తెలంగాణలో నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి.. గురువారం అతి భారీ వర్షాలు..

నైరుతి బంగళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Telangana Rains

Heavy Rains Telangana: తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రంలోని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా బుధవారం, గురువారాల్లో వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు.

నైరుతి బంగళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

బుధవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, యాదాద్రి, భువనగరి, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, జనగాం, పెద్దపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మంచిర్యాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

గురువారం యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని, శుక్రవారం ఖమ్మం, వికారాబాద్‌, మహబూబ్‌ణగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో.. శనివారం వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

మంగళవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సాయంత్రం సమయంలో హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. అయితే, గడిచిన 24 గంటల్లో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలోని ఏడు మండలాల్లో 6 నుంచి 10 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైందని, మరో 78 మండలాల్లో రెండు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్ లో రెండు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో కుడపోత వర్షం కురుస్తోంది. సోమవారం కుండపోత వర్షంతో నగర ప్రజలు అతలాకుతలం అయ్యారు. కుండపోత వర్షం కారణంగా రోడ్లు వాగులను తలపించాయి. రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మంగళవారం సాయంత్రం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బుధ, గురువారాల్లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో రెండు రోజులపాటు నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈనెల 8వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.