Amalapuram Lok Sabha constituency : కోనసీమలో పట్టుకోసం అధికార వైసీపి ఎత్తుగడలు.. రాజకీయ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న టీడీపీ, జనసేన !

పొత్తులో.. రాజోలు సీటు గనక జనసేనకు ఇస్తే.. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. పి.గన్నవరం సీటు అడిగే అవకాశముంది. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న మోకా ఆనందసాగర్ కూడా టికెట్ రేసులో ఉన్నారు. దళితుల్లో ఆనందసాగర్‌కి కొంత సానుకూలత ఉండటంతో.. టీడీపీ అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు.

Amalapuram Lok Sabha constituency : కోనసీమలో పట్టుకోసం అధికార వైసీపి ఎత్తుగడలు.. రాజకీయ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న టీడీపీ, జనసేన !

amalapuram lok sabha constituency current political scenario assembly constituency wise analysis

Amalapuram Lok Sabha constituency : అమలాపురం.. ఆ పేరు వినగానే కోనసీమ గుర్తొస్తుంది. ఆ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా.. ఎంత పచ్చగా కనిపిస్తుందో.. అక్కడి రాజకీయం అంతకుమించిన రచ్చతో ఉంటుంది. గత ఎన్నికల్లో.. వైసీపీ వేవ్‌లో అమలాపురం పార్లమెంట్ స్థానం వైసీపీ ఖాతాలో పడింది. ఇటీవలే జిల్లా పేరు మార్పు విషయంలో.. అధికార వైసీపీకి నిరసన సెగలు గట్టిగా తాకాయ్. మరి.. ఇప్పుడు జనంలో ఇంకా ఆ వ్యతిరేకత కనిపిస్తోందా? విపక్షాలు ఆ నేమ్ ఛేంజ్ ఎపిసోడ్‌నే.. బలంగా మార్చుకోబోతున్నాయా? కోనసీమలో తిరిగి పుంజుకునేందుకు.. అధికార వైసీపీ వేస్తున్న ఎత్తుగడలేంటి? రాబోయే ఎన్నికల కోసం.. టీడీపీ, జనసేనతో సహా మిగతా పార్టీలు సిద్ధం చేసుకుంటున్న రాజకీయ అస్త్రాలేంటి?

konaseema

konaseema

అమలాపురం నుండి చింతా అనురాధ తిరిగి బరిలోకి దిగుతారా ?

అమలాపురం దేశంలోనే ఎస్సీ జనాభా అత్యధికంగా ఉన్న మూడో పార్లమెంట్ స్థానం. అంతేకాదు.. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో.. 3 ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలున్నాయ్. 1957లో అమలాపురం పార్లమెంట్ స్థానానికి తొలిసారి ఎన్నికలు జరిగాయ్. మొట్టమొదటగా కమ్యూనిస్టుల జెండా ఎగిరినా.. తర్వాత వరుసపెట్టి కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. అప్పుడప్పుడు తెలుగుదేశం అభ్యర్థులు గెలిచినా.. ఎక్కువగా కాంగ్రెస్ నేతలే అమలాపురం నుంచి ఎంపీలుగా ప్రాతినిథ్యం వహించారు. అయితే.. 2019లో తొలిసారి అమలాపురంలో గెలుపు ఖాతా ఓపెన్ చేసింది వైసీపీ. జగన్ వేవ్‌లో.. ఈ ఎంపీ సీటు కూడా వైసీపీ ఖాతాలో పడిపోయింది. ప్రస్తుతం.. చింతా అనురాధ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆవిడ.. ప్రజల్లో తిరుగుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి చేరుతున్నాయో లేదో.. ఆరా తీస్తున్నారు. తన పార్లమెంట్ పరిధిలో ఎవరికే సమస్య వచ్చినా.. వెంటనే స్పందించి.. జనానికి అందుబాటులో ఉంటారనే పేరు కూడా ఉంది. అయితే.. మంత్రి విశ్వరూప్‌తో ఉన్న కొన్ని అంతర్గత విభేదాలతో.. ఆవిడ విషయంలో క్యాడర్ కొంత వ్యతిరేకతతో ఉన్నారని సమాచారం. అందువల్ల.. తిరిగి ఆవిడ ఎంపీగా పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో.. పి.గన్నవరం నుంచి పోటీ చేసేందుకు పైస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ముందుగా.. అమలాపురం నుంచే పోటీ చేసేందుకు సిద్ధమైనా.. మంత్రి విశ్వరూప్ ఉండగా.. తనకు సీటు దక్కే అవకాశం లేదని.. పి.గన్నవరం నుంచి పోటీ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

READ ALSO : Amalapuram Lok Sabha constituency : కోనసీమలో పట్టుకోసం అధికార వైసీపి ఎత్తుగడలు.. రాజకీయ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న టీడీపీ, జనసేన !

ఇక.. టీడీపీ విషయానికొస్తే.. బాలయోగి కుమారుడు హరీశ్ మాథుర్.. మళ్లీ పార్లమెంట్ బరిలోనే నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ.. టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరినా.. ఈ స్థానం నుంచి కచ్చితంగా టీడీపీ అభ్యర్థియే బరిలోకి దిగుతారు. హరీశ్ మొదట్లో పెద్దగా జనంలో కనిపించకపోయినా.. ఇప్పుడు మాత్రం అమలాపురం లోక్ సభ పరిధిలోని నియోజకవర్గాలన్నింటిని చుట్టేస్తున్నారు. క్యాడర్‌ను కలుపుకొని ముందుకు సాగుతున్నారు. అయితే.. పార్టీలోని కొందరు పెద్దలు మాత్రం పి.గన్నవరం నియోజకవర్గం నుంచి హరీశ్ మాథుర్‌ని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. హరీశ్ మాత్రం.. పి.గన్నవరానికి తాను తాత్కాలిక ఇంచార్జ్ మాత్రమేనని తేల్చి చెప్పేస్తున్నారు. దాంతో.. ఆయన ఎంపీగానే పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయ్. ఒకవేళ ముందస్తు ఎన్నికలొస్తే మాత్రం అసెంబ్లీకే పోటీ చేస్తాననే సంకేతాలు కూడా ఇస్తున్నారట. ఇక.. జనసేన నుంచి పోటీ చేసి డి.ఎమ్.ఆర్.శేఖర్.. ఈసారి అసెంబ్లీ బరిలో దిగాలనుకుంటున్నట్లు.. అధిష్టానానికి కూడా చెప్పేశారనే టాక్ వినిపిస్తోంది.

అమలాపురం పార్లమెంట్ పరిధిలో.. ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి. అవి.. అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు. వీటిలో.. 3 ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్లు కాగా.. మిగతా నాలుగు జనరల్ స్థానాలు. మొదటగా.. ఎస్సీ రిజర్వ్‌డ్ అమలాపురం సీటు విషయానికొస్తే.. ఇక్కడ ఎస్సీలతో పాటు కాపులు, శెట్టిబలిజ సామాజికవర్గాల బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో.. ఇక్కడ వైసీపీ నుంచి పినిపే విశ్వరూప్ గెలిచారు. ఆయనకు.. జగన్ క్యాబినెట్‌లో మంత్రి పదవి కూడా దక్కింది. ఇప్పటివరకున్న పరిస్థితులను బట్టి చూస్తే.. మళ్లీ విశ్వరూప్‌కే వైసీపీ నుంచి టికెట్ దక్కే చాన్స్ ఉంది. అయితే.. ఈ మధ్యకాలంలో విశ్వరూప్ కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ ఎక్కువగా ప్రజల్లో తిరుగుతున్నారు. దాంతో.. విశ్వరూప్ తన రాజకీయ వారసుడిగా తన కొడుకుని రంగంలోకి దించుతారనే ప్రచారం జరుగుతోంది. ఇక.. టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ జోరుగా సాగుతున్నాయ్. మెట్ల రమణబాబు సపోర్టుతో.. మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుది ఒక వర్గమైతే.. మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మద్దతుతో పరమట శ్యామ్‌ది మరో గ్రూప్. వీళ్లిద్దరితో పాటు జనసేన తరఫున పోటీ చేసిన ఓడిన శెట్టిబత్తుల రాజాబాబు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు కూడా టికెట్ రేసులోనే ఉన్నారు. అయితే.. రాజోలు తర్వాత జనసేనకు కాస్త పట్టున్న ప్రాంతం అమలాపురమే. దాంతో.. టీడీపీ-జనసేన పొత్తులో.. ఈ సీటు జనసేనకు అడుగుతున్నట్లు సమాచారం.

