Weather Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. మూడు నెలలు మంటలే.. ఎండలు అంతకు మించి..

వేసవికాలం మొదలైంది. రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాబోయే రోజుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..

Weather Update

Weather Update: వేసవికాలం మొదలైంది. రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అయితే, రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. ఈ వేసవిలో ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రతతో పాటు ఎక్కువ రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు వేడిగాలులు ముప్పు అధికంగా ఉందని, దక్షిణ తెలంగాణలో ఎండ తీవ్రత సాధారణం కంటే పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

 

మార్చి నుంచి మే నెల వరకు వేసవి సీజన్ కు సంబంధించిన అంచనాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసింది. ఈ ఎండాకాలంలో వరుసగా ఎక్కువ రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. సాధారణంగా వేసవిలో నాలుగైదు రోజుల పాటు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడం, తర్వాత సాధారణ స్థాయికి తగ్గడం వంటివి జరుగుతాయి. కానీ, ఈసారి వరుసగా ఎక్కువ రోజులు ఎండలు మండిపోతాయని, దానితోడు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

 

ఏప్రిల్, మే నెలల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉండే సూచనలు ఉన్నాయి. రాష్ట్రంలో మార్చి నెలలోనే వడగాల్పులు వీయవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటవచ్చునని, కర్ణాటక, మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాలను ఆనుకుని ఉన్న జిల్లాల్లో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 

రాష్ట్రంలో మూడు రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆది, సోమ, మంగళవారాల్లో ఎండ తీవ్రత పెరగనుందని, పలు ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. చాలా ప్రాంతాల్లో వాతావరణంలో తేమ శాతం పడిపోయిందని, గాలిలో తేమ పడిపోతే చల్లదనం తగ్గి వేడి తీవ్రత పెరుగుతుందని వాతవరణ శాఖ తెలిపింది.