Pithapuram Assembly constituency: పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచే పోటీ చేయబోతున్నారా?

పిఠాపురంలో.. అధికార వైసీపీకి షాకిచ్చేందుకు విపక్షాల దగ్గరున్న వ్యూహాలేంటి? జనసేనాని పవన్ కల్యాణ్.. ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నారా? ఓవరాల్‌గా.. ఈసారి పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్‌లో.. కనిపించబోయే సీనేంటి?

Pithapuram Assembly constituency: పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచే పోటీ చేయబోతున్నారా?

Pithapuram Assembly constituency: పిఠాపురం.. కాకినాడ జిల్లాలోనే.. ఇక్కడి ఓటర్ల తీర్పు భిన్నంగా ఉంటుందనే పేరుంది. గడిచిన 4 దశాబ్దాల్లో.. ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా ఇక్కడి నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాల్లేవు. లీడర్లను ఎన్నుకోవడంలో పిఠాపురం ఓటర్లు చైతన్యవంతులని, ప్రతిసారి రాజకీయ వైవిధ్యం చూపుతారని చెబుతుంటారు. ఇక్కడి ప్రజలను ప్రభావితం చేయడం నాయకులకు, పార్టీలకు బిగ్ టాస్క్ అనే చెప్పాలి. మరి.. అలాంటి పిఠాపురంలో.. అధికార వైసీపీకి షాకిచ్చేందుకు విపక్షాల దగ్గరున్న వ్యూహాలేంటి? జనసేనాని పవన్ కల్యాణ్.. ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నారా? ఓవరాల్‌గా.. ఈసారి పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్‌లో.. కనిపించబోయే సీనేంటి?

చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా.. ఎంతో కీర్తి కలిగిన పిఠాపురం నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఈ సెగ్మెంట్ పరిధిలో 3 మండలాలున్నాయ్. అవి.. గొల్లప్రోలు, పిఠాపురం, యు కొత్తపల్లి. వీటిలో.. గొల్లప్రోలు, పిఠాపురం మున్సిపాలిటీలుగా ఉన్నాయి. మొత్తం నియోజకవర్గంలో సుమారుగా 2 లక్షల 36 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో.. కాపు సామాజికవర్గానికి చెందిన వారి ఓట్లే.. 80 వేల దాకా ఉంటాయ్. బీసీల ఓట్లు సుమారు 79 వేలు ఉంటాయి. పిఠాపురం రాజకీయాలపై ఎక్కువగా కాపుల ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో ఎక్కువ మంది కాపు నేతలే ఉన్నారు.

Pendem Dorababu
వైసీపీ టికెట్ ఈసారి కూడా ఆయనకే..

గత ఎన్నికల్లో పిఠాపురం సీటులో వైసీపీ జెండా ఎగిరింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పెండెం దొరబాబుకు.. సౌమ్యుడనే పేరుంది. ఉప్పాడ దగ్గర 450 కోట్లతో అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్, 2 వేల ఎకరాల భూమి రైతులకు తిరిగివ్వడం, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో.. అదనపు తరగతి గదుల నిర్మాణాలతో పాటు ఇతర అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇక.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా? లేదా? అనే విషయంలో.. ఎమ్మెల్యే దొరబాబు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై కొంత వ్యతిరేకత అయితే ఉంది. సొంత పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టేశారనే విమర్శలున్నాయ్. విపక్షాలు కూడా ఆయన అవినీతికి పాల్పడుతున్నారని విమర్శిస్తుంటాయ్. అయినప్పటికీ.. సర్వేలన్నీ ఎమ్మెల్యే దొరబాబుకు అనుకూలంగానే ఉన్నట్లు సమాచారం. దాంతో.. పిఠాపురం వైసీపీ టికెట్ ఈసారి కూడా ఆయనకే దక్కే అవకాశం కనిపిస్తోంది. క్యాడర్‌తో సమన్వయం చేసుకొని వెళితే.. మళ్లీ విజయం సాధిస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

Vanga Geetha
అసెంబ్లీ బరిలో వంగా గీతా!

ఇక.. కాకినాడ వైసీపీ ఎంపీగా ఉన్న వంగా గీతావిశ్వనాథం ఈసారి అసెంబ్లీ బరిలో దిగాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె.. పిఠాపురం నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. 2009లో ఆమె.. ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఇక్కడే ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో.. నియోజకవర్గ ప్రజలతో వంగా గీతకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈసారి ఎన్నికల్లో.. కాకినాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయకుండా.. పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దిగాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే.. ఆమె తన ఎంపీ ల్యాడ్స్‌తో.. నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పైగా.. నియోజకవర్గంలో ఆవిడకు కూడా కొంత పట్టు ఉంది.

Also Read: హీటు రేపుతోన్న గుడివాడ అసెంబ్లీ సీటు.. కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీ స్పెషల్ ఫోకస్..

Mudragada Padmanabham
ముద్రగడ టికెట్ దక్కించుకుంటారా?

