Rain Alert : దూసుకొస్తున్న కొత్త అల్పపీడనం.. మరోసారి తుపాను ముప్పు తప్పదా..? డేంజర్ జోన్‌లో ఆ ప్రాంతాల ప్రజలు..
Rain Alert ఐఎండీ కీలక ప్రకటన చేసింది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో నవంబర్ నెలలో సాధారణం కంటే తక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
Rain Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలను వరుస తుపానులు అతలాకుతలం చేస్తున్నాయి. జూన్ నెల నుంచి రెండు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. రెండుమూడు రోజుల క్రితం మొంథా తుపాను ఏపీని అతలాకుతలం చేసింది. ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో 17 రంగాలకు రూ.5,244 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. 1.98లక్షల మంది రైతులకు సంబంధించి 3.75లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. రహదారులు పెద్దెత్తున కోతకు గురయ్యాయి. మరోవైపు.. మొంథా తుపాను తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రభావం చూపింది. వరంగల్, ఖమ్మంతోపాటు పలు జిల్లాల్లో నష్టం వాటిల్లింది. అయితే, ప్రస్తుతం మొంథా తుపాను ముప్పు తప్పడంతో ఏపీ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. ఏపీ వైపు మరో తుపాను దూసుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.

నవంబర్ 4వ తేదీన బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం రూపుదిద్దుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అండమాన్ సమీప ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారుతూ ఉండటంతో ఈ కొత్త అల్పపీడనం బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయట. వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ అల్పపీడనం తీవ్రత పెరిగితే మరోసారి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: Pawan Kalyan: ఓవైపు రివ్యూలు..ఇంకోవైపు ఫీల్డ్ విజిట్లు.. వైసీపీ విమర్శలకు పవన్ చెక్ చెప్పినట్లేనా?
కొత్తగా ఏర్పడే అల్పపీడనం ప్రభావం రానున్న మూడు నుంచి నాలుగు రోజులపాటు కొనసాగనుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తూర్పు విదర్భ, దాని సమీపంలోని దక్షిణ చత్తీస్ గఢ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి వాయువ్య ఝార్ఖండ్ ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 12 గంటల్లో ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారినా, దాని మిగతా ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై ఉంటుంది. ఫలితంగా రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఇప్పటికే మొంథా తుపాను కారణంగా ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా జిల్లాల్లో రైతులు సాగుచేసిన పంటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మొంథా తుపాను ముప్పు తప్పడంతో ఇప్పుడిప్పుడే రైతులు సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈ తరుణంలో మళ్లీ వర్షాలు వస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రస్తుతం వర్షాలతో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. ఇప్పుడిప్పుడే వారంతా తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. మళ్లీ అల్పపీడనం ఏపీవైపు దూసుకొస్తుందన్న వార్తలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఈనెలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ..
ఐఎండీ కీలక ప్రకటన చేసింది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో నవంబర్ నెలలో సాధారణం కంటే తక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదే విధంగా వాయువ్య మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. పశ్చిమ హిమాలయ ప్రాంతం, హిమాలయ సమీప ప్రాంతాలు, ఈశాన్య భారతంలోని ఎక్కువ భాగం, దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండొచ్చని ఐఎండీ తెలిపింది. మధ్య, తూర్పు భూ మధ్య రేఖ పసిఫిక్ మహాసముద్రంపై బలహీనమైన లా నినా పరిస్థితులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. వాయవ్య భారత్‌లోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో నవంబరులో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు.
