Kammam Politics : ఖమ్మం చుట్టూ తిరుగుతున్న తెలంగాణా రాజకీయం… గులాబీ పార్టీలో గ్రూపుల గుబులు

పొత్తులో భాగంగా పాలేరు స్థానాన్ని సీపీఎంకు కేటాయిస్తారని.. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక అటు పాలేరు మీద ఆశలు పెట్టుకున్న తుమ్మల.. తగ్గేదేలే అంటున్నారు. పాలేరు సమీపానికి మకాం మార్చిన ఆయన.. వరుస బల ప్రదర్శనలు చేస్తున్నారు.

Kammam Politics : ఖమ్మం చుట్టూ తిరుగుతున్న తెలంగాణా రాజకీయం… గులాబీ పార్టీలో గ్రూపుల గుబులు

Clear Cut Analysis On Kammam Politics

Kammam Politics : తెలంగాణ రాజకీయం అంతా ఖమ్మం చుట్టే తిరుగుతోందిప్పుడు. తెలంగాణ రాజకీయాలను నిర్దేశించే స్థాయికి చేరుకున్నాయ్ ఖమ్మం పాలిటిక్స్‌. అసలు ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలో సీన్ ఏంటి.. పార్టీల బలాలు ఏంటి.. టెన్షన్‌ పెడుతున్న విషయాలు ఏంటి.. అసంతృప్తులు కారు జోరుకు బ్రేక్‌లు వేస్తున్నాయా.. కాంగ్రెస్‌ ధీమా ఏంటి.. బీజేపీ ఎత్తులు ఎలా ఉండబోతున్నాయ్‌. టీడీపీ అంచనాలను ఖమ్మం నిలబెడుతుందా..? వైఎస్‌ పేరే గెలిపిస్తుందని షర్మిల ధీమాగా ఉన్నారా.. వామపక్షాల ఆశలు ఏంటి… గ్రౌండ్‌రిపోర్ట్‌లో క్లియర్‌కట్‌గా తెలుసుకుందాం..

ఖమ్మం చుట్టూ తిరుగుతున్న రాజకీయం

ఖమ్మం అనేది పేరు కాదు.. ఓ ఎమోషన్‌ ! రాజకీయ పార్టీలన్నీ చెప్తున్న మాట ఇదే ఇప్పుడు ! ఖమ్మం చుట్టూ తిరుగుతున్న రాజకీయం.. రోజుకో మలుపును పరిచయం చేస్తోంది. ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలో కనిపిస్తున్న ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు. గులాబీ పార్టీకి ఝలక్ ఇచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతుండడం.. ఖమ్మం జిల్లాను కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. ఇలాంటి పరిణామాలతో ఖమ్మం రాజకీయం మరింత రంజు మీద కనిపిస్తోంది.

nama nageswara rao

nama nageswara rao

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఖమ్మంలో త్రిముఖ పోటీ ఖాయం

గత ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎంపీని కాదని.. టీడీపీ నుంచి వలస వచ్చిన నామా నాగేశ్వరరావుకు ఖమ్మం ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు కేసీఆర్‌. ఆ రోజు మొదలు.. ఖమ్మంలో అసంతృప్తి.. అగ్నిజ్వాలలా ఎగిసిపడుతోంది. ఖమ్మంలో గులాబీ పార్టీ గ్రూప్‌లుగా విడిపోయింది. ఎన్నికల ఇయర్‌లోకి అడుగు పెట్టిన వేళ.. పార్టీలో అసంతృప్త నేతలు తుది నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి… బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో ఖమ్మం పార్లమెంట్‌ స్థానంలో ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావుకు సొంత పార్టీ నుంచి పోటీ లేకుండా పోయింది. ఇక బీజేపీ నుంచి వాసుకీ వాసుదేవరావుతో పాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గెల్లా సత్యానారాయణ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయ్. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ రేణుకా చౌదరి, ఆ పార్టీ సీనియర్ నాయకులు వీహెచ్‌, అజారుద్దీన్ బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో ఖమ్మంలో త్రిముఖ పోటీ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్.

READ ALSO :Amalapuram Lok Sabha constituency : కోనసీమలో పట్టుకోసం అధికార వైసీపి ఎత్తుగడలు.. రాజకీయ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న టీడీపీ, జనసేన !

