Bapatla Lok Sabha Constituency : సాగరతీరంలో కాక రేపుతున్నరాజకీయాలు.. బాపట్ల రాజకీయాలు చాలా హాట్ గురూ !

సంతనూతలపాడులో సుధాకర్ బాబు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ సైకిల్ పార్టీ గెలిచింది కేవలం మూడుసార్లు మాత్రమే ! 2014లో మంత్రి సురేష్ ఇక్కడ వైసీపీ నుంచి విజయం సాధించగా.. 2019లో సుధాకర్ బాబు గెలిచారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై రకరకాల అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయ్.

Bapatla Lok Sabha Constituency : సాగరతీరంలో కాక రేపుతున్నరాజకీయాలు.. బాపట్ల రాజకీయాలు చాలా హాట్ గురూ !

Bapatla Lok Sabha Constituency:

Bapatla Lok Sabha Constituency : బాపట్ల.. ఇక్కడి పాలిటిక్స్‌ చాలా హాట్‌ గురూ అంటారు రాజకీయం తెలిసినవాళ్లు ! కాకలు తీరిన రాజకీయ ఉద్ధండులు ఏలిన పార్లమెంట్ సెగ్మెంట్‌లో.. ప్రస్తుత రాజకీయాలు కాక రేపుతున్నాయ్. సాగరతీరంలో కనిపించే నియోజకవర్గాల్లో.. నేతలు గెలుపు కోసం చెమటలు ధారపోస్తున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే నేతలంతా జనాల్లో తిరుగుతున్నారు. ఇంతకీ బాపట్ల ఓటర్ నాడి ఎలా ఉంది.. వైసీపీని వెంటాడుతున్న టెన్షన్ ఏంటి.. టీడీపీ బలం ఏంటి, బలహీనత ఏంటి.. బాపట్ల పరిధిలో జనసేన పోటీ చేయబోయే అసెంబ్లీ నియోజకవర్గాలు ఏంటి.. బాపట్ల గెలుపును శాసించి.. కీరోల్ ప్లే చేయబోయేది ఎవరు..

బాపట్ల గడ్డపై జెండా పాతబోయే పార్టీ ఏది ?
ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల.. స్వాతంత్ర్య కాంక్షను దేశానికి ఎలుగెత్తి చాటిన నేల ఇది ! అలాంటి బాపట్ల పార్లమెంట్‌లో రాజకీయ చైతన్యం ఎక్కువ. ముందునుంచి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలకు ఈ ప్రాంతం కంచుకోటగా ఉంది. కమ్యూనిస్టులు తమ ప్రాభవాన్ని కోల్పోయిన తర్వాత.. టీడీపీ సత్తా చాటింది. సైకిల్ పార్టీ అద్భుతమైన బలం దక్కించుకుంది. అప్పటి నుంచి కాంగ్రెస్‌, టీడీపీ మధ్య ప్రధాన పోటీ కనిపించగా.. రాష్ట్ర విభజన తర్వాత హస్తం పార్టీ దాదాపు కనుమరుగు అయింది. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య యుద్ధం మొదలైంది. 2014లో టీడీపీ ఈ స్థానాన్ని గెలుచుకోగా.. 2019లో సైకిల్ పార్టీకి ఝలక్ ఇచ్చి.. ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది వైసీపీ. నందిగం సురేష్‌.. బాపట్లలో సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాల్యాద్రి శ్రీరామ్‌పై 16వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

READ ALSO : Anakapalle Lok Sabha Constituency : పేరు మాత్రం సాఫ్ట్…రాజకీయం మాత్రం మస్త్ హాట్…అనకాపల్లిలో పోటాపోటీగా పొలిటికల్ వార్

