Hyderabad : ఆరు నెలల అబద్ధం.. చివరకు 8 నెలల చిన్నారి కిడ్నాప్! భర్తకు చెప్పలేక.. చివరిలో బిగ్ ట్విస్ట్

Hyderabad : డెలివరీ సమయంలో పుట్టిన బిడ్డ మృతి చెందిన విషయాన్ని భర్తకు చెప్పలేక ఓ మహిళ మరో చిన్నారిని కిడ్నాప్ చేసింది.

Hyderabad Kidnap case

Hyderabad : డెలివరీ సమయంలో పుట్టిన బిడ్డ మృతి చెందిన విషయాన్ని భర్తకు చెప్పలేక మానసిక వేదనకు గురైన ఓ మహిళ చివరకు మరో చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. అయితే పోలీసులు రంగంలోకి దిగి.. కేవలం మూడు గంటల్లోనే నిందితురాలిని అదుపులోకి తీసుకుని చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

Also Read : Russia Black Widows : రష్యాలో ‘బ్లాక్ విడోస్’ కలకలం.. పరిహారం కోసం సైనికులతో వివాహాలు..!

పోలీసుల వివరాల ప్రకారం.. కొన్నాళ్ల క్రితం డెలివరీ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో ఉన్న తన పుట్టింటికి వెళ్లిన మహిళకు ప్రసవ సమయంలో శిశువు మృతి చెందాడు. ఈ విషయం భర్తకు చెప్పకుండా దాచిపెట్టింది. భర్త హైదరాబాద్‌లో పెయింటర్‌గా పనిచేస్తుండగా, తాను త్వరలో కుమారుడితో కలిసి హైదరాబాద్‌కు వస్తానని ఆరు నెలలుగా నమ్మిస్తూ వచ్చింది. భర్త పలుమార్లు కుమారుడిని చూపించాలని ఒత్తిడి చేయడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది.

ఇటీవల భర్తకు తెలియకుండా హైదరాబాద్‌కు వచ్చిన ఆమె, ఎలాగైనా నెలల వయసున్న బాలుడిని కిడ్నాప్ చేసి తన కుమారుడిగా చూపించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో పీర్జాదిగూడలో ఎనిమిది నెలల బాలుడిని అపహరించి, అనంతరం కర్మన్‌ఘాట్‌లో ఉన్న తన భర్త వద్దకు తీసుకెళ్లింది.

మరోవైపు చిన్నారి తల్లిదండ్రులు కొట్టే శివరామ్, స్పందన మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల సమాచారం ద్వారా నిందితురాలి కదలికలను గుర్తించారు. ఘటన జరిగిన మూడు గంటల్లోనే ఆమెను అదుపులోకి తీసుకుని, చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

ఈ ఘటనపై ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సురేష్ కుమార్ మాట్లాడుతూ.. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎనిమిది నెలల బాలుడి అపహరణ గురించి మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు డయల్ 100 కాల్ వచ్చింది. కాల్ అందుకున్న వెంటనే, ఎస్‌హెచ్‌ఓ, అతని బృందం స్పందించి ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మేము ప్రధాన రైల్వే స్టేషన్లను అప్రమత్తం చేశాము. మేము దేవరకొండ, సూర్యాపేట డీఎస్పీలతో కూడా సమన్వయం చేసుకుని మా బృందాలను అక్కడికి పంపించాము. సాంకేతిక ఆధారాలు, సాంకేతిక సహకారంతో కీలకమైన ఆధారాలను సేకరించి.. నిందితురాలిని కర్మన్‌ఘాట్ ప్రాంతంలో గుర్తించాం. ఆమె నుంచి పసికందు సురక్షితంగా కాపాడి.. అసలైన తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు.