×
Ad

Rain Alert : మరో రెండు రోజులు ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరికలు జారీ.. గత 10 ఏళ్లలో అత్యంత అధిక వర్షపాతంగా రికార్డు..

Rain Alert తెలంగాణలో రానున్న 48గంటల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ..

Rain Alert

Rain Alert : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను మొంథా తుపాను వణికించింది. తుపాను ప్రభావం పూర్తిగా తొలగిపోవడంతో ఇప్పుడిప్పుడే రెండు రాష్ట్రాల ప్రజలు కోలుకుంటున్నారు. అయితే, తెలంగాణలో శనివారం వర్షాలు కొంత విరామం ఇచ్చినప్పటికీ.. ఆదివారం నుంచి మళ్లీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణలో రానున్న 48గంటల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ, పశ్చిమ, మధ్య జిల్లాల్లో ఆదివారం సాయంత్రం, రాత్రి వేళల్లో చెదురుమదురు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: Rain Alert : దూసుకొస్తున్న కొత్త అల్పపీడనం.. మరోసారి తుపాను ముప్పు తప్పదా..? డేంజర్ జోన్‌లో ఆ ప్రాంతాల ప్రజలు..

ఇవాళ (ఆదివారం) సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం వర్షాల ప్రభావం ఎక్కువగా యాదాద్రి భువనగిరి, నల్గొండ, సిద్ధిపేట జిల్లాల్లో ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ లోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది.

తెలంగాణలో ఈ ఏడాది అక్టోబర్ నెలలో కురిసిన వర్షాలు గత 10 ఏళ్లలో అత్యంత అధిక వర్షపాతంగా రికార్డు సృష్టించాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసిన వర్షాల మాదిరిగానే.. అక్టోబర్ వర్షాలు కూడా మునుపటి రికార్డులను బద్దలు కొట్టాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షపాతం సాధారణ సగటు వర్షపాతం 90.6 మి.మీ కంటే మూడు రెట్లు అధికంగా, 353.3 మి.మీ వర్షపాతం నమోదు కావడం ఈ తీవ్రతకు నిదర్శనం.

మరోవైపు.. ఏపీలోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరించారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చునని తెలిపారు. ఈ వర్షాలు ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో పడే అవకాశం ఉండడంతో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.