nandigam suresh

nandigam suresh

తాడేపల్లి తప్పితే.. బాపట్లలో కనిపించని ఎంపి సురేష్..
ఎంపీగా గెలిచినప్పటి నుంచి.. జనాలకే కాదు పార్లమెంట్‌ పరిధిలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ సురేష్ కనిపించిన దాఖలాలు లేవనే విమర్శ సొంత పార్టీలోనే వినిపిస్తోంది. తాడేపల్లి పరిధిలో తప్పితే.. ఆయన బాపట్లలో కనిపించరని జనాలు ఫిక్స్ అయ్యారనే చర్చ నడుస్తోంది. పార్లమెంట్‌ను వదిలి.. సొంత జిల్లాలో ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారనే చర్చ నడుస్తోంది. నందిగం సురేష్‌ తమ ప్రాంతాలకు చేసిన మేలు ఏదీ లేదని.. కనీసం తమ సమస్యలను కూడా పట్టించుకోరు అనే భావన జనాల్లో వినిపిస్తోంది. దీంతో 2019తో కంపేర్ చేస్తే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కఠిన పరిస్థితులు ఎదురుకావడం ఖాయంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా సురేష్ మళ్లీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తున్నా.. మాజీ హోంమంత్రి సుచరిత భర్త దయాసాగర్ ఎంపీ టికెట్ కోసం వైసీపీ, టీడీపీ నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎంపీ సురేష్‌ను వేమూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో దింపాలని పార్టీ అధిష్టానం భావిస్తే.. ఇక్కడ కొత్తవారికి ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కనుంది. దీంతో వైసీపీ పెద్దల నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన మాల్యాద్రి శ్రీరామ్‌… ఓడిన తర్వాత నియోజకవర్గం వైపు కూడా చూడలేదు. ఐతే ఈ టికెట్ కోసం సైకిల్ పార్టీలో భారీ పోటీ కనిపిస్తోంది. న్యాయవాది, జైభీమ్‌ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్కు మార్‌, మాజీ ఎంపీ సలకల బెంజిమెన్ కుమారుడు రాజశేఖర్‌, అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు పనబాక లక్ష్మీ టీడీపీ తరఫున టికెట్‌ రేసులో ఉన్నారు. స్థానికంగా ఎంపీ సురేష్‌ మీద వ్యతిరేకత ఉన్నా.. దాన్ని క్యాష్‌ చేసుకునేందుకు టీడీపీ తరఫున అభ్యర్ధి కూడా కనిపించని పరిస్థితి.

అదే క్రమంలో బాపట్ల పార్లమెంట్‌ పరిధిలో బాపట్ల అసెంబ్లీతో పాటు.. వేమూరు, రేపల్లె, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు సెగ్మెంట్‌లు ఉన్నాయ్. అక్కడ రాజకీయా పరిస్ధితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

anagani satya prasad, ramana, haranadh

anagani satya prasad, ramana, haranadh

READ ALSO : Machilipatnam Lok Sabha Constituency : రసవత్తరంగా బందరు పాలిటిక్స్…మచిలీపట్నం చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలు!

రేపల్లె టిడిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా అనగాని సత్యప్రసాద్‌.. మోపిదేవి సోదరుడు హరినాధబాబుకు టికెట్ ఇవ్వాలని ఓవర్గం నుంచి డిమాండ్‌..
బాపట్ల పరిధిలో రేపల్లె అసెంబ్లీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. అనగాని సత్యప్రసాద్‌ ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో జగన్ హవాలోనూ.. సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణపై విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ అనగాని మళ్లీ బరిలో దిగడం దాదాపు ఖాయం. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన ఆయన.. హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. మోపిదేవి కుటుంబంపై ఉన్న వ్యతిరేకత.. అనగానికి కలిసిరానుంది. నిత్యం అందుబాటులో ఉంటారని ఆయనకు పేరు. సొంత సామాజికవర్గం అయిన గౌడ ఓటర్లు అండగా ఉండడం అదనపు బలం. వైసీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో కుమారుడు రాజీవ్‌ను బరిలో దింపాలని మోపిదేవి రంగం సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గ పార్టీ శ్రేణులకు ఇప్పటికే పరిచయం కూడా చేశారు. గడప గడపకు కార్యక్రమంలోనూ రాజీవ్ చురుకుగా పాల్గొంటున్నారు. ఐతే వారసులకు అవకాశం లేదన్న జగన్ ప్రకటనతో.. మోపిదేవి పరిస్థితి ఏంటి అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. మోపిదేవి సోదరుడు హరినాధ బాబు నియోజకవర్గంలో చురుకుగా తిరుగుతున్నారు. హరినాధబాబుకు టికెట్ ఇవ్వాలని పార్టీ శ్రేణుల్లో ఓ వర్గం నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఐతే మోపిదేవి తమ్ముడు, కుమారుడు.. రేపల్లెను పేకాట క్లబ్‌గా మార్చారని.. ఇసుక తవ్వకాలు, మైన్ గ్రావెల్ అక్రమాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపించడం.. ఇక్కడ వైసీపీకి మైనస్‌గా మారే చాన్స్ ఉంది. ఫిషింగ్ హార్బర్ సాధించి.. అభివృద్ది పనులు చేపడుతుంటం మోపిదేవికి, వైసీపీకి ప్లస్‌. రేపల్లో కాపు ఓటర్లు 44వేలకు పైగా ఉన్నారు. టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే.. అనగానిని ఢీకొట్టడం వైసీపీకి అంత ఈజీ కాదు.

