Online Classes : శ్మశానంలో డాక్టర్‌ చదువు

ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యేందు ఊర్లో సరైన సిగ్నల్ లేకపోవడంతో.. శ్మశాన వాటికలో క్లాసులు వింటుంది వైద్యవిద్యార్థిని.

Online Classes

Online Classes : కరోనా కారణంగా పాఠశాలలు, మూతబడ్డాయి.. తరగతులన్నీ ఆన్‌లైన్‌ లోనే జరుగుతున్నాయి. పట్టణాల్లో ఆన్‌లైన్‌ క్లాసులకు అడ్డంకులు తక్కువగానే ఉన్నాయి.. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలు ఎదురువుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సమస్య వలన తరగతులకు హాజరు కాలేకపోతే మరికొన్ని చోట్ల సిగ్నల్స్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కర్ణాటకలోని ఓ గ్రామంలో సిగ్నల్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు కొండప్రాంతానికి వెళ్లి ఆన్‌లైన్‌ కాసులకు హాజరవుతున్న ఫోటోలు గత నెలలో వైరల్ గా మారాయి.

ఇక తాజాగా జగిత్యాల జిల్లాలో కూడా ఇటువంటి సంఘటనే ఒకటి జరిగింది. గ్రామంలో సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో సమీపంలోని శ్మశానవాటికకు వచ్చి ఆన్‌లైన్‌ క్లాసులు వింటుంది వైద్యవిద్యార్థిని. జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్‌కు చెందిన మిర్యాల కల్పన ఎంసెట్‌లో 698 ర్యాంకు సాధించి 2017లో ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో చేరింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతోంది.

ఊర్లో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ సమస్య తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాను కుటుంబసభ్యుల సహకారంతో నిత్యం శ్మశానవాటికలోనే ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్నాని కల్పన తెలిపింది. నాలాంటి వారికోసం సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి’అని కల్పన కోరుతోంది.