరి.. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోటలో.. ఈసారి ఎగరబోయే జెండా ఎవరిది? ట్రయాంగిల్ ఫైట్‌లో తడాఖా చూపేదెవరు?

ఖైరతాబాద్.. ఒకప్పటి ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు గల నియోజకవర్గం. 2009లో జరిగిన డీలిమిటేషన్‌తో.. ఈ సెగ్మెంట్ నాలుగు ముక్కలైంది. జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌గా ఏర్పడింది. రాబోయే ఎన్నికల్లో.. ఖైరతాబాద్ రాజకీయం ఎలా ఉంటుందో చూసే ముందు.. ఒకప్పటి ఖైరతాబాద్ రాజకీయం ఎలా ఉండేదో కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే.. ఈ నియోజకవర్గం పేరు చెబితే గుర్తొచ్చే వన్ అండ్ ఓన్లీ లీడర్.. పి.జనార్దన్ రెడ్డి. అంతా పిలుచుకునే పేరు.. పీజేఆర్. 1985 నుంచి మొదలుపెడితే.. 1989, 1994, 2004లో.. ఖైరతాబాద్‌లో వరుసగా గెలిచిన నేత ఆయన. 1990 నుంచి 1993 వరకు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత.. 1994 నుంచి 1999 వరకు సీఎల్పీ లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

పీజేఆర్ అంటే మాస్ లీడర్. లోకల్ జనం తయారుచేసుకున్న నాయకుడు. జనంలో నుంచి పుట్టిన నాయకుడు. ఇప్పటికీ.. ఖైరతాబాద్ నియోజకవర్గం మొత్తంలోని బస్తీ వాసులంతా.. పీజేఆర్‌ని ఆరాధ్య దైవంగానే చూస్తారు. పాత ఖైరతాబాద్ సెగ్మెంట్ విస్తరించి ఉన్న ప్రాంతాల్లోని చాలా షాపులు, చిన్న చిన్న దుకాణాల్లో పీజేఆర్ ఫోటో.. ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. చాలా ఏరియాల్లో.. పీజేఆర్ విగ్రహాలు కూడా కనిపిస్తాయ్. పీజేఆర్ పేరు చెప్పుకొని.. నియోజకవర్గంలో ఎదిగిన లీడర్లు కూడా ఎంతో మంది ఉన్నారని చెబుతారు. నాయకుడంటే.. పీజేఆర్ అనే టాక్ కూడా ఉంది. ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని.. కాంగ్రెస్‌కు కంచుకోటగా మార్చింది కూడా ఆయనే. పీజేఆర్ అంటే ఖైరతాబాద్.. ఖైరతాబాద్ అంటే పీజేఆర్ అనే రేంజులో నడిచింది రాజకీయం. అలాంటి.. సెగ్మెంట్‌లో.. గత ఎన్నికల్లో తొలిసారి గులాబీ జెండా ఎగిరింది. ఈసారి.. ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపించబోతుందన్నదే ఆసక్తిగా మారింది.

Also Read: కంచుకోటలో బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంటుందా.. శంకర్ కు ఒక్క చాన్స్ ఇస్తారా?

గ్రేటర్ హైదరాబాద్‌కు.. ఖైరతాబాద్ గుండెకాయ లాంటిది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లాంటి హైక్లాస్ ఏరియాలతో పాటు సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట లాంటి మిడిల్ క్లాస్ పబ్లిక్ నివాస ప్రాంతాలతో పాటు బస్తీలు కూడా ఉంటాయ్. ఇలా.. అన్ని రకాల ప్రజలు నివసించే.. ఏకైక నియోజకవర్గం ఖైరతాబాద్. అంతేకాదు.. రాష్ట్ర పరిపాలనకు గుండెకాయలాంటి సచివాలయం, శాసనాలు చేసే అసెంబ్లీ, చట్టాలు ఆమోదం పొందే.. రాజ్‌భవనన్, కళలకు పట్టం కట్టే రవీంద్రభారతి లాంటివన్నీ.. ఖైరతాబాద్ సెగ్మెంట్‌లో భాగంగానే ఉన్నాయ్. అందుకే.. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంత స్పెషల్. భౌగోళికంగా చూసుకుంటే.. నారాయణగూడ నుంచి మొదలుపెడితే.. హైదర్‌గూడ, హిమాయత్ నగర్, లక్డీకపూల్, సోమాజీగూడ, పంజాగుట్ట, రాజ్‌భవన్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కింగ్ కోఠి, బషీర్‌భాగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మహా నగరం మ్యాప్‌లో నడిబొడ్డున ఉంటుంది ఈ ఖైరతాబాద్.

