×
Ad

Hyderabad Rains: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. బయటకు రావొద్దు.. నగరంలోని ఈ ప్రాంతాల్లో దంచికొడుతున్న వర్షం..

హైదరాబాద్ నగరంలోనూ వర్షం (Hyderabad Rains) దంచికొడుతుంది. నగరంలోని పలు ప్రాతాల్లో ఆదివారం ఉదయం నుంచి వర్షం పడుతుంది.

Hyderabad Rains

Hyderabad Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరందాటినప్పటికీ.. మరో అల్పపీడనం ఏర్పడడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. హైదరాబాద్ నగరంలోనూ వర్షం దంచికొడుతుంది. నగరంలోని పలు ప్రాతాల్లో ఆదివారం ఉదయం నుంచి వర్షం పడుతుంది.

ఆదివారం ఉదయం నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, మెహిదీపట్నం, మాసబ్ ట్యాంక్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బాలానగర్, మూసాపేట, కూకట్ పల్లి సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. అయితే, నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read: Rain Alert : రెయిన్ అలర్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త.. మళ్లీ కుండపోత వర్షాలు వచ్చేస్తున్నాయ్..

తెలంగాణ వెదర్‌మ్యాన్ రిపోర్టు ప్రకారం.. ఆదివారం నగరంలో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని తెలిపారు. ఉత్తర, పశ్చిమ హైదరాబాద్‌లోని పటాన్‌చెరు, ఆర్‌సి పురం, సెర్లింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్‌పల్లి, గాజులరామారం, నిజాంపేట్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, అల్వాల్, మల్కాజ్‌గిరి, కాప్రా, బొల్లారం మీదుగా రాబోయే రెండుమూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఇదిలాఉంటే.. ఇవాళ సాయంత్రం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం కావడంతో నగర వాసులు పలు పనులపై బయటకు వస్తుంటారు. అయితే, వర్షాల సమయంలో బయటకు రావొద్దని, అత్యవసరం అయితే తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాలని నగర వాసులకు అధికారులు సూచించారు. మరోవైపు.. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షంతోపాటు ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, చెట్ల కింద, హోర్డింగ్ ల ప్రాంతంలో ఉండొద్దని వాహనదారులు, ప్రజలకు అధికారులు సూచించారు.

మరోవైపు.. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో కోట్ పల్లి ప్రాజెక్టు అలుగు పారుతోంది. ఉధృతంగా గొట్టిముక్కల వాగు ప్రవహిస్తోంది. ఈ క్రమంలో గొట్టిముక్కల – నాగారం గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వికారాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలతో మరోసారి మూసీకి వరద ప్రవాహం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలాఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.