READ ALSO : Kammam Politics : ఖమ్మం చుట్టూ తిరుగుతున్న తెలంగాణా రాజకీయం… గులాబీ పార్టీలో గ్రూపుల గుబులు

ముమ్మిడివరంలో ఎమ్మెల్యే సతీశ్‌పై ఉన్న వ్యతిరేకత బుచ్చిబాబుకు అనుకూలంగా మారుతుందా..

ముమ్మిడివరం సెగ్మెంట్ విషయానికొస్తే.. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ జెండానే ఎగిరింది. పొన్నాడ వెంకట సతీశ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన.. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. అయితే.. జనానికి అందుబాటులో ఉండే విషయంలో ఎమ్మెల్యే సతీశ్‌పై అనేక విమర్శలున్నాయి. అయినప్పటికీ.. ఈసారి కూడా మళ్లీ పొన్నాడ సతీశ్‌కే.. వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే.. ఆయన ఎస్సీ సామాజికవర్గం ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సి ఉందనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ విషయానికొస్తే.. ఎన్నికలకు ముందే.. చంద్రబాబు తాళ్లరేవు బహిరంగ సభలో తెలుగుదేశం అభ్యర్థిగా దాట్ల బుచ్చిబాబు పేరుని ప్రకటించారు. పార్టీ కార్యక్రమాల్లో.. చురుగ్గా పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే సతీశ్ మీద ఉన్న వ్యతిరేకత.. ప్రస్తుతం బుచ్చిబాబుకి కొంత బూస్ట్ ఇచ్చిందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఇక.. జనసేన నుంచి గత ఎన్నికల్లో పితాని బాలకృష్ణ పోటీ చేశారు. రాబోయే ఎన్నికల్లో.. టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరితే.. ఈ సీటు టీడీపీకే వెళ్లే అవకాశం ఉంటుంది. అందువల్ల.. పితాని బాలకృష్ణ.. తెలుగుదేశం అభ్యర్థికే సపోర్ట్ చేయాల్సి వస్తుంది.

Chelluboyina Venugopal

Chelluboyina Venugopal

రామచంద్రపురంలో ఒకే పార్టీలో బద్ధ శత్రువులు, మంత్రి వేణుకు తిరిగి సీటు దక్కేనా…

ఇక.. రాష్ట్ర రాజకీయాలు ఒకెత్తు.. రామచంద్రపురం రాజకీయాలు ఒకెత్తు అనే టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు.. బద్ధ శత్రువులుగా ఉన్న ముగ్గురు నేతలు.. ఇప్పుడు ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో.. వైసీపీ తరఫున చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఇప్పుడు మంత్రి కూడా. ప్రజా సంక్షేమం విషయంలో మంత్రి వేణుకు మంచి పేరే ఉన్నా.. పార్టీ కార్యకర్తలను కలుపుకొని వెళ్లడంలో ఆయన విఫలమయ్యారనే విమర్శలున్నాయ్. ఓ పక్క పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గం, మరోవైపు తోట త్రిమూర్తులు వర్గాన్ని కలుపుకొని వెళ్లడం లేదనే టాక్ వినిపిస్తోంది. తోట త్రిమూర్తులు వైసీపీలోకి వచ్చాక.. రామచంద్రపురంలో టీడీపీకి సరైన నేత లేకుండా పోయారు. దానిని.. వేణు బలంగా మార్చుకోలేకపోయారనే వాదన వినిపిస్తోంది. ఇదిలాగే కొనసాగితే.. మంత్రి వేణు సీటు మార్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే.. ఆయన కాకినాడ రూరల్ సీటు అడిగారని.. ఆయనకు అక్కడ కన్ఫామ్ అయితే.. రామచంద్రపురంలో ఎంపీ బోసు కొడుకు.. పిల్లి సూర్యప్రకాశ్ బరిలో దిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక.. టీడీపీ నుచి రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని నియమించినా.. అది నామమాత్రంగానే మిగిలిపోయింది. పార్టీ కార్యక్రమాల్లో ఆయన నామమాత్రంగానే పాల్గొంటున్నారనే విమర్శలున్నాయ్. అయితే.. అమలాపురానికి చెందని సుభాష్.. టీడీపీలోకి వస్తే.. అతనే రామచంద్రపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఈ సెగ్మెంట్‌లో కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్నా.. జనసేన నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ.. ఇక్కడ జనసేన-టీడీపీ కలిసి ఎన్నికలకు వెళితే.. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి కొంచెం కష్టపడాల్సి వస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. సరైన ప్రతిపక్షం లేనందున.. మంత్రి వేణుకు మళ్లీ అవకాశం ఇస్తే.. ఆయన గెలిచే అవకాశాలూ లేకపోలేదు. అయితే.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు.. మండపేట నుంచి కాకుండా.. రామచంద్రపురం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