Danam, Chintala, Rohin, Vijaya Reddy
అభ్యర్థులకు సమస్యల సవాల్‌

ఖైరతాబాద్‌లో ఎంత పాపులర్ నియోజకవర్గమో.. ఇక్కడి సమస్యలు కూడా అంతే ఫేమస్. ఎక్కడ.. ఏ చిన్న ధర్నా చేసినా, రాస్తారోకో నిర్వహించినా.. కిలోమీటర్లకొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. సిటీలోని మెయిన్ సెంటర్లన్నీ ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయ్. వాటి దగ్గర.. వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. లింక్ రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. డబుల్ బెడ్ రూం ఇళ్లు దక్కక.. బస్తీ వాసులు అవస్థలు పడుతున్నారు. ఇక.. డ్రైనేజీ సమస్య ఉండనే ఉంది. ట్యాంక్‌బండ్ నుంచి వచ్చే దుర్వాసన, వ్యర్థాలతో.. ఆ ఏరియా పబ్లిక్ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. ఎప్పటికి పూర్తవుతుందో ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఇలా.. చెప్పుకుంటూ పోతే సమస్యల లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంటుంది. ఇవన్నీ.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సవాల్‌గా మారనున్నాయ్.

Danam Nagender
బీఆర్ఎస్‌లో టికెట్ పోరు తీవ్రం

ఖైరతాబాద్ రాజకీయం విషయానికొస్తే.. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగానే ఉంది. 1999లో టీడీపీ, 2014లో బీజేపీ, 2018లో బీఆర్ఎస్ మినహా.. అంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే గెలిచారు. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన పీజేఆర్, దానం నాగేందర్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులుగా పనిచేశారు. గతంలో.. రాష్ట్ర రాజకీయాలను శాసించిన నేతలున్న ఈ నియోజకవర్గంలో.. ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ వర్గపోరు పెరిగిపోయింది. ప్రస్తుతం.. బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు.. అసమ్మతి సెగ తప్పడం లేదు. కొంతకాలం.. దానంపై అసమ్మతి రాగం వినిపించిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి.. కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంది. ఆమె రాకతో.. ఖైరతాబాద్ టికెట్ ఆశించిన దాసోజు శ్రవణ్.. హస్తానికి హ్యాండ్ ఇచ్చి.. కారెక్కేశారు. మరోవైపు.. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన మన్నె గోవర్దన్ సైతం.. మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో.. అధికార బీఆర్ఎస్‌లో టికెట్ పోరు తీవ్రమవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా.. ఈసారి కూడా టికెట్ తనకే వస్తుందనే ధీమాతో దానం నాగేందర్ ఉన్నారు. మరోవైపు.. ఉద్యమ నేతలుగా తమకే అవకాశం వస్తుందన్న నమ్మకంతో.. దాసోజు శ్రవణ్, మన్నె గోవర్దన్ రెడ్డి ఉన్నారు. కానీ.. బీఆర్ఎస్ హైకమాండ్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయన్నదే.. ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Also Read: రాబోయే ఎన్నికల్లో.. ఖమ్మం గుమ్మంలో కనిపించబోయే సీనేంటి.. ఆ ముగ్గురు పోటీ చేస్తే..?

