Medak Farmer Cyber Fraud: రైతులకు బిగ్ అలర్ట్.. ఈ కాల్స్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండి.. మెదక్ జిల్లాలో షాకింగ్ ఘటన
ఈజీ మనీ కోసం అలవాటు పడిన కేటుగాళ్లు అమాయక రైతుల(Medak Farmer Cyber Fraud)నే లక్ష్యంగా చేసుకుని నయా సైబర్ మోసాలకు తెరలేపుతున్నారు.
- V Santhosh Kumar
- Published on- September 6, 2026 / 05:47 PM IST
Medak farmers cyber fraud paddy harvesting machine scam
- వరికోత మిషన్ సైబర్ మోసం
- రైతు ఖాతాలోని డబ్బులు ఫ్రీజ్
- అపరిచితుల కాల్స్‌తో జాగ్రత్తగా ఉండండి
Medak Farmer Cyber Fraud: ఈజీ మనీ కోసం అలవాటు పడిన కేటుగాళ్లు అమాయక రైతులనే లక్ష్యంగా చేసుకుని నయా సైబర్ మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా మెదక్(Medak Farmer Cyber Fraud) జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన రైతు పులబోయిన భూపాల్‌ను వరికోత మిషన్ పంపిస్తామంటూ నమ్మించి కేటుగాళ్లు రూ. 30 వేలు కాజేశారు. బాధితుడికి ఏప్రిల్ 15న గుర్తుతెలియని నంబర్ నుంచి సుధాకర్ అనే వ్యక్తి ఫోన్ చేసి వరికోత మిషన్ అందుబాటులో ఉందని, డీజిల్ ఖర్చుల నిమిత్తం ముందస్తుగా డబ్బులు పంపాలని ఒత్తిడి చేయడంతో రైతు ఆ డబ్బును బదిలీ చేశాడు.
రూ. 21 వేల నగదు ఫ్రీజ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు:
అడిగిన వెంటనే రైతు రూ.30 వేలు పంపగా, కేటుగాడు తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన భూపాల్ వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు త్వరితగతిన స్పందించారు. నిందితుడి బ్యాంక్ ఖాతాను గుర్తించి అందులోని రూ. 21,000 నగదును తక్షణమే ఫ్రీజ్ చేశారు. దీంతో బాధిత రైతుకు మెజారిటీ మొత్తం రికవరీ అయ్యే అవకాశం లభించగా, పోలీసులు ఈ ఘటనపై బుధవారం అధికారికంగా కేసు నమోదు చేశారు.
వ్యవసాయ యంత్రాలు, విత్తనాల పేరుతో కాల్స్ వస్తే జాగ్రత్త:
ఆన్‌లైన్‌లో వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తామంటూ వచ్చే గుర్తుతెలియని ఫోన్ కాల్స్ పట్ల రైతులు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ముందస్తుగా డబ్బులు పంపాలని ఒత్తిడి చేసే అపరిచితులను అస్సలు నమ్మవద్దని స్పష్టం చేశారు. ఏదైనా అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీసులను గానీ, సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్‌ను గానీ సంప్రదించాలని అధికారులు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
