Hyderabad Old City Metro : పాతబస్తీకి మెట్రో.. 8న నిర్మాణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన, రూ.2వేల కోట్లతో..

ఈ మెట్రో పనులు పూర్తైతే పాతబస్తీలో ట్రాఫిక్ సమస్య చాలావరకు తగ్గుతుంది. అలాగే పాతబస్తీలోని చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి టూరిస్టు ప్లేసులకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Hyderabad Old City Metro : ఎట్టకేలకు హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో పరుగులు తీయనుంది. త్వరలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి ఎంజీబీఎస్ – ఫలక్ నుమా మెట్రో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మొదటి దశలో జేబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు మెట్రో రైల్ పనులు చేపట్టాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఎంజీబీఎస్ వరకే పూర్తైంది. ఇప్పుడు సీఎం శంకుస్థాపనతో మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులు కారిడార్ 2 గ్రీన్ లైన్ కిందకు వస్తాయి.

జేబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 5 కిలోమీటర్ల పనులకు సుమారు 2వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. పాతబస్తీ మెట్రో నిర్మాణానికి 2012లోనే ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ.. రోడ్డు విస్తరణ, స్థల సేకరణ, నిర్మాణాల కూల్చివేత వంటి కారణాల వల్ల మెట్రో పనుల్లో జాప్యం జరిగింది. ఇప్పుడు వచ్చిన రేవంత్ సర్కార్ పాతబస్తీ మెట్రో పనులపై ఫోకస్ పెట్టింది. బడ్జెట్ లోనూ నిధులను కేటాయించింది. ఇక, ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రాకపోకలు సాగిస్తోంది. అక్కడి నుంచి దారుషిఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇంతేబాద్ చౌక్, మీర్ మోహిన్ దర్గా, శాలిబండ, షంషీర్ గంజ్, ఆలియాబాద్ మీదుగా ఫలక్ నుమా వరకు 5.5 కిలోమీటర్ల అలైన్ మెంట్ ఉంటుంది. ఈ మార్గంలో 4 మెట్రో స్టేషన్లు రానున్నాయి.

ఎంజీబీఎస్ తర్వాత సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్ నుమా స్టేషన్లు ఉంటాయి. ఈ మెట్రో పనులు పూర్తైతే పాతబస్తీలో ట్రాఫిక్ సమస్య చాలావరకు తగ్గుతుంది. అలాగే పాతబస్తీలోని చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి టూరిస్టు ప్లేసులకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో మెట్రోకి కూడా ఆదాయం సమకూరనుంది.

ట్రెండింగ్ వార్తలు