Telangana Rain : తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు.. రైతులకు కీలక సూచనలు
Telangana Rain : తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
- Harish Thanniru
- Updated on- May 1, 2026 / 08:54 AM IST
Rain Alert
- తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్
- రాబోయే మూడు రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- మండే ఎండలతో కాస్త విముక్తి
Telangana Rain : తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మే నెల ప్రారంభం కావడంతో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ప్రాతాల్లో 45డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్త ఊరట కల్పించేలా వాతావరణ శాఖ కీలక విషయాన్ని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మున్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలోని 20 జిల్లాల్లో ఈదురు గాలులతో సాధారణ నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు .. ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడటం వల్ల వేసవి ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశం ఉంది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలోనే నమోదైనప్పటికీ.. సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈదురుగాలులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ముఖ్యంగా.. ప్రస్తుతం రైతులు సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయం. ఈ సమయాల్లో కురిసే అకాల వర్షాల వల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే సమయంలో రైతులు చెట్ల కింద ఉండొద్దు.. విద్యుత్ స్తంభాల పరిసర ప్రాంతాల్లోనూ.. హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతంలోకి వెళ్లాలని అధికారులు సూచించారు.