ఖమ్మం పార్లమెంట్ స్థానం పరిధిలోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీల మధ్య బీభత్సమైన పోటీ కనిపిస్తోంది. ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలోని ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం జనరల్ స్థానాలు కాగా… సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్‌డ్‌.. వైరా, అశ్వరావుపేట నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్‌డ్‌. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ప్రతీ పార్టీలో రెండు గ్రూప్‌లు కనిపిస్తున్నాయ్. అధికార పార్టీలో మరీ ఎక్కువ ! ఇక ఈ నియోజకవర్గాల నుంచి టికెట్‌ ఆశిస్తున్న నేతలు.. ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీటు రాదు అని భావిస్తున్న వారు ముందుగానే వేరే దారి చూసుకుంటున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావులాంటి నేతలు.. కారు దిగి కమలం గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుండగా.. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్‌లో భారీ కుదుపు ఉండొచ్చనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కనిపిస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయ్.

Puvvada Ajay Kumar

Puvvada Ajay Kumar

కీలకంగా మారనున్న ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం

ఖమ్మం నియోజకవర్గం జనరల్‌ చూస్తే.. 2014ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పువ్వాడ అజయ్‌.. టీడీపీ అభ్యర్థి తుమ్మలపై విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన పువ్వాడ.. 2018లో గులాబీ గుర్తుపై పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మీద విజయం సాధించారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న పొంగులేటి.. కమలం గూటికి చేరితే ఖమ్మం నుంచే పోటీ చేస్తారన్న ప్రచారం నడుస్తోంది. ఇక కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఇప్పటికే ఆ నేతలంతా ఖమ్మంలో సర్వేలు కూడా చేయించుకుంటున్నారని టాక్‌. దీంతో ఈ పార్లమెంట్‌ పరిధిలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం ఈ అసెంబ్లీ ఎన్నిలకు కీలకం కాబోతోంది.

Tammineni Veerabhadram

Tammineni Veerabhadram

పాలేరు నియోజకవర్గం నుండి సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం పోటీచేస్తారా..

ఇక పాలేరు నియోజకవర్గం పరిణామాలను రాష్ట్రం అంతా ఆసక్తిగా గమనిస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కందాల ఉపేందర్ రెడ్డి.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి.. తుమ్మల మీద విజయం సాధించారు. ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం కారెక్కారు. ఆరోజు నుంచి నేటి వరకు తుమ్మల వర్సెస్ కందాల పోరు కొనసాగుతోంది. ఇక పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల.. పార్టీ ఆఫీస్‌ కూడా ప్రారంభించారు. దీంతో పాలేరు రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక అటు ప్రస్తుతం బీఆర్ఎస్‌, వామపక్షాలు పొత్తులో ఉన్నాయ్. పొత్తులో భాగంగా పాలేరు స్థానాన్ని సీపీఎంకు కేటాయిస్తారని.. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక అటు పాలేరు మీద ఆశలు పెట్టుకున్న తుమ్మల.. తగ్గేదేలే అంటున్నారు. పాలేరు సమీపానికి మకాం మార్చిన ఆయన.. వరుస బల ప్రదర్శనలు చేస్తున్నారు. బీఆర్ఎస్‌ నుంచి టికెట్‌ రాకపోతే.. టీడీపీ మద్దతుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధిస్తాననే ధీమాతో ఉన్నారు. కారుకు బైబై చెప్పి కమలం గూటికి చేరితే.. బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉండే చాన్స్‌ ఉందని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌ నుంచి రాయల నాగేశ్వరరావు, రామ సహాయం మాధవరెడ్డి, మద్ది శ్రీనివాసరెడ్డి.. పాలేరులో పోటీకి సిద్ధంగా ఉన్నారు.

READ ALSO : Telangana politics : ఖమ్మం చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయం..రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్నీ పార్టీల గురి ఖమ్మంపైనే…

mla ramulu naik

mla ramulu naik

ఆసక్తి రేపుతున్న వైరా నియోజకవర్గం రాజకీయాలు..

