AP Rain Alert : ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఈ జిల్లాల్లో నాలుగు రోజులు వానలేవానలు..
AP Rain Alert : ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక విషయాన్ని చెప్పింది.
AP Rain Alert
- ఏపీ వాసులకు బిగ్ అలర్ట్
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- నాలుగు రోజులు వర్షాలు కురిసే చాన్స్
AP Rain Alert : ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక విషయాన్ని చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉఫరితల ఆవర్తనం సోమవారం అల్పపీడనంగా మారిందని తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు ఏపీలోని పలు జిల్లాలతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీలో చలి తీవ్రత తగ్గింది. దీంతో పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 30డిగ్రీలు దాటాయి. ఈ నెలాఖరుకు గరిష్ఠంగా 40 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే, ఇదే సమయంలో వర్షాలు దంచికొట్టనున్నాయి.
భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. దక్షిణ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని భూ మధ్య రేఖ పరిసరాల్లో ఉన్న హిందూ మహాసముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనిపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఈనెల 19వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో మరింత బలపడుతుంది. ఆ తరువాత ఉత్తర శ్రీలంక, దక్షిణ తమిళనాడు వైపు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఫిబ్రవరి నెలలో బంగాళాఖాతంలో తుపానులు, వాయుగుండాలు, అల్పపీడనాలు అరుదుగా వస్తుంటాయి. 1891 నుంచి 2024 వరకు కేవలం ఏడు తుఫాన్లు/వాయుగుండాలు వచ్చాయని అధికారులు చెప్పారు. అయితే, ఫిబ్రవరి 19న ఏర్పడే అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై తన ప్రభావం చూపుతుందని, ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం లేకపోలేదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
ప్రస్తుతం రబీలో రైతులు సాగుచేసిన పంటలు చేతికొచ్చే సమయం. మొక్కజొన్న, వరి, మిర్చి ఇతర పంటలను రైతులు కల్లాల్లో ఆరబోసి ఉంచుతారు. ఇలాంటి సమయంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్ష సూచన నేపథ్యంలో రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