మరోవైపు.. ఇదే పిఠాపురం సీటు కాపు సామాజికవర్గ నేత ముద్రగడ పద్మనాభం అడుగుతున్నట్లు సమాచారం. గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి.. వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును పక్కనబెట్టి.. టికెట్ వంగా గీతకు ఇచ్చే అవకాశం తక్కువే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉంటాయన్నది ఆసక్తిగా మారింది. దొరబాబును, వంగా గీతను కాదని.. ముద్రగడ టికెట్ దక్కించుకుంటారా? అనే అనుమానం కూడా తలెత్తుతోంది.

SVSN Varma
గెలుపుపై వర్మ దీమా

ప్రతిపక్ష టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ.. నియోజకవర్గంలోని సమస్యలపై పోరాటం చేస్తున్నారు. 2014లో.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి.. 47 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత.. టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో మాత్రం 14 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. పిఠాపురం సెగ్మెంట్‌లో కాపులు అధిక సంఖ్యలో ఉన్నా.. అదే స్థాయిలో బీసీలు ఉండటంతో.. గెలుపు అవకాశాలు ఈయనకు కూడా ఎక్కువే ఉన్నాయని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. టీడీపీకి ముందు నుంచీ బీసీ ఓట్ బ్యాంక్ ఉండటం, దానికితోడు వర్మకు.. అందుబాటులో ఉంటారనే పేరు ఉంది. రైతుల్లోనూ.. ఆయనకు సానుకూల అభిప్రాయాలే ఉన్నాయి. వైసీపీలో ద్వితీయశ్రేణి నాయకులు సైతం ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా ఉన్నారని చెబుతున్నారు. దీనికితోడు ఎమ్మెల్యే దొరబాబుపై ఉన్న వ్యతిరేకతే.. తమకు బలంగా మారుతుందంటున్నారు. ఇప్పటి నుంచే కాస్త కష్టపడి పనిచేస్తే.. గెలుపు అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయని చెబుతున్నారు.

Makineedi Seshu Kumari
హాట్ టాపిక్‌గా జనసేనాని పోటీ!

ఇక.. జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో.. పిఠాపురం కూడా ఒకటి. సర్వేల్లో.. జనసేనకు సానుకూలంగా ఉన్న సెగ్మెంట్ ఇది. దాంతో.. జనసేనాని పవన్ కల్యాణ్.. ఇక్కడి నుంచే పోటీ చేస్తారనే వార్త కూడా హాట్ టాపిక్‌గా మారింది. అదే గనక జరిగితే.. ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాపుల ఓట్లు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో.. సేనాని గెలవడం పక్కా అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం.. పిఠాపురం జనసేన ఇంచార్జ్‌గా.. మాకినేడి శేషకుమారి ఉన్నారు. కేవలం ఎన్నికల టైమ్‌లో తప్పితే.. మిగతా సమయాల్లో నియోజకవర్గ ప్రజలకు కనిపించరని.. జనసైనికులే విమర్శిస్తున్నారు. స్థానికంగా.. జనసేనకు అనుకూల పరిస్థితులు ఉన్నా.. వాటిని ఓట్లుగా మార్చుకోవడంలో విఫలమవుతున్నారని చెబుతున్నారు. దాంతో.. జనసైనికులంతా అయోమయ స్థితిలో ఉన్నారు. పిఠాపురం అభ్యర్థి విషయంలో కాస్త తొందరపడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Also Read: పవన్ కల్యాణ్‌ను పోటికి దించుతారా.. కొత్త ముఖాలేమైనా బరిలోకి దిగబోతున్నాయా?

టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే..
గత ఎన్నికల్లో.. వైసీపీ, టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో.. వైసీపీ అభ్యర్థి 14 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు 83 వేల ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు 68 వేల ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి మాకినీడి శేషుకుమారి 28 వేల ఓట్లు సాధించారు. అందువల్ల.. టీడీపీ, జనసేన మధ్య గనక పొత్తు కుదిరితే.. వారి తరఫున పోటీ చేసే అభ్యర్థికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అయితే.. ఎన్నికలైపోయిన తర్వాత పిఠాపురంలో జనసేన అంతగా యాక్టివ్‌గా లేదు. పార్టీకి ఎంతో కొంత బలం ఉన్నా.. వాటిని మెజారిటీ ఓట్లుగా మలచడంలో విఫలమవుతూనే ఉన్నారనే విమర్శ ఉంది. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా.. పిఠాపురంలో పెద్దగా ప్రభావం చూపే పరిస్థితులు కనిపించడం లేదని మరో టాక్ వినిపిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో.. కమ్యూనిస్టులు, బీజేపీ అంతగా ప్రభావం చూపే అవకాశం లేదు. జనసేన గనక బలమైన అభ్యర్థిని బరిలోకి దించితే.. ట్రయాంగిల్ ఫైట్ ఖాయమంటున్నారు. లేనిపక్షంలో.. పోల్ వార్ టీడీపీ, వైసీపీ మధ్య ఉంటుంది.