Man dead organs donation : తాను మరణిస్తూ మరో ఐదుగురికి ప్రాణం పోశాడు

తాను మరణిస్తూ మరో ఐదుగురికి ప్రాణం పోసి ఓ తాపీ మేస్త్రీ ఆదర్శంగా నిలిచాడు. అవయవాలు దానం చేసి ఐదుమందికి పునర్జన్మ ఇచ్చాడు.

Man donation organs : తాను మరణిస్తూ మరో ఐదుగురికి ప్రాణం పోసి ఓ తాపీ మేస్త్రీ ఆదర్శంగా నిలిచాడు. అవయవాలు దానం చేసి ఐదుమందికి పునర్జన్మ ఇచ్చాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా రామచంద్రాపురానికి చెందిన జాజిలి కిష్టయ్య, సత్తెమ్మ దంపతులకు రెండో సంతానమైన రాములు(24) తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. వృద్ధులైన తల్లిదండ్రులు, గర్భవతియైన భార్యను ఉన్నంతలో సుఖంగా పోషించుకుంటున్నాడు. రోజువారి పనుల్లో భాగంగా ఈ నెల ఒకటో తేదీన ఉదయం పనికి సిద్ధమైన రాములుకు ఉన్నట్టుండి రెండు కాళ్లు, రెండు చేతులు చచ్చుబడి పోయాయి.

ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు, పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో వారు హుటాహుటిన మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో రాములు నోరు మూగబోయింది. యశోదలో చేర్పించగా పరిశీలించిన వైద్యులు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు నిర్ధారించారు. విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలుపగా, ఒక్కసారిగా అందరూ శోక సంద్రంలో మునిగిపోయారు.

అందరితో కలివిడిగా ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న కన్న కొడుకు కళ్ల ముందు విగత జీవిలా పడివుండటాన్ని చూసిన తల్లిదండ్రులు, గర్భవతియై ఎన్నో కలలు కంటున్న భార్య అరుణ తన ఆశలన్నీ ఆవిరై పోయాయని, ఇక తనకు దిక్కెవరని గుండెలవిసేలా రోదించారు. దుఃఖ సాగరంలో మునిగిపోయిన బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆస్పత్రి వైద్యులు అవయవ దానంపై అవగాహన కల్పించారు.

తమ కుటుంబం లాగా మరే కుటుంబం చీకట్లో ఉండి పోకూడదని భావించిన రాములు తల్లిదండ్రులు, భార్య అవయవ దానం చేయటానికి అంగీకరించారు. రాములు అవయవాలను ఐదుగురికి దానం చేసేందుకు వైద్యులు సిద్ధం చేశారు. పేదవాడైన రాములు తాను మరణిస్తూ మరో ఐదుగురికి పునర్జన్మను ప్రసాదించటం పట్ల వైద్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయినప్పటికీ పెద్ద మనసుతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చిన వారి కుటుంబ సభ్యులను అందరూ అభినందించారు.

ట్రెండింగ్ వార్తలు