Adilabad Assembly Constituency: గులాబీ కంచుకోటలో బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంటుందా.. శంకర్ కు ఒక్క చాన్స్ ఇస్తారా?

Adilabad Assembly Constituency: గులాబీ కంచుకోటగా ఉన్న ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంటుందా? జోగు రామన్న.. వరుసగా ఐదోసారి గెలిచి.. తనకు ఎదురు లేదనిపించుకుంటారా? మిగతా పార్టీల నుంచి బరిలోకి దిగేందుకు.. రెడీగా ఉన్నదెవరు?

Adilabad Assembly Constituency: గులాబీ కంచుకోటలో బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంటుందా.. శంకర్ కు ఒక్క చాన్స్ ఇస్తారా?

Adilabad Assembly Constituency: తెలంగాణ మ్యాప్‌లో.. టాప్‌లో ఉండే సెగ్మెంట్ అది. తెలుగు అక్షర క్రమంలోనూ.. ముందుండే నియోజకవర్గమది. అక్కడ గెలిస్తే ఎమ్మెల్యేలే కాదు.. మంత్రులు కూడా అయిపోతారనే సెంటిమెంట్ ఉంది. అదే.. ఆదిలాబాద్ నియోజకవర్గం. గులాబీ కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంటుందా? జోగు రామన్న.. వరుసగా ఐదోసారి గెలిచి.. తనకు ఎదురు లేదనిపించుకుంటారా? మిగతా పార్టీల నుంచి బరిలోకి దిగేందుకు.. రెడీగా ఉన్నదెవరు? ఓవరాల్‌గా.. ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానంలో.. ఈసారి కనిపించబోయే సీనేంటి?

తెలంగాణ ఉద్యమం పీక్‌లో ఉన్నప్పటి నుంచి ఆదిలాబాద్‌లో గులాబీ జెండానే ఎగురుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జోగు రామన్న (Jogu Ramanna).. బీఆర్ఎస్ తరఫున ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టేశారు. ఇక్కడ.. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో చాలా మంది మంత్రులుగా సేవలందించారు. రాజకీయంగా ఉన్నతస్థాయిలో పదవులు నిర్వహించారు. అయితే.. ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని మాత్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారనే టాక్ ఉంది. కానీ.. తాము చేసిన అభివృద్ధే తమకు మరోసారి విజయాన్ని కట్టబెడుతుందనే ధీమాతో ఉన్నారు అధికార పార్టీ నేతలు. నియోజకవర్గంలో మూతబడిన మిల్లులను తెరిపించి.. ఉపాధి కల్పిస్తామంటూ బీజేపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. ఆదిలాబాద్‌కి గిరిజన యూనివర్సిటీ తెచ్చేది తామేనని భరోసా ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. 3 ప్రధాన పార్టీల నుంచి.. రాబోయే ఎన్నికల బరిలో దిగేదెవరో కూడా దాదాపుగా తేలిపోయింది. ఇక.. తేల్చుకోవాల్సింది ఓటర్లే అనే సిగ్నల్ ఇచ్చేశారు. మరి.. ఆదిలాబాద్ జనం ఎవరికి పట్టం కడతారనేదే.. ఆసక్తి రేపుతోంది.

Also Read: Pithapuram Assembly constituency: పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచే పోటీ చేయబోతున్నారా?

ఆదిలాబాద్ (Adilabad) అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. కాంగ్రెస్, సీపీఐ, తెలుగుదేశం అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కూడా ఎక్కువగా గెలిచిన సెగ్మెంట్ ఇది. 2009లో టీడీపీ తరఫున పోటీ చేసిన గెలిచిన జోగు రామన్న.. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. కారెక్కేశారు. తర్వాత వచ్చిన ఉపఎన్నికలో బీఆర్ఎస్ తరఫున గెలిచారు. ఆ ఉపఎన్నికతో కలిపి ఇప్పటివరకు వరుసగా మూడు సార్లు గెలిచి.. ఆదిలాబాద్‌లో హ్యాట్రిక్ కొట్టారు. కేసీఆర్ తొలి కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. ఇదే సీటులో.. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డ్ కూడా జోగురామన్నదే.


మళ్లీ జోగు రామన్నే..

ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మొత్తం 2 లక్షల 25 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో.. లక్షా 11 వేల మంది పురుషులు, లక్షా 14 వేల మంది మహిళలు ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో.. ఐదు మండలాలున్నాయి. అవి.. ఆదిలాబాద్ (Adilabad) అర్బన్, ఆదిలాబాద్ రూరల్, బేల, మావల, జైనథ్. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లే.. కీలకంగా మారుతుంటాయ్. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న సొంత మండలమైన జైనథ్‌లో మున్నూరు కాపు సామాజికవర్గం ఓట్లు.. ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. నియోజకవర్గంలో.. 50 వేలకు పైగా ఉండే మున్నూరు కాపు సామాజికవర్గం ఓట్లే.. ఆదిలాబాద్‌లో గెలుపోటములను నిర్ణయిస్తాయ్. ప్రస్తుతం.. అధికార బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న జోగు రామన్నే.. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు.. బీఆర్ఎస్‌కు జోగు రామన్నకు ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థి కనిపించడం లేదు. ఇక.. తన హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలే.. తనను మరోసారి గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు రామన్న. తనకు మరోసారి అవకాశమిస్తే.. టెక్స్‌టైల్ పార్క్ తీసుకురావడంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ని ఏర్పాటు చేయిస్తానంటూ హామీ ఇస్తున్నారు. అంతేకాదు.. చనాకా – కొరాటా బ్యారేజీ పనులు పూర్తవ్వాలంటే.. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ప్రజలను కోరుతున్నారు. తాను చేసిన అభివృద్ధే.. తనను ఐదోసారి విజయతీరాలకు చేరుస్తుందనే నమ్మకంతో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న.


