Gudivada Assembly Constituency: హీటు రేపుతోన్న గుడివాడ అసెంబ్లీ సీటు.. కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీ స్పెషల్ ఫోకస్..

Gudivada Assembly Constituency: ఇప్పటిదాకా ఒకెత్తు.. ఇక నుంచి మరో ఎత్తు అంటోంది టీడీపీ. మీకెన్ని లెక్కలైనా ఉండనీ.. నేను గెలవడం మాత్రం పక్కా అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని.

Gudivada Assembly Constituency: హీటు రేపుతోన్న గుడివాడ అసెంబ్లీ సీటు.. కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీ స్పెషల్ ఫోకస్..

Gudivada Assembly Constituency: ఇప్పటిదాకా ఒకెత్తు.. ఇక నుంచి మరో ఎత్తు అంటోంది టీడీపీ. మీకెన్ని లెక్కలైనా ఉండనీ.. నేను గెలవడం మాత్రం పక్కా అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని. తనపై పోటీకి బాబు బరిలో దిగినా, లోకేశే పోటీ చేసినా.. తన గెలుపును ఆపలేరని తొడగొడుతున్నారు. దాంతో.. ఎలాగైనా సరే కొడాలిని ఓడించాలనే కంకణం కట్టుకుంది టీడీపీ. సరైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి కుప్పం ఎంత ప్రతిష్ఠాత్మకమో.. గుడివాడ కూడా అంతే ఇంపార్టెంట్. కొడాలిని ఓడించేందుకు.. టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. మరి.. గుడివాడ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఈసారి కనిపించబోయే సీనేంటి?

సరైన అభ్యర్థి కోసం టీడీపీ వేట
కొడాలి నాని.. వైసీపీలో ఫైర్ బ్రాండ్. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన లీడర్. మాజీ మంత్రి. మాటలతోనే.. మంటలు పుట్టించే క్యారెక్టర్. అలాంటి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంటే గుడివాడ. ఈ నియోజకవర్గంలో కొడాలి ఐదోసారి కూడా గెలవడం సులువేననే టాక్ వినిపిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం నాని గెలుపును అడ్డుకుంటామంటున్నారు. ఈసారి ఆయన గెలవడం కష్టమేనని చెబుతున్నారు. ముందు నుంచీ.. కొడాలి, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో వైరం నడుస్తోంది. ఈ రెండింటి కాంబినేషన్ ఎప్పుడు పడినా.. మాటల తూటాలు పేలుతున్నాయ్. ఎమ్మెల్యే నాని మైక్ అందుకుంటే.. చంద్రబాబు, లోకేశ్‌ని తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారనే చర్చ కూడా ఉంది. అందుకే.. తెలుగుదేశం అధిష్ఠానం గుడివాడపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కొడాలిని ఢీకొట్టేందుకు.. సరైన అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తోంది. అందుకు తగ్గ వ్యక్తి కోసం వేట మొదలుపెట్టింది.


ఐదోసారి గెలిచి.. సత్తా చాటాలని..

1952లో గుడివాడ అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడింది. అప్పటి నుంచి ఎన్నోసార్లు ఎన్నికలు జరిగాయ్. ఎంతోమంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ.. కొడాలి నాని మాత్రమే.. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. రెండు సార్లు తెలుగుదేశం నుంచి.. రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచారు. గుడివాడలో వైసీపీ అంటే కొడాలి నాని పేరు తప్ప మరొకటి వినిపించదు. ఇంకొకరు కనిపించరు. వచ్చే ఎన్నికల్లోనూ గుడివాడలో వైసీపీ నుంచి కొడాలియే పోటీ చేయబోతున్నారు. ఐదోసారి కూడా గెలిచి.. తన సత్తా చాటాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే.. తెలుగుదేశం మాత్రం ఎలాగైనా సరే నానిని ఓడించాలని.. అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. కొడాలి కూడా కచ్చితంగా ఈసారి గెలిచి చూపించాలని.. వీలైనంత ఎక్కువ మెజారిటీతో విజయం సాధించాలని భావిస్తున్నారు.

టీడీపీలో మూడు గ్రూపులు
తెలుగుదేశానికి గుడివాడ సీటు కీలకంగా మారింది. గెలుపే లక్ష్యంగా.. ప్రత్యేక వ్యూహంతో ముందుకెళుతోంది. వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబు, లోకేశ్‌ని టార్గెట్ చేస్తున్న కొడాలికి.. ఎలాగైనా చెక్ పెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. అందుకే గుడివాడలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ. ప్రస్తుతం అక్కడ తెలుగుదేశం ఇంచార్జ్‌గా.. రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. అయినప్పటికీ గుడివాడ టీడీపీలో రావి, పిన్నమనేని, వెనిగండ్ల రాము నాయకత్వంలో.. 3 గ్రూపులు పనిచేస్తున్నాయ్. ఎవరికి వారు.. ఎవరి స్థాయిలో వారు.. టికెట్ కోసం ఇప్పటి నుంచే లాబీయింగులు కూడా మొదలెట్టేశారు. కార్యకర్తలకు, కింది స్థాయి నాయకులు మాత్రం.. ఎవరితో కలిసి పనిచేయాలో తేల్చుకోలేకపోతున్నారు. అయితే.. ప్రత్యర్థి కొడాలి నానిపై పోరాటానికి అంతా కలిసి వెళ్లడం లేదని.. అధిష్టానం భావిస్తోంది. ఏం చేసైనా సరే.. ఈసారి నానిని ఓడించాలనే పట్టుదలతో ఉంది టీడీపీ నాయకత్వం. ఇందుకోసం.. ఎన్నారైలు సైతం భారీ ఎత్తున నిధులు సమీకరిస్తున్నారని.. ఇది టీడీపీకి కలిసొస్తుందని చెబుతున్నారు నేతలు.