Meruga, nakka

Meruga Nagarjuna, Nakka Anand Babu

సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా మంత్రి మెరుగు నాగార్జున…సొంత పార్టీ నేతలే వ్యతిరేకం…టీడీపీకి ప్లస్ అయ్యే చాన్స్‌
కంచుకోటలాంటి వేమూరులో గత ఎన్నికల్లో టీడీపీకి షాక్ తగిలింది. మంత్రి మెరుగు నాగార్జున ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే మంత్రిగా ఉన్నా.. ఓ ఐదుగురిని మినహాయించి పార్టీ కేడర్‌ను పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. స్థానికంగా మౌలిక వసతుల కల్పనలో నాగార్జున విఫలం అయ్యారని.. ఇసుక అక్రమ రవాణాతో పాటు.. పసుపు, మొక్కజొన్న పంట కొనుగోలులో ఆయన మనుషులు అక్రమాలకు పాల్పడుతున్నారని.. చెరువుల పూడికతీత పేరుతో మట్టితో అక్రమ వ్యాపారం చేస్తున్నారనే విమర్శలు జనాల నుంచి వినిపిస్తున్నాయ్. అటు జనాల్లో, ఇటు పార్టీలోనూ నాగార్జున తీరుపై అసంతృప్తి మొదలైందనే టాక్ ఉంది. వచ్చే ఎన్నికల్లో నాగార్జున పోటీ చేస్తే.. సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అభ్యర్థిని మార్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉందని తెలుస్తోంది. 2014లో టికెట్ ఆశించి భంగపడిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి కూచిపూడి బాబూరావుతో పాటు.. బాపట్ల ఎంపీ సురేష్, మాజీ హోంమంత్రి సుచరిత భర్త దయాసాగర్ పేర్లను ఫ్యాన్‌ పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారు. నాగార్జున మీద వ్యతిరేకత.. ఇక్కడ టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయ్. గత ఎన్నికల్లో పోటీ చేసిన నక్కా ఆనందబాబు.. 2024 బరిలో నిలవడం ఖాయం. జనసేనతో పొత్తు కుదిరితే.. ఇక్కడ టీడీపీని ఎదుర్కోవడం వైసీపీకి చాలా కష్టమనే చెప్పాలి.

kona, vegesena

Kona Raghupathi, Vegesna Narendra Varma

READ ALSO : Araku Lok Sabha Constituency : రాజకీయాలకు వార్ జోన్‌గా మారిన అరకు….ఆంధ్రా ఊటీ లో హాట్ హాట్ గా రాజకీయాలు

