Mallojula Venugopal Rao
Mallojula Surrender : మావోయిస్టులకు ఇటీవలి కాలంలో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట 60మందితో కలిసి మంగళవారం లొంగిపోయారు. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ ధ్రువీకరించారు.
మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ తన సైద్దాంతిక బలాన్ని మాత్రమే కాకుండా దక్షిణ బస్తర్‌లోని కమ్యూనికేషన్లు, ప్రజల సంబంధాన్ని కూడా కోల్పోయింది. 70ఏళ్ల వేణుగోపాల్ రావు మావోయిస్టు పార్టీకి సైద్ధాంతిక అధిపతిగా, అదేవిధంగా ఆ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి కమ్యూనికేషన్ నిపుణుడిగా కొనసాగారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఉంటూ బయట ప్రపంచంతో కమ్యూనికేషన్‌ను అనుసంధానించడంలో కీలక భూమిక పోషించారని నిఘా వర్గాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లికి చెందిన వేణుగోపాల్ రావు బీకాం గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. పెద్దపల్లి జిల్లా సాయుధ రైతాంగ పోరాటంతో అన్న మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్‌జీతో మల్లోజుల వేణుగోపాల్‌రావు తుపాకీ పట్టారు. నాలుగు దశాబ్దాలుగా పీడిత ప్రజల పక్షాన అన్నదమ్ములు అడవుల్లో పోరు సాగించారు. 2011 నవంబర్ 24న కిషన్ జీ పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించారు. అన్న మరణం తరువాత ఉద్యమ పంథాలోనే మల్లోజుల వేణుగోపాల్ రావు కొనసాగారు. నాలుగు దశాబ్దాల తర్వాత ప్రస్తుతం మావోయిస్టు పార్టీని వీడారు. కొడుకులు ఎప్పుడు వస్తారో అని ఎదురు చూసి రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మల్లోజుల వేణుగోపాల్ రావు తల్లి మధురమ్మ మరణించింది. వేణుగోపాల్ రావు లొంగుబాటుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చ జరుగుతుంది.
ఆయుధాలను వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని ఈ ఏడాది సెప్టెంబరులో మల్లోజుల వేణుగోపాల్ రావు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటనకు మావోయిస్టు పార్టీ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మద్దతు ఇవ్వగా.. హిడ్మా, దేవ్‌జీ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా వేణుగోపాల్ 22 పేజీల సుదీర్ఘ లేఖను ఈ మధ్య విడేదలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ లేఖను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆయుధాలను సరెండర్ చేయాలని ఆయన్ని ఆదేశించింది. ఈ లేఖల యుద్ధం కొనసాగుతున్న తరుణంలోనే ఆయన పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. ఆయన ఆయుధాలు వదిలేసినట్లు గచ్చిరోలి అధికారిక వర్గాలు ధృవీకరించాయి.