chintala ramachandra reddy
చింతలకు తప్పని వర్గపోరు

బీజేపీ విషయానికొస్తే.. 2014లో టీడీపీతో పొత్తులో భాగంగా ఇక్కడ చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లోనూ.. ఖైరతాబాద్ సెగ్మెంట్‌లో కమలం పార్టీ ప్రభావం పెద్దగా కనిపించలేదు. కేవలం.. హిమాయత్ నగర్, ఫిలింనగర్ డివిజన్లలో మాత్రమే.. ఇద్దరు కమలం కార్పొరేటర్లు గెలిచారు. వీళ్లలోనూ.. ఫిలింనగర్ కార్పొరేటర్ బీఆర్ఎస్‌లో చేరిపోయారు. మరోసారి.. ఇక్కడి నుంచి బరిలోకి దిగేందుకు.. చింతల రామచంద్రారెడ్డి రెడీ అవుతున్నారు. గతంలో.. తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు.. జనం ఇంకా మరిచిపోలేదని.. అవే తనను గెలిపిస్తాయని.. ధీమాగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై.. ఖైరతాబాద్ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని.. తనకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. ఆయన సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. చింతలకు కూడా వర్గపోరు చింత తప్పడం లేదు. ఈ సెగ్మెంట్‌లో గెలిచిన ఏకైక బీజేపీ కార్పొరేటరే.. ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. బండి సంజయ్‌ సన్నిహితుడిగా పేరున్న ఎన్వీ సుభాష్ సైతం.. ఖైరతాబాద్ టికెట్ రేసులో ఉన్నారు. ఆయన.. తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. మరో బీజేపీ నేత పల్లపు గోవర్దన్ కూడా.. బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. వీళ్లందరిలో.. ఎవరికి టికెట్ ఇస్తారన్నది.. కమలం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Rohin Reddy, Vijaya Reddy
హస్తం కకావికలం

ఒకప్పుడు.. ఖైరతాబాద్‌లో తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్. ఇప్పడు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పీజేఆర్ తర్వాత.. ఈ సెగ్మెంట్‌లో బలమైన కాంగ్రెస్ నేతగా ఉన్న దానం నాగేందర్ కూడా కారెక్కేయడంతో.. ఖైరతాబాద్‌లో హస్తం కకావికలమైపోయింది. పీజేఆర్ వారసురాలిగా ఆయన కూతురు విజయారెడ్డి ఇప్పుడు.. చేతి గుర్తుపై పోటీకి సై అంటున్నారు. అయితే.. ఇదే నియోజకవర్గం నుంచి పీసీసీ చీఫ్ రేవంత్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రోహిన్ రెడ్డి కూడా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరూ.. రేవంత్ వర్గమే కావడంతో.. ఎవరికి టికెట్ దక్కుతుందనే చర్చ కాంగ్రెస్ క్యాడర్‌లో జోరుగా సాగుతోంది. అయితే.. తన తండ్రి పీజేఆర్ చేసిన అభివృద్ధి పనులు, పేదలకు చేసిన సంక్షేమ పనులే.. తనను గెలిపిస్తాయని.. టికెట్ తనకేననే ధీమాతో ఉన్నారు విజయారెడ్డి.

BRS-BJP-Congress
రసవత్తర పోరు

ఓవరాల్‌గా చూసుకుంటే.. రాబోయే ఎన్నికల్లో.. ఖైరతాబాద్ పోరు రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ.. ట్రయాంగిల్ ఫైట్ ఖాయమని తెలుస్తోంది. నియోజకవర్గంలో అన్ని రకాల, అన్ని వర్గాల ప్రజలు ఉన్నప్పటికీ.. పార్టీల గెలుపోటములను డిసైడ్ చేసేది మాత్రం.. బస్తీ ప్రజలే. అర్బన్ పార్టీగా పేరున్న బీజేపీ.. చదువుకున్నవాళ్లు, యువత, ఫస్ట్ టైమ్ ఓటర్ల మీదే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అయితే.. వీళ్లలో పోలింగ్ బూత్ దాకా వచ్చే వాళ్లెందరన్న ఆందోళన కమలనాథుల్లో కనిపిస్తోంది. బస్తీల్లో ఇప్పటికీ పీజేఆర్‌ని అభిమానించే ఓటర్లు ఎక్కువగానే ఉన్నా.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. వాళ్లంతా చాలా వరకు బీఆర్ఎస్ వైపు టర్న్ అయ్యారనే టాక్ ఉంది. అందువల్ల.. ట్రయాంగిల్ ఫైట్‌లో.. ఖైరతాబాద్ ఓటర్లను ఆకర్షించి.. గెలిచేదెవరన్నది ఆసక్తిగా మారింది.