బాపట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కోన రఘుపతి…వచ్చే ఎన్నికల్లో రెడ్డి వర్గానికి టికెట్ ఖాయమా?
బాపట్ల అసెంబ్లీలో కోన రఘుపతి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024 బరిలోనూ మళ్లీ ఆయనే నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. వివాదాలకు దూరంగా ఉండడం కోనకు మేజర్ ప్లస్‌. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించడం, గడపగడపకు కార్యక్రమంలో జనాలకు చేరువ కావడం, భావదేవుని ఆలయం గాలి గోపురం నిర్మాణానికి అనుమతులు తెప్పించి.. వేగంగా పూర్తి చేయడం.. స్థానికంగా రోడ్ల విస్తరణ, సూర్యలంక బీచ్‌లో వ్యాపార సముదాయాల ఆధునీకరణ, తన హయాంలో బాపట్ల మెడికల్ కాలేజీ రావడం, 2022లో బాపట్లను జిల్లాగా ప్రకటించడం.. ఇలాంటి వాటితో జనాల్లో కోన రఘుపతికి మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇసుక అక్రమ వ్యాపారాలు, కబ్జాల ఆరోపణలతో పాటు.. సొంత పార్టీ నేతలను పట్టించుకోరు అనే విమర్శలు కూడా ఆయన మీద ఉన్నాయ్. కోన విజయానికి కష్టపడితే.. వచ్చే ఎన్నికల్లో రెడ్డి వర్గానికి టికెట్ ఖాయమని 2019లో జగన్‌ హామీ ఇచ్చారు. దీంతో తమ సామాజికవర్గ నేతకు టికెట్ ఇవ్వాలంటూ రెడ్డి వర్గం నుంచి వైసీపీ అధిష్టానం మీద ఒత్తిడి పెరుగుతుండడం.. కోన రఘుపతికి ఇబ్బందిగా మారనుంది. మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి అల్లుడు మధుసుధన్ రెడ్డి వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అన్నం సతీష్ ప్రభాకర్.. ఇప్పుడు కాషాయం కండువా కప్పుకున్నారు. కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా ఉన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. సతీష్‌ ప్రభాకర్ బీజేపీలో చేరడంతో.. వేగేశ్న నరేంద్రవర్మ అనే వ్యాపారిని తెరమీదకు తెచ్చింది టీడీపీ. ఆర్థికంగా బలమైన నాయకుడే అయినా.. పార్టీ కేడర్‌ను బ్యాలెన్స్ చేయలేకపోవడం నరేంద్రకు మైనస్‌. సామాజిక కార్యక్రమాలతో దూసుకుపోతున్నా.. కోన రఘుపతి ఓడించే స్థాయికి ఇంకా నరేంద్ర వర్మ బలం పుంజుకోలేదని బాపట్లలో టాక్.

yeluri, amanchi

Yeluri Sambasiva Rao, Amanchi Krishna Mohan

టీడీపీకి కంచుకోటలా పర్చూరు అసెంబ్లీ… వచ్చే ఎన్నికల్లో మళ్లీ బరిలోకి ఏలూరి సాంబశివరావు
పర్చూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటలా ఉంది. ఏలూరి సాంబశివరావు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున మళ్లీ ఆయనే బరిలోకి దిగడం ఖాయం. గత ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరావు వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కుమారుడు హితేశ్ పోటీకి దిగాల్సి ఉన్నా.. పౌరసత్వం రగడతో.. చివరి నిమిషంలో దగ్గుబాటి వెంకటేశ్వర్లు పోటీ చేయాల్సి వచ్చింది. ఐతే గత ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో దగ్గుబాటి వెంకటేశ్వర్లు రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని.. డబ్బులు, కేసుల చుట్టూ తిరుగుతున్న పాలిటిక్స్‌లో ఇమడలేనని.. కుమారుడితో సహా రాజకీయాలకు గుడ్ బై చెప్పారు దగ్గుబాటి వెంకటేశ్వర్లు. ఐతే కొరకరాని కొయ్యగా మారిన పర్చూరులో ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ పట్టుదలతో ఉంది. రావి రామనాథంను పక్కనపెట్టి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను ఇంచార్జి బాధ్యతలు అప్పగించింది.

