Mallikarjun Kharge : 100 ఫీట్ల విగ్రహాలు పెట్టడం కాదు దళితులు, పేదలకు ఏం చేశారో చెప్పాలి‌-ఖర్గే

Mallikarjun Kharge: కాంగ్రెస్ లేకపోతే దేశానికి స్వాతంత్య్రం కూడా వచ్చేది కాదు. ఈ 75 ఏళ్లలో మేము ఏమీ చేయకపోతే మోదీ ప్రధాని అయ్యే వాడు కాదు.

Mallikarjun Kharge (Photo : Twitter)

Mallikarjun Kharge : వంద ఫీట్ల విగ్రహాలు పెట్టడం కాదు పేదలకు ఏం చేస్తున్నారో చెప్పాలి అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ లో కాంగ్రెస్ జై భారత్ సత్యాగ్రహ సభలో ఖర్గే మాట్లాడారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా నస్పూర్ లో ఈ సభ నిర్వహించారు.

దేశంలో డబ్బు ఉన్న వారైనా, లేని వారైనా, ఏ వర్గం వారైనా.. వారికి ఓటు హక్కు కల్పించారు అంబేడ్కర్ అని ఖర్గే చెప్పారు. ప్రస్తుతం.. అంబేడ్కర్ ని చాలామంది నాయకులు మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు 125 అడుగులు, మరొకరు 100 అడుగుల పేరుతో విగ్రహాలు నిర్మిస్తున్నారు. కానీ దళితుల, పేదల సంక్షేమం మాత్రం మరిచిపోతున్నారని ఖర్గే వాపోయారు. ఎస్సీ, ఎస్టీలకి ప్రత్యేకంగా కేటాయించిన నిధులు ఎంత ఖర్చు చేశారో ప్రజలకు లెక్క చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు.

Also Read..Ambedkar statue: చివరి రక్తపుబొట్టు వరకు పోరాడతా: సీఎం కేసీఆర్

” కాంగ్రెస్ లేకపోతే దేశానికి స్వాతంత్య్రం కూడా వచ్చేది కాదు. గాంధీ, నెహ్రూ అంతా కాంగ్రెస్ తో ఉన్నవారే. కాంగ్రెస్ ని తిట్టేవారు.. అసలు దేశ స్వాతంత్ర్యంలో మీ పాత్ర ఏంటి. సింగరేణి అత్యంత పెద్ద వ్యవస్థ. అలాంటి సంస్థని మూసి వేసేందుకు ఓ వైపు మోడీ, మరోవైపు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. పబ్లిక్ సెక్టార్ లో ఉన్న కంపెనీలను పూర్తిగా నాశనం చేస్తున్నారు. పేదల ఆస్తులను ధనవంతులకు అమ్ముతున్నారు. ఎయిర్ పోర్టులు, పోర్టులు అమ్ముతున్నారు. గాలి కూడా తమ ఆధీనంలో ఉండుంటే దాన్ని కూడా అమ్మేసేవారు” అని ఖర్గే అన్నారు.(Mallikarjun Kharge)

” అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దిశను సూచించారు. దళితులకు, నిరుపేదలకు, ధనవంతులకు ఓటు హక్కు కల్పించారు. అంబేద్కర్ ను అందరూ మరిచిపోతున్నారు‌. వంద ఫీట్ల విగ్రహలు పెట్టడం కాదు. పేదలకు ఏం చేస్తున్నారో చెప్పాలి‌. మేము దళితులకు, గిరిజనులకు సబ్ ప్లాన్ అమలు చేశాము. జనాభా దామాషా ప్రకారం కాంగ్రెస్ నిధులను ఖర్చు చేసింది. మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లూ ఇవ్వలేదు.

దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ, వల్లభబాయ్ పటేల్ పోరాటం సాగించారు. మేము 75 సంవత్సరాలలో ఏమీ చేయకపోతే మోదీ ప్రధాని అయ్యే వాడు కాదు. నిరుపేదలకు, మద్యతరగతి వర్గాలకు ప్రయోజనాలు దక్కడం లేదు. ప్రభుత్వ పరిశ్రమలను అమ్మడం వల్ల ఉద్యోగాలు దక్కలేదు. మోదీ ప్రతి సంవత్సరం 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు‌. ఈ తొమ్మిదేళ్లలో 18కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? దేశంలో 30లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ, భర్తీ చేయడం లేదు.

Ambedkar statue: 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్.. ప్రకాశ్ అంబేద్కర్ ఏమన్నారంటే?

దేశంలో మోదీ నియంత, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత. కాంగ్రెస్ వల్లనే నేను పదవులు పొందాను. అన్యాయంగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. హత్యా నేరంలో బీజేపీ ఎంపీకి శిక్ష పడింది. కాని అనర్హత వేటు వేయలేదు. అయితే రాహుల్ విషయంలో బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించారు.

దేశంలో చట్టం సమానత్వం లేదు. అ‌నర్హత వేటుకు మేము భయపడటం లేదు. పోరాడుతున్నాము..‌ పోరాటం సాగిస్తాము. గుజరాత్ లో ఓ ఎంపీ ఉన్నారు. ఆయనపై క్రిమినల్ కేసులూ ఉన్నాయి. కోర్టులో జరిమానా కూడా వేస్తూ తీర్పిచ్చారు. కానీ అతనికి పార్లమెంట్ కొన్ని రోజుల పాటు సమయం ఇచ్చింది. కానీ రాహుల్ విషయంలో బీజేపీ ప్రభుత్వం కక్షపూర్తిగా వ్యవహరించింది” అని ఖర్గే అన్నారు.