Dharani Bhu Bharati Scam: ధరణి, భూ భారతిలో భారీ స్కామ్.. 15మంది అరెస్ట్
మొత్తం రూ.3.90కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని చెప్పారు. నిందితుల నుంచి 63.19 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోగా..
Dharani And Bhu Bharati Registration Scam Representative Image (Image Credit To Original Source)
- రూ.3.90 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి
- నిందితుల నుంచి 63.19 లక్షల రూపాయల నగదు స్వాధీనం
- కోటి రూపాయల విలువైన పత్రాలు, ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ లు సీజ్
Dharani Bhu Bharati Scam: తెలంగాణలో సంచలనం సృష్టించిన ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్ కుంభకోణంలో 15 మందిని అరెస్ట్ చేశారు వరంగల్ పోలీసులు. మరో 9 మంది పరారీలో ఉన్నట్లు వరంగల్ సీపీ తెలిపారు. ఈ కేసులో బసవరాజు, చల్లా పాండులను ప్రధాన నిందితులుగా గుర్తించారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో గతంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని, వాటిని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడ్డారని చెప్పారు.
కమీషన్లు ఇస్తూ మోసాలు..
ఆన్ లైన్ సర్వీస్ సెంటర్ల నిర్వాహకులకు కమీషన్లు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. మొత్తం రూ.3.90కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని చెప్పారు. నిందితుల నుంచి 63.19 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోగా.. కోటి రూపాయల విలువైన పత్రాలు, ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు.
సర్కార్ కు రూ. 3.90 కోట్లు నష్టం..
”జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి, భూ భారతి పోర్టల్‌లలో భూమి రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కుంభకోణంలో 15 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేయగా, మరో తొమ్మిది మంది పరారీలో ఉన్నారు. ఈ కుంభకోణం ఫలితంగా రాష్ట్ర ఖజానాకు రూ.3.90 కోట్ల నష్టం వాటిల్లింది. నిందితుల నుంచి రూ.63.19 లక్షల నగదు, బ్యాంకు ఖాతాలో రూ.లక్ష, సుమారు రూ.కోటి విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు డెస్క్‌టాప్ కంప్యూటర్లు, 17 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం” అని పోలీసులు తెలిపారు.
ఈ కేసు గురించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మీడియాతో మాట్లాడారు. పసునూరి బసవరాజు, భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆన్‌లైన్ సర్వీస్ నడుపుతున్న జెల్లా పాండు ఈ స్కామ్ లో ప్రధాన నిందితులు అని తెలిపారు.
”నిందితుల్లో ఒకడైన గణేష్ ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ల నిర్వాహకులను సంప్రదించి, రిజిస్ట్రేషన్ మొత్తాన్ని ఎన్‌ఆర్‌ఐ ఖాతా ద్వారా చెల్లిస్తానని చెప్పాడు. మీ-సేవా కేంద్రాల ద్వారా రైతుల నుండి మొత్తాన్ని వసూలు చేసి, సేకరించిన డబ్బు నుండి ఆన్‌లైన్ సర్వీస్ ప్రొవైడర్లు, మధ్యవర్తులకు కమీషన్ పంపిణీ చేసి, మిగిలిన మొత్తాన్ని ప్రధాన నిందితుడికి పంపాడు. బసవరాజు ఈ చలాన్లను (చెల్లింపు స్లిప్పులు) తీసుకొని ధరణి/భూ భారతి వెబ్‌సైట్‌లోని ‘ఇన్‌స్పెక్ట్ ఎడిట్ అప్లికేషన్’ ఉపయోగించి చలాన్ మొత్తాన్ని తగ్గించేవాడు.
ఆ తర్వాత మొబైల్ ద్వారా చలాన్‌ను సవరించి రైతులకు తిరిగి పంపేవాడు. ప్రభుత్వానికి చెల్లించిన రుసుములకు వెబ్‌సైట్‌లో జారీ చేసిన రసీదులను మార్చడానికి నిందితులు మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించారు. దీని వలన చెల్లించాల్సిన మొత్తం తగ్గింది. ఆ తర్వాత వారు తగ్గిన మొత్తాన్ని చూపిస్తూ స్థానిక తహశీల్దార్ లేదా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మధ్యవర్తుల ద్వారా ఈ నకిలీ చలాన్లను సమర్పించే వారు.
జనగాం, భువనగిరి జిల్లాల్లో మీ-సేవ, ఆన్‌లైన్ సేవల ద్వారా నమోదు చేయాల్సిన ధరణి, భూ భారతి పత్రాలను ప్రధాన నిందితుడు వ్యక్తిగతంగా వెబ్‌సైట్‌లో నమోదు చేశాడు. దీని కోసం, ప్రధాన నిందితుడు ఇతరులకు 10 నుండి 30 శాతం వరకు కమీషన్లు చెల్లించాడు. ఈ కేసులో జనగాం, భువనగిరి జిల్లాల్లో 1,080 పత్రాలకు సంబంధించిన లావాదేవీల్లో నిందితుడు మోసానికి పాల్పడ్డాడు. ఈ కుంభకోణానికి సంబంధించి మొత్తం 22 కేసులు (జనగాం జిల్లాలో 7, భువనగిరి జిల్లాలో 15) నమోదు చేశాం ” అని సీపీ వెల్లడించారు.