thota trimurthulu

thota trimurthulu

మండపేటలో తెలుగుదేశానికి తిరుగులేదా…

ఇక.. మండపేట.. టీడీపీ కంచుకోట అని చెప్పొచ్చు. 2009 నుంచి 2019 దాకా.. అక్కడ పసుపు జెండా ఎగురుతూనే ఉంది. ప్రస్తుతం అక్కడ టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా వేగుళ్ల జోగేశ్వరరావు ఉన్నారు. అంతటి.. వైసీపీ వేవ్‌లోనూ విజయం సాధించి.. మండపేటలో తెలుగుదేశానికి తిరుగులేదని నిరూపించారు. ఈసారి కూడా మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు. ఇక.. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులుకు.. మండపేట బాధ్యతలు అప్పజెప్పారు. అక్కడ.. వైసీపీని బలోపేతం చేసే దిశగా ఆయన ముందుకు సాగుతున్నారు. కొన్నాళ్ల కిందటి దాకా మిత్రులుగా ఉన్న వేగుళ్ల, తోట ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోయారు. విమర్శలు, ప్రతి విమర్శలతో.. మండపేట రాజకీయం ఫుల్ హీటెక్కింది. ఎవరికి వారు.. ఉనికి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు.. జనసేన తరఫున లీలా కృష్ణ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. టీడీపీ కంచుకోటగా ఉన్న మండపేటకి.. జనసేన బలం కూడా తోడైతే.. మరోసారి గెలిచే అవకాశాలున్నాయంటున్నారు. వైసీపీ నుంచి గనక తోట త్రిమూర్తి పోటీ చేస్తే.. మండపేట రాజకీయం మరింత రసరవత్తరంగా మారుతుంది.

bandaru satyananda rao

bandaru satyananda rao

కొత్తపేట లో టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరితే బండారు ఫ్యామిలీకే ప్లస్

అమలాపురం పార్లమెంట్ పరిధిలోని మరో నియోజకవర్గం కొత్తపేట. 2019లోనూ ఇక్కడ వైసీపీ జెండానే ఎగిరింది. చిర్ల జగ్గిరెడ్డి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్‌గా కొనసాగుతున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. అయితే.. సొంత సామాజికవర్గాన్ని ఎక్కువగా పట్టించుకుంటున్నారని.. మిగిలిన వాళ్లను అంతగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయ్. రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యే కావడంతో.. జనంలో సహజంగా వచ్చే వ్యతిరేకత కూడా ఉంది. అయినప్పటికీ.. వైసీపీ మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చే చాన్స్ ఉంది. టీడీపీ విషయానికొస్తే.. బండారు సత్యానందం గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆయనకు క్యాడర్‌తో పాటు ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ కూడా ఉంది. పైగా.. రెండు సార్లు ఓడారన్న సానుభూతి కూడా ఉంది. అయితే.. సత్యానందానికి ప్రత్యర్థిగా.. ఆయన తమ్ముడు బండారు శ్రీనివాస్ జనసేన నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరితే.. అది బండారు ఫ్యామిలీకే ప్లస్ అవుతుందనే అంచనాలున్నాయ్. పైగా.. అమలాపురం పార్లమెంట్ పరిధిలో జనసేన గెలిచే చాన్స్ ఉన్న నియోజకవర్గాల్లో కొత్త పేట కూడా ఒకటి. అయితే.. పొత్తులో ఈ సీటు ఎవరికి దక్కుతుందన్నదే.. ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Chinta Anuradha