READ ALSO : Kammam Politics : ఖమ్మం చుట్టూ తిరుగుతున్న తెలంగాణా రాజకీయం… గులాబీ పార్టీలో గ్రూపుల గుబులు

2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆమంచి వ్యూహాలు
తనకు టికెట్‌ కన్ఫార్మ్ కావడంతో.. 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు ఆమంచి. నియోజకవర్గంలో కీలకం అయిన కాపు సామాజికవర్గ ఓటర్ల మనసు గెలుచుకునేందుకు తెలివిగా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ.. పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అలర్ట్ అయిన ఏలూరి సాంబశివరావు.. దగ్గుబాటి అనుచరవర్గాల్లో కీలక నేతలతో టచ్‌లోకి వెళ్లి తనవైపు తిప్పుకున్నారు. జనాలకు అందుబాటులో ఉండే నేతగా, సౌమ్యుడిగా, పోల్‌ మేనేజ్‌మెంట్‌లో దిట్టగా సాంబశివరావుకు పేరు ఉంది. ఇది ఆయనకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయ్. కరోనా సమయంలో పట్టించుకోలేదనే అసంతృప్తి జనాల్లో ఉంది. దగ్గుబాటి ఫ్యామిలీ అండతో పాటు.. కరణం బలరాం వర్గం మద్దతు.. మాజీ ఎమ్మెల్యే కుమారుడు గొట్టిపాటి భరత్ వర్గంతో పాటు.. కాపు ఓట్లు, దళితులు, మైనారిటీ, రెడ్డి సామాజికవర్గ ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని ఆమంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జరిగితే.. 2024 పర్చూరు ఫైట్ ఆసక్తికరంగా మారడం ఖాయం.

Gottipati Ravikumar

Gottipati Ravi kumar

అద్దంకిలో 2009 నుంచి వరుసగా గొట్టిపాటి విజయం.. కమ్మ సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉండడం ప్లస్‌
అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009 నుంచి ఆయన వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. నిత్యం జనాలకు అందుబాటులో ఉండటం, నియోజకవర్గ సమస్యలపై పోరాడడం, జిల్లా అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో రవికుమార్‌కు జనాల్లో ముఖ్యంగా రైతుల్లో నమ్మకం సంపాదించారు. కమ్మ సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉండడం.. గొట్టిపాటికి కలిసొచ్చే అవకాశం ఉంది. అన్ని వర్గాలతో కలుపుగోలుగా ఉండడం, పార్టీలకు అతీతంగా వ్యవహరించే గుణం, సౌమ్యుడు, ఓర్పుగల వాడనే పేరు గొట్టిపాటికి అనుకూలంగా మారనుంది. పోల్‌మేనేజ్‌మెంట్‌లో దిట్టకావడం, అనుచరవర్గం బలంగా ఉండడం కూడా ప్లస్‌గా మారనుంది. పైగా గొట్టిపాటికి చెందిన గ్రానైట్ పరిశ్రమలపై… వైసీపీ సర్కార్‌ దాడులు నిర్వహించి మూసివేయించిందనే సానుభూతి జనాల్లో ఉంది. వైసీపీ తరఫున బాచిన చెంచు గరటయ్య కుమారుడు కృష్ణచైతన్య టికెట్‌ రేసులో ఉండగా.. గొట్టిపాటితో కంపేర్‌ చేస్తే.. రాజకీయంగా అనుభవలేమి, కలుపుగోలుగా లేకపోవడం, పోల్‌మేనేజ్‌మెంట్‌లో పట్టు లేకపోవడం.. వైసీపీకి మైనస్ అయ్యే చాన్స్ ఉంది.

గొట్టిపాటి వైసీపీలో ఉన్నప్పుడు ఆయన కోసం పనిచేసిన వారిలో కొందరితో పాటు.. కరణం అనుచరులు ప్రస్తుతం కృష్ణ చైతన్య కోసం పనిచేస్తున్నారు. దీంతో ఆయన గెలుపు మీద ధీమాగా ఉన్నారు. ఐతే ఎన్నికల నాటికి బలరాం వర్గంతో పాటు గొట్టిపాటి వర్గం కూడా.. కృష్ణచైతన్య వెంట ఉండకపోవచ్చనే చర్చ నడుస్తోంది. వీటన్నింటికి తోడు వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేసిన వారిని, రెడ్డి సామాజికవర్గ నేతలను కృష్ణచైతన్య పక్కనపెట్టారని.. టీడీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ ఉంది. దీంతో కృష్ణ చైతన్య తీరుపై అసంతృప్తితో ఉన్న నేతలు కొందరు.. గొట్టిపాటితో టచ్‌లోకి వెళ్లిపోయారని టాక్‌. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. కరణం బలరాంను పోటీకి దింపాలని పార్టీ అధిష్టానం ముందుగా భావించినా.. చీరాల నుంచి వచ్చేందుకు ఆయన నిరాకరించారు. దీంతో వైసీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో ఎవరు బరిలో నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Balaram, venkatesh

