Rain in Telangana
Rain in Hyderabad : తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన నైరుతి రుతుపవనాలకు తోడు సముద్రమట్టానికి మూడు కిలోమీటర్ల నుంచి ఏడున్నర కిలోమీటర్ల మధ్యలో ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం అధికారి వెల్లడించారు. ఏపీ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని కేంద్రీకృతమైన ఆవర్తనం బలహీన పడిందని, దీని ప్రభావంతో తెలంగాణలోని 10 జిల్లాలు మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read : బీచ్‌లో ఈతకొడుతూ 80కి.మీ సముద్రంలోకి కొట్టుకుపోయిన యువతి.. 37గంటల తరువాత ఏం జరిగిందంటే?
జూలైలోనే రెండు అల్పపీడనాలు ఏర్పడతాయని తెలిపిన వాతావరణ శాఖ.. హైదరాబాద్ నగరంలో 14, 15 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు పడే ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పది రోజుల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ఆగస్టు మొదటి వారంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read : Varalaxmi Sarathkumar Wedding : ఘనంగా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి.. ఫోటోలు వైరల్..!
ఇదిలాఉంటే గ్రేటర్ పరిధిలో గురువారం రాత్రి పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. రాత్రి 9గంటల వరకు వెస్ట్ మారేడ్ పల్లి, మాదాపూర్, ఉప్పల్ రాజీవ్‌నగర్, కాప్రా, యూసుఫ్ గూడ, అడ్డగుట్ట, బోరబండ, చర్లపల్లి, బాలానగర్‌లోని ఓల్డ్ సుల్తాన్‌నగర్‌లో మోస్తారు వర్షం కురిసింది. ఇవాళ, రేపు నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 14, 15 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.