Chinta Anuradha

పి.గన్నవరం సీటుపై ఆశలు పెట్టుకున్న ఎంపీ అనురాధ…

ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ఉన్న పి.గన్నవరం రాజకీయం కూడా ఈసారి బాగా ఆసక్తి రేపుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున కొండేటి చిట్టిబాబు గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. నియోజకవర్గంలో తన ముద్ర వేశారు. అయితే.. కొన్ని విషయాల్లో.. మంత్రి విశ్వరూప్.. చిట్టిబాబుపై కోపంగా ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయినప్పటికీ.. సర్వేలతో సంబంధం లేకుండా మళ్లీ చిట్టిబాబుకే సీటు ఇచ్చే అవకాశం ఉంది. అయితే.. అమలాపురం ఎంపీ చింతా అనురాధ కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే.. ఆవిడ క్యాడర్‌ను రెడీ చేసుకుంటున్నారు. దాంతో.. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇక.. టీడీపీలో.. 20 మంది నేతలు ఈ సీటు మీదే ఆశలు పెట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి.. తెలుగుదేశం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే లెక్కల్లో ఉన్నారంతా. పొత్తులో.. రాజోలు సీటు గనక జనసేనకు ఇస్తే.. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. పి.గన్నవరం సీటు అడిగే అవకాశముంది. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న మోకా ఆనందసాగర్ కూడా టికెట్ రేసులో ఉన్నారు. దళితుల్లో ఆనందసాగర్‌కి కొంత సానుకూలత ఉండటంతో.. టీడీపీ అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. మరికొందరు నేతలు కూడా పి.గన్నవరం టికెట్ మీదే ఆశలు పెట్టుకున్నారు. కానీ.. చివరికి చంద్రబాబు ఆశీస్సులు ఎవరికి ఉంటాయన్నది.. ఆసక్తి రేపుతోంది.

mla-rapaka-varaprasad

mla-rapaka-varaprasad

రాజోలును తిరిగి జనసేన కైవసం చేసుకుంటుందా…

రాష్ట్రం మొత్తంలో రాజోలు అసెంబ్లీ సెగ్మెంట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. గత ఎన్నికల్లో.. జనసేన గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సీటు రాజోలే. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం.. ఆయన అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. తన కుమారుడిని ఇప్పటికే.. వైసీపీలో జాయిన్ చేశారు. తనను గెలిపించిన జనసేన క్యాడర్‌ను సైతం పక్కనపెట్టేశారనే విమర్శలున్నాయి. రాబోయే ఎన్నికల్లో.. వైసీపీ తరఫున బరిలోకి దిగేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. సీటు విషయంలో.. సీఎం జగన్ కూడా రాపాకకు హమీ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరితే.. ఇక్కడ కచ్చితంగా జనసేనే పోటీ చేస్తుంది. గత ఎన్నికల్లో.. వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన బొంతు రాజేశ్వరరావు.. ఇప్పుడు జనసేనలో ఉన్నారు. రెండు సార్లు ఓడారన్న సానుభూతికి తోడు.. జనసేన తోడైతే.. ఈసారి బొంతుకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. జనసైనికులు చెబుతున్నారు. దీనికి తోడు.. పసుపు దళం బలం కూడా తోడైతే.. కచ్చితంగా జనసేన గెలుస్తుందంటున్నారు. జనసేన నుంచి.. రిటైర్డ్ ఐఏఎస్ దేవా వరప్రసాద్ కూడా టికెట్ ఆశిస్తున్నారు.

ఓవరాల్‌గా చూసుకుంటే.. అమలాపురం పార్లమెంట్ పరిధిలో.. రాజకీయం అంత ఈజీగా లేదనే విషయం అర్థమవుతోంది. ప్రధాన పార్టీల మధ్య.. పోటీ తీవ్ర స్థాయిలోనే ఉంటుందనే విషయం క్లియర్‌గా తెలుస్తోంది. టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరితే.. అధికార పార్టీకి కొంత ఎఫెక్ట్ తప్పదనే టాక్ కూడా వినిపిస్తోంది. అందువల్ల.. అన్ని పార్టీల నేతలు ఎక్కువగా జనంలోనే తిరిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా.. కోనసీమ జిల్లా పేరు మార్పు అంశం.. వైసీపీ నేతలపై కొంత ఎఫెక్ట్ చూపుతుందని కూడా చెబుతున్నారు. దీనిని.. అధికార పార్టీ ఎలా అధిగమిస్తుందన్నదే ఆసక్తిగా మారింది. ఈసారి.. కోనసీమ జిల్లాలో ఎలాంటి సీన్ కనిపిస్తుందోనని.. అంతా ఎదురుచూస్తున్నారు.