Karanam Balaram, Venkatesh

చీరాల నుండి వచ్చే ఎన్నికల్లో కరణం బలరాం కుమారుడు వెంకటేశ్ పోటీ చేసే ఛాన్స్
చీరాలలో కరణం బలరాం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన బలరాం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కుమారుడితో కలిసి వ్యూహాత్మకంగా వైసీపీ జెండా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కరణం బలరాం కుమారుడు వెంకటేశ్ వైసీపీ నుంచి బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నారు. కరణం పార్టీ మారడంతో.. ఇక్కడ టీడీపీకి నాయకుడు లేకుండా పోయారు. గతంలో టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండయ్యను ఇక్కడ ఇంచార్జింగా నియమించారు. ఐతే ఆయన పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. పొత్తు కుదిరితే ఈ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుండడంతో.. కొండయ్య ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. జనసేన ఫ్లెక్సీలో పవన్‌తో కలిసి ఆమంచి స్వాములు కనిపించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. జనసేన నుంచి స్వాములు టికెట్ ఆశిస్తూ.. వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఆమంచి కుటుంబానికి చీరాలలో 40వేలకు పైగా ఓటు బ్యాంక్ ఉంది. టీడీపీ, జనసేన పొత్తు కుదిరి ఆమంచి స్వాములు బరిలో దిగితే.. కరణం వెంకటేశ్‌కు గట్టి పోటీ తప్పదు.

Kondaiah

Kondaiah

జనసేనకు చీరాల సీటు కేటాయిస్తే కొండయ్యను ఒంగోలు ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో టిడిపి..
జనసేనకు చీరాల సీటు కేటాయిస్తే.. కొండయ్యను ఒంగోలు ఎంపీగా పోటీ చేయించడం కానీ.. లేదంటే మరో కీలక పదవి అప్పగించి యాదవ ఓటు బ్యాంక్‌ను ఓన్ చేసుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఐతే వైసీపీ నుంచి కరణం బలరాం పోటీ నిలిస్తే పరిస్థితి మెరుగ్గా ఉంటుందని… ఆయన కుమారుడు పోటీ చేస్తే జనాలు కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువ అనే ప్రచారం నడుస్తోంది. దీనికితోడు చీరాలలో వైసీపీ మీద కొంత వ్యతిరేక ఉంది.. సమస్యల పరిష్కారంలో కరణం బలరాం సాగదీత ధోరణి ప్రదర్శిస్తారనే పేరు మైనస్‌గా మారే చాన్స్ ఉంది. ఆమంచి వర్గం.. కరణం తీరుపై కాస్త అసంతృప్తితో ఉంది. చీరాలలో ఆమంచి వర్గం వైసీపీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయగా.. కరణం బలరాం దూరంగా ఉన్నారు. దీంతో ఈ వ్యవహారం తాడేపల్లికి చేరింది. సీఎం ఆఫీస్ సాక్షిగా సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆమంచి వర్గం.. కరణం వర్గానికి సహరించడం కష్టమే అనే చర్చ నడుస్తోంది. ఇదే జరిగితే ఆమంచి వర్గానికి చెందిన సాలిడ్ ఓట్‌బ్యాంక్‌.. ఈసారి గెలుపోటములను నిర్ణయించడంలో కీలకంగా మారనుంది. ఐతే ఎలాంటి అవినీతి ఆరోపణ లేకపోవడం కరణం బలరాంకు ప్లస్‌ అయ్యే చాన్స్ ఉంది.

