యథావిధిగా విధులకు హాజరవుతామన్న హైడ్రా మార్షల్స్‌.. సమస్య అంతా టీ కప్పులో తుఫాను లాంటిదన్న హైడ్రా కమిషనర్

మూడు నెలల తరువాత జీతం పెరగక పోతే.. అప్పుడు తమ కార్యాచరణ ప్రకటిస్తామని మార్షల్స్ తెలిపారు.

Hydra Commissioner Ranganath

ఆందోళన చేస్తున్న చేస్తున్న హైడ్రా మార్షల్స్‌తో ఆ కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్ భేటీ అయ్యారు. తమ జీతాల విషయం తేల్చాలని మార్షల్స్ విధులు బహిష్కరించి ఉదయం నుంచి నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఆర్మీలో రిటైర్ అయిన వారిని అధికారులు హైడ్రాలో మార్షల్స్‌గా నియమించుకున్నారు అధికారులు. జీహెచ్ఎంసి ఈవీడీఎమ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్షల్స్ పనిచేస్తున్న విషయం తెలిసిందే.

రంగనాథ్‌తో భేటీ అనంతరం మార్షల్స్ మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా కమిషనర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. తమ జీతాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇంతకు ముందు పడేలాగే ఈరోజు కూడా అంతే జీతం పడుతుందని చెప్పారని తెలిపారు.

హైడ్రా మార్షల్స్ జీతభత్యాల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నారని తెలిపారని మార్షల్స్‌ అన్నారు. రెండు నెలల్లో జీతాలు పెంచేలా చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. తమ కమిషనర్ మాటకు కట్టుబడి మరో నెల ఎక్కువగా.. మూడు నెలలు వెయిట్ చేస్తామని అన్నారు.

మూడు నెలల తరువాత జీతం పెరగక పోతే.. అప్పుడు తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. కొందరు అధికారుల అసభ్య తీరుపై కూడా చెప్పామని, కమిషనర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. అలాంటి సందర్భం ఎదురైతే.. నేరుగా తన దృష్టికి తేవాలని చెప్పారని తెలిపారు. హైడ్రాకు సెపరేట్ జీవో తెచ్చి తమకు శాలరీ పెంచుతామనీ హామీ ఇచ్చారని చెప్పారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. “ఇది టీ కప్పులో తుఫాను లాంటిది. జీవో ప్రకారం ఒక స్కేల్ జీతం విడుదల చేశారు. కానీ, హైడ్రాలో పని చేస్తున్న వారి జీతాలు తగ్గే అవకాశం లేదు. చిన్న కన్ఫ్యూషన్ తో వాళ్ళు ఆందోళన చెందారు. అందరికీ అర్థం అయ్యేలా వివరించాను. వాళ్లు కూడా సంతోషపడ్డారు. హైడ్రాలో పని చేస్తున్న మార్షల్స్ కీ ఇంకా జీతం పెరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వేతనాలను కూడా పరిశీలించి పెంచుతాము” అని తెలిపారు.