వైరా నియోజకవర్గంలో పరిణామాలు కూడా ఆసక్తి రేపుతున్నాయ్. 2018లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలిచిన లావుడ్యా రాములు నాయక్.. గులాబీ పార్టీ అభ్యర్ధి మదన్‌లాల్‌పై విజయం సాధించారు. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో మదన్‌లాల్‌ వర్సెస్‌ రాములు నాయక్ మధ్య గ్రూప్‌ రాజకీయాలు మొదలయ్యాయ్‌. వైరాలో బీఆర్ఎస్‌ నుంచి రాములు నాయక్‌తో పాటు అతని కుమారుడు జీవన్ లాల్, మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్, బానోత్ చంద్రావతి పేర్లు పోటీలో వినిపిస్తున్నాయ్. ఇక కాంగ్రెస్ నుంచి బానోత్ బాలాజీ, మాలోత్‌ రాందాస్ నాయక్, రాంమూర్తి నాయక్, కుర్సం సీతారాములు పేర్లు వినిపిస్తున్నాయ్. ఇక బీజేపీ నుంచి భూక్యా శ్యాం సుందర్ నాయక్, కాట్రావత్ మోహన్ నాయక్, రేష్మీ రాథోడ్‌లో ఒకరికి అవకాశం దక్కే చాన్స్ ఉంది. పొత్తులో భాగంగా వామపక్షాలకు అవకాశం ఇస్తే.. సీపీఎం నుంచి భూక్యా వీరభద్రం నాయక్, సీపీఐ నుంచి బానోత్ విజయాభాయ్ బరిలో నిలిచే చాన్స్ ఉంది.

Bhatti Vikramarka

Bhatti Vikramarka

కాంగ్రెస్ కంచుకోట మధిరలో భట్టి విక్రమార్కకు ఎదురులేదా…

ఒకప్పుడు కమ్యూనిస్టులకు అడ్డాగా ఉన్న మధిర.. ఇప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ భట్టినే పోటీలో ఉండడం ఖాయం. బీఆర్ఎస్‌ నుంచి ప్రస్తుత జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్‌రాజ్, తెలంగాణ ఉద్యమకారుడు బొమ్మెర రామ్మూర్తి, కోటా రాంబాబు పేర్లు వినిపిస్తున్నాయ్. ఇక పొత్తులో భాగంగా మధిర సీటును సీపీఎం ఆశించే అవకాశాలు ఉన్నాయ్. సీపీఎం తరపున వెంకట్, మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు పేర్లు తెరమీదకు వస్తున్నాయ్. ఇక బీజేపీ నుంచి పెరుమాళ్లపల్లి విజయ్ రాజు టికెట్ ఆశిస్తున్నారు.

Sandra Venkat Veeraiah

Sandra Venkat Veeraiah

సత్తుపల్లిలో మరోసారి సత్తాచాటేందుకు సిద్ధమౌతున్న సండ్ర…

2018 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పిడమర్తి రవిపై విజయం సాధించారు. ఆ తర్వాత సండ్ర కారెక్కారు. ఈసారి కూడా సండ్ర టికెట్ ఆశిస్తుండగా.. పిడమర్తి రవి, డాక్టర్ మట్టా దయానంద్ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ రావు, అధికార ప్రతినిధి మానవతా రాయ్ బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన నంబూరి రామలింగేశ్వరరావు తప్ప.. ఎవరూ పోటీలో కనిపించడం లేదు. పొంగులేటి బీజేపీలో చేరితే.. అతని అనుచరుడు డాక్టర్ మట్టా దయానంద్.. కమలం పార్టీ నుంచి బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయ్.

READ ALSO :Telangana Politics : హీటెక్కుతున్న ఖమ్మం పాలిటిక్స్ .. పొంగులేటిపై మూడు పార్టీల ఫోకస్ .. మరి ఏ గూటికి చేరతారో?

Vanama venkateswara rao

Vanama venkateswara rao

కొత్తగూడెం నియోజకవర్గం బీఆర్ఎస్‌ అభ్యర్ధిగా బరిలో తానేన్న ధీమాలో వనమా…

కొత్తగూడెంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు.. టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంటర్రావుపై విజయం సాధించారు. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. నాటి నుంచి వనమా వర్సెస్ జలగంగా సీన్‌ మారింది. వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పైగా ఎన్నికల కమిషన్‌కి వనమా తప్పుడు ధృవపత్రాలు సమర్పించారని జలగం వెంకట్రావు కేసు వేశారు. దీంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఐతే ఈసారి కూడా తానే బరిలో నిలుస్తానని వనమా అంటుంటే.. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జలగం వెంకట్రావు, తెలంగాణ హెల్త్ డైరక్టర్ గడల శ్రీనివాసరావుతో పాటు.. పార్టీ మారకపోతే పొంగులేటి కూడా పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించే అవకాశాలు ఉన్నాయన్న చర్చ కూడా జరుగుతోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తారని టాక్‌. ఇక బీజేపీ నుంచి కోనేరు సత్యనారాయణ, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయ్.

