Telangana Rains : తెలంగాణలో ఈ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు..  

Telangana Rains : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Meteorological Department Has Predicted Heavy Rains In Several Districts Of Telangana Today And Tomorrow

  • తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన
  • ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
  • పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ

Telangana Rains : తెలంగాణలో ఒకవైపు ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా బుధ, గురువారాల్లో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Also Read : Pawan Kalyan: సై అంటే సై.. కాంగ్రెస్ లీడర్లు పవన్ కల్యాణ్ ని ఎందుకు టార్గెట్ చేశారు? కారణం అదేనా..

కేరళ, తమిళనాడులను గురువారం నాటికి నైరుతి రుతుపవనాలు తాకే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. వచ్చే వారం తెలంగాణలోకి రుతుపవనాలు ఎంట్రీ ఉంటుందని.. ఈ క్రమంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. పలు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. అదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల సమయంలో భారీగా ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

భారీగా ఈదురుగాలులు, వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రదేశాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.