sudhakar, vijayakumar

Sudhakarbabu, BS Vijayakumar

సంతనూతలపాడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుధాకర్ బాబుపై అవినీతి ఆరోపణలు.. రెండుసార్లు ఓడిపోయారన్న సానుభూతి విజయ్‌కుమార్‌కు ప్లస్
సంతనూతలపాడులో సుధాకర్ బాబు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ సైకిల్ పార్టీ గెలిచింది కేవలం మూడుసార్లు మాత్రమే ! 2014లో మంత్రి సురేష్ ఇక్కడ వైసీపీ నుంచి విజయం సాధించగా.. 2019లో సుధాకర్ బాబు గెలిచారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై రకరకాల అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయ్. ఇసుక, మట్టి మాఫియాలో పర్సంటేజీలు, గ్రానైట్‌లో డంపులను ఉచితంగా వ్యాపారస్థుల నుంచి కొట్టేయడం, కాంట్రాక్ట్ ఉద్యోగాలకు డబ్బులు డిమాండ్‌ చేయడంలాంటి ఆరోపణలతో పాటు.. రేషన్ బియ్యం అక్రమాల్లో మండల నాయకులకు అండగా ఉంటారని.. నియోజకవర్గంలో పింఛన్లు తొలగించారని.. మౌలిక వసతులను పట్టించుకోకపోవడం లేదనే విషయాల్లో జనాల్లో రకరకాల చర్చ జరుగుతోంది. గడపగడపకు కార్యక్రమంలోనూ సుధాకర్‌ బాబుకు నిరసలే ఎదురయ్యాయ్. ఇవన్నీ ఆయనకు మైనస్‌గా మారనున్నాయ్. ఐతే జగన్ కుటుంబానికి నమ్మినబంటుగా ఉండడం, మంచి విషయ పరిజ్ఞానం, బూచేపల్లి కుటుంబానికి విధేయుడిగా ఉండడం.. సుధాకర్‌బాబుకు పాజిటివ్‌గా మారనున్నాయ్.

సంతనూతలపాడులో బీఎస్‌ విజయ్‌ కుమార్‌ టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఆయన వరుస పరాభవాలు చూశారు. టికెట్ విషయంలో అధిష్టానం నుంచి ఎలాంటి హామీ రాకపోయినా.. ఆరు నెలలుగా నియోజకవర్గంలో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ప్రతీరోజూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ.. పార్టీ కేడర్‌ను ముందుండి నడిపిస్తున్నారు. ఐతే పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నుంచి విజయ్‌కుమార్‌ తమ్ముడు అనిల్‌కు సీటు కన్మార్మ్‌ చేయడంతో.. ఇక్కడి నుంచి ఆయనకు టికెట్‌ విషయంలో టీడీపీ అధిష్టానం సందిగ్ధంలో పడింది. విజయ్‌కుమార్‌ను ఇక్కడి నుంచే పోటీ చేయించాలా లేదంటే బాపట్ల పార్లమెంట్‌ బరిలో దించాలా అనే ఆలోచనలో ఉంది. మండల నాయకులతో సమన్వయం చేసుకోలేకపోవడం, కీలకమైన కమ్మ సామాజికవర్గంతో కలుపుగోలుగా ఉండకపోవడం, నాయకులకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడంలాంటివి విజయ్‌కుమార్‌కు మైనస్‌గా కనిపిస్తున్నాయ్. సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై వ్యతిరేకత, వైసీపీలో అసంతృప్తులు, రెండుసార్లు ఓడిపోయారన్న సానుభూతి విజయ్‌కుమార్‌కు ప్లస్ కానుంది.

3 నియోజకవర్గాల్లో వైసీపీ, నాలుగు స్థానాల్లో టీడీపీ విజయం
బాపట్ల పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో వైసీపీ, టీడీపీలో వర్గపోరు నడుస్తుండగా.. కుల సమీకరణాలు 2024 ఎన్నికల్లో కీలకం కానున్నాయ్. 2019ఎన్నికల్లో 3 నియోజకవర్గాల్లో వైసీపీ సత్తా చాటగా… నాలుగు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. బాపట్ల పరిధిలోని అసెంబ్లీల్లో ప్రస్తుతం వైసీపీ క్రమంగా ప్రాభవం కోల్పోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయ్. ఐతే ఎంపీ విషయంలో మాత్రం వైసీపీ వైపే విజయం కనిపిస్తున్నా.. టీడీపీ ఎవరిని అభ్యర్థిగా ఎంచుకుంటుందన్న విషయం.. ఎన్నికల్లో కీలకం కానుంది.