Rain Alert
Rain Alert : తెలంగాణలో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది. మలక్కా జలసంధిలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ – వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆ తరువాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తరువాతి 48గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నవంబర్ 26 (బుధవారం) నాటికి వాయుగుండం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశలో కదలి, నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉండటంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, నేడు (ఆదివారం) రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదేవిధంగా సోమవారం సైతం పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల పొడి వాతావరణం ఉంటుందని వివరించింది.
రాష్ట్రంలో తూర్పు దిశ గాలులు కొనసాగుతుండటంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ, ఉత్తర భారతదేశం నుంచి వచ్చే చల్లని గాలులు కారణంగా రాత్రివేళ చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
మరోవైపు.. ఏపీలో నూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో నవంబర్ 28 నుంచి డిసెంబరు 1 వరకు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
నేడు (ఆదివారం) నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.