పాయల్ శంకర్ కు సానుభూతి వర్కవుట్ అవుతుందా?

ఇక.. జోగు రామన్నపై పోటీ చేస్తూ.. రెండో స్థానంలో నిలుస్తూ వస్తున్నారు బీజేపీ నేత పాయల్ శంకర్. గత రెండు ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తనకొక్క అవకాశం ఇస్తే.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానంటున్నారు. ఈసారి కూడా ఆయనే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే.. ఆదిలాబాద్‌లో మూతపడ్డ.. 110 జిన్నింగ్, ప్రెసింగ్ మిల్లులను తెరిపిస్తానంటూ.. ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు పాయల్ శంకర్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో.. ఎయిర్‌పోర్ట్, రైల్వే లైన్ తెచ్చేందుకు కేంద్రం నుంచి అనుమతులు తెస్తానని చెబుతున్నారు. అయితే.. పాయల్ శంకర్‌కు.. ఎన్నారై కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు సుహాసిని రెడ్డి నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. వరుసగా రెండు సార్లు ఓడిపోయాను కాబట్టి.. ఈసారి కచ్చితంగా తనకు సానుభూతి వర్కవుట్ అవుతుందనే లెక్కల్లో ఉన్నారు పాయల్ శంకర్. కానీ.. రెండుసార్లు ఓడిన అభ్యర్థికి బదులు.. కొత్త వారికి టికెట్ ఇవ్వాలని.. మిగతా బీజేపీ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది.


మరోసారి అదృష్టం పరీక్షించుకోనున్న గండ్రాత్ సుజాత

గత ఎన్నికల్లో.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గండ్రాత్ సుజాత(Gandrath Sujatha) .. మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు.. డీసీసీ ప్రెసిడెంట్ సాజిద్ ఖాన్ కూడా ఆదిలాబాద్ (Adilabad) బరిలో దిగేందుకు తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు. అయితే.. నియోజకవర్గంలో మున్నూరు కాపు సామాజికవర్గం ఓట్లు కీలకం కావడం, మిగతా ప్రధాన పార్టీలు కూడా అదే సామాజికవర్గానికి చెందిన నేతకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉండటంతో.. మరోసారి.. సుజాతకే.. కాంగ్రెస్ టికెట్ దక్కే అవకాశాలున్నాయంటున్నారు. అయితే.. ఎన్నికల నాటికి వీళ్లిద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందనేది.. ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.

Also Read: రాబోయే ఎన్నికల్లో.. ఖమ్మం గుమ్మంలో కనిపించబోయే సీనేంటి.. ఆ ముగ్గురు పోటీ చేస్తే..?

ట్రయాంగిల్ ఫైట్ తప్పదా?
ఓవరాల్‌గా చూసుకుంటే.. రానున్న ఎన్నికల్లో ఆదిలాబాద్ సెగ్మెంట్‌లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ట్రయాంగిల్ ఫైట్ తప్పదనిపిస్తోంది. మారిన రాజకీయ పరిస్థితులతో.. బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగబోయే జోగు రామన్నకు.. బీజేపీ నుంచి గట్టిపోటీ తప్పకపోవచ్చనే చర్చ సాగుతోంది. నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు ఉన్న ఆదిలాబాద్ మున్సిపాలిటీలో.. బీజేపీకి బలం ఉండటం కమలదళానికి కలిసొచ్చే అంశం. అయితే.. రూరల్ ఏరియాలో మాత్రం కారు పార్టీకి.. గట్టి పట్టు ఉన్నట్లు చెబుతున్నారు. అదే.. తమకు కలిసొస్తుందని.. జోగు రామన్న (Jogu Ramanna) వర్గం నమ్మకంగా ఉంది. దీంతో పాటు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్న మున్నూరు కాపులు కూడా మెజారిటీ వంతు తమ వెంటే ఉంటారనే ధీమాతో ఉన్నారు. అయితే.. కాంగ్రెస్ నుంచి కూడా అదే సామాజికవర్గానికి చెందిన నేత బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్. దాంతో.. మున్నూరు కాపు ఓట్లలో చీలిక తప్పదని.. అదే తమకు కలిసొస్తుందనే భావనలో.. బీజేపీ నేత పాయల్ శంకర్ ఉన్నారు. ఏదేమైనా ఒక్క ఛాన్స్ అంటూ.. బరిలోకి దిగాలనుకుంటున్న బీజేపీ శంకర్, కాంగ్రెస్ నేత సుజాత వైపు.. ఆదిలాబాద్ ఓటర్లు మొగ్గు చూపుతారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది. వీళ్లిద్దరినీ కాదని.. రాజకీయాల్లో రాటుదేలిన జోగు రామన్నకే.. ఐదోసారి ఓటర్లు పట్టం కడతారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.