Mecha Nageswara Rao

Mecha Nageswara Rao

అశ్వరావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు గెలుపు సులువేనా…

అశ్వారావుపేటలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు.. టీఆర్ఎస్‌ అభ్యర్ధి తాటి వెంకటేశ్వర్లుపై విజయం సాధించారు. ఆ తర్వాత మెచ్చా కారు పార్టీలో చేరారు. ఆ తర్వాత తాటి వెంకటేశ్వర్లు కారు దిగి.. కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్ఎస్‌ నుంచి నుండి మెచ్చా నాగేశ్వరరావుకు పోటీ లేదు. కాంగ్రెస్ నుంచి తాటి వెంకటేశ్వర్లుతో పాటు సున్నం నాగమణి, వగ్గేల పూజ పోటీ పడుతున్నారు. ఇక బీజేపీ నుంచి భూక్యా ప్రసాద్‌ టికెట్ ఆశిస్తున్నారు. పొంగులేటి బీజేపీలో చేరితే.. ఆయన అనుచరుడు జారే ఆదినారాయణకు కమలం పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయ్‌.

ఖమ్మం కాంగ్రెస్ లో కల్లోలం రేపుతున్న గ్రూపు రాజకీయాలు…

మొత్తానికి చూసుకుంటే గ్రూప్ రాజకీయాలు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ను ఇబ్బందిపెడుతున్నాయ్. 2018ఎన్నికల్లో హస్తం పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత నలుగురు కారెక్కగా.. భట్టితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మాత్రమే కాంగ్రెస్‌లో ఉన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న భట్టి.. ఎనిమిదేళ్లుగా పార్టీని లీడ్‌ చేస్తున్నారు. సైకిల్ యాత్రలు, పాదయాత్రలు, సభలు, రచ్చబండ సభలు ఇలా నిత్యం జనాల్లో ఉంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. పైకి అంతా కూల్‌గానే కనిపిస్తున్నా.. అంతర్గతంగా ఎవరికి వారే అన్నట్లు కాంగ్రెస్‌ నేతలు కనిపిస్తున్నారు. దీంతో ఖమ్మంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది. ఇక అటు బీజేపీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దగా బలం లేదు. వలసలను ప్రోత్సహించడం ద్వారా బలపడాలన్న ఆలోచనలో ఉంది. మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి తుమ్మల కమలతీర్థం పుచ్చుకుంటే.. బీజేపీ ఒక్కసారిగా బలం పుంజుకునే అవకాశాలు ఉన్నాయ్. ఇక అటు బీజేపీ రాష్ట్ర పెద్దలు కూడా ఖమ్మం మీద ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. వలసలను ప్రోత్సహించడంతోపాటు.. క్షేత్రస్థాయిలో కేడర్‌ పెంచుకునేలా ప్లాన్‌ చేస్తున్నారు.

READ ALSO : Renuka Chowdhury : ఖమ్మం, గుడివాడ.. రెండు చోట్లా పోటీ చేస్తా- మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు

ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సత్తాచాటడంలో ఇబ్బందులు పడుతున్న గులాబీ పార్టీ…

ముందు నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తా చాటడంలో గులాబీ పార్టీ ఇబ్బందులు పడుతూనే ఉంది. దీంతో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని కారు పార్టీ డిసైడ్ అయింది. ప్రస్తుతం బీఆర్ఎస్‌తో వామపక్షాలు పొత్తులో ఉన్నాయ్. ఇది వచ్చే ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఐతే బీఆర్ఎస్‌తో ఎలా అడుగు ముందుకు వేయాలన్న దానిపై కామ్రేడ్లు కసరత్తు మొదలుపెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో… పాలేరు, మధిర, భద్రాచలం, వైరా సీట్లను సీపీఎం ఆశిస్తుండగా.. కొత్తగూడెం, వైరా , పినపాక సీట్లపై సీపీఐ కన్నేసింది. దీంతో కేసీఆర్ నిర్ణయాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఏమైనా 2023 వేడి ముందుగా ఖమ్మం నుంచే మొదలైనట్లు క్లియర్‌గా అర్థం అవుతోంది. ఇక్కడి ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను నిర్దేశించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.