సీటు కోసం వెనిగండ్ల రాము ప్రయత్నం

మరోవైపు.. తెలుగుదేశానికి చెందిన ఎన్ఆర్ఐ నేత వెనిగండ్ల రాము.. తన ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేపడుతూ.. జనాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే.. నియోజకవర్గంలోని చర్చిలన్నింటిని చుట్టేశారు. ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. పైగా.. రాము సతీమణి మాల సామాజికవర్గానికి చెందిన మహిళ కావడంతో.. ఈ అంశాన్ని ఆ సామాజికవర్గంలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది రాము టీమ్. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి సమయంలో వేలాది మందికి భారీగా గిఫ్ట్‌లు పంపిణీ చేశారు రాము. బలహీన వర్గాలకు చెందిన, చదువుకున్న యువతను సైతం.. తన కన్సల్టెన్సీ ద్వారా అమెరికా తీసుకెళ్లేందుకు ఏర్పాటు కూడా చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గమంతటా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ.. ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు రాము అండ్ టీమ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Also Read: వచ్చే ఎన్నికల్లో కొండారెడ్డి బురుజుపై జెండా పాతేది ఎవరు.. ఆసక్తి కరంగా కర్నూలు రాజకీయాలు

ఆయన అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేస్తారా?
ఇక.. గుడివాడలో కాపు ఓటర్లు కూడా అధికంగానే ఉన్నారు. దాంతో.. కొడాలి నాని మొదటి నుంచి వంగవీటి రాధాతో సన్నిహితంగా ఉంటారు. ప్రస్తుతం టీడీపీ ఇంచార్జ్ రావు వెంకటేశ్వరరావు సైతం రాధాతో టచ్‌లో ఉంటున్నారు. వెనిగండ్ల రాము చేస్తున్న కార్యక్రమాలపై.. రావి వెంకటేశ్వరరావు అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. కేడర్‌లో వాటికున్న ఆదరణతో.. ఆయన కూడా పాల్గొనక తప్పడం లేదు. వీళ్లిద్దరి మధ్య సమన్వయం కుదిర్చి.. గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టాలని అధిష్టానం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే.. ప్రస్తుత ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావుని భవిష్యత్తులో చట్ట సభలకు పంపిస్తామనే హామీ ఇస్తారని తెలుస్తోంది. పిన్నమనేని గ్రూప్ ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉంటూ.. రాముకి అనుకూలంగా పనిచేస్తుందనే ప్రచారం జరుగుతోంది. కైకలూరులో ప్రస్తుతానికి ఇంచార్జ్ ఎవరూ లేకపోవడంతో.. పిన్నమనేని వర్గం ఫోకస్ అంతా అటు షిఫ్ట్ అయింది. ఏదేమైనా.. వెనిగండ్ల రామునే.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉందని.. అధిష్టానం కూడా గుడివాడ నేతలందరినీ పిలిచి.. ఆయన అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేస్తారని సమాచారం.


టీడీపీకి తలనొప్పిగా గ్రూపు తగాదాలు

గత ఎన్నికల్లో కొడాలి నాని ఇచ్చిన హామీలు నెరవేర్చకలేదనే టాక్ ఉంది. అయితే.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరుతో.. నానిపై వ్యతిరేకత కాస్త తక్కువగానే ఉంది. అందువల్ల.. కొడాలికి దీటైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు.. తెలుగుదేశం హైకమాండ్ కసరత్తు చేస్తున్నా.. పార్టీలోని గ్రుపు తగాదాలు చికాకు తెప్పిస్తున్నాయి. ఇప్పటికే.. 3 గ్రూపులు ఉండటంతో.. ఎవరిని బరిలోకి దించుతారో తెలియక.. కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాములో.. ఎవరికి సీటు ఇస్తారన్నది తెలియకు.. ఎవరివైపు వెళ్లి పనిచేయాలో తెలియక.. తలలు పట్టుకుంటుంది క్యాడర్. వీలైనంత త్వరగా.. అధిష్టానం ఓ పేరును ప్రకటించాలని కోరుతోంది.

Also Read: సాగరతీరంలో కాక రేపుతున్నరాజకీయాలు.. బాపట్ల రాజకీయాలు చాలా హాట్ గురూ!


జనసేన ప్రభావం ఎంత?

గుడివాడ వైసీపీలో.. కొడాలి నానికి వ్యతిరేకంగా ఎలాంటి గ్రూపులు లేవు. ఆయన తర్వాత చెప్పుకోదగ్గ నాయకుడు లేరు. పైగా.. 20 ఏళ్లుగా.. అక్కడ ఆయనే ఎమ్మెల్యే. నాయకత్వ లోపంతోనే.. టీడీపీ రెండో స్థానంలో ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే గుడివాడలో.. జనసేన కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ఇందుకు.. కాపు సామాజికవర్గం మద్దతే కారణంగా చూపుతున్నారు. అయితే.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే.. తెలుగుదేశం పుంజుకునే అవకాశం ఉంది. జనసేనకు పడే ఓట్లు.. టీడీపీకి మళ్లితే.. గుడివాడలో పసుపు జెండా ఎగిరే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ విషయానికొస్తే.. గుడివాడలో ఆ పార్టీ ప్రభావం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. జనసేన-బీజేపీ మధ్య పొత్తు కుదిరి.. ఎన్నికల బరిలోకి దిగినా.. కొడాలి నానిని, టీడీపీ అభ్యర్థిని ఎదుర్కొనే శక్తి సరిపోదంటున్నారు. ముఖ్యంగా.. గుడివాడలో వైసీపీ, టీడీపీ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందనేది తెలుస్తోంది.