బల్దియా మేయర్ ఎన్నికలో కింగ్ మేకర్‌గా ఎంఐఎం.. టీఆర్ఎస్‌కు మద్దతిస్తుందా?

  • Publish Date - December 6, 2020 / 08:43 AM IST

MIM key role GHMC mayor election : జీహెచ్ఎంసి మేయర్ పీఠంపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. బల్దియా ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌కు మెజార్టీ సీట్లు రాకపోవడంతో మజ్లీస్ పార్టీ కింగ్ మేకర్‌గా మారింది. దీంతో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే అంశంపై మజ్లీస్ పార్టీలో చర్చ జరుగుతోంది. మరి గులాబీ పార్టీకి మేయర్ పీఠం కోసం సపోర్ట్ చేస్తుందా? లేదా ?



బల్దియాలో మేయర్ అభ్యర్థి ఎన్నికలో ఎంఐఎం పాత్ర కీలకంగా మారింది. గ్రేటర్‌లో ఫైట్‌లో గెలిచిన మజ్లీస్ కార్పొరేటర్లతో ఆ పార్టీ అగ్రనేతలు దారుస్సలాంలో సమావేశం నిర్వహించగా.. ప్రధానంగా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చే అంశంపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్‌ ముందుకు వచ్చి అడిగితేనే మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి.



మేయర్ ఎన్నికకు మరో రెండు నెలల సమయం ఉండటంతో పీఠంపై అప్పుడే చర్చ మొదలైంది. ఇప్పటి వరకు అధికార పార్టీతో దోస్తీ చేస్తూ వచ్చిన మజ్లీస్.. మేయర్ ఎన్నికలోనూ సపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అధికారికంగా సపోర్ట్ చేస్తే.. టీఆర్ఎస్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోవాలి, ఏ అంశాల ఆధారంగా మద్దతు ఇవ్వాలనే టాపిక్స్‌పై కూడా అగ్ర నేతలు, పార్టీ ముఖ్య నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.



అయితే అధికారికంగా కాకపోతే.. మరి అనధికారికంగా కూడా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మేయర్ ఎన్నిక రోజున మజ్లీస్ కార్పొరేటర్లు గైర్హాజరైతే ఎలా ఉంటుందనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు కొందరు పార్టీ నేతలు తెలిపారు.



ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్‌పై ఎంఐఎం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే అది పోటీ వరకు మాత్రమే కావడం, ఫలితాల తర్వాత రాజకీయ అవసరాల కోసం కలిసిపోవడం రాజకీయాల్లో షరా మామూలే అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా పొత్తుపై టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.



సీఎం కేసీఆర్‌పై కూడా ప్రశంసల వర్షం కురిపించారు. పొత్తు సంకేతాల్లో భాగంగానే అసద్ కామెంట్స్ చేశారని ప్రచారం సాగుతోంది. మరి చివరగా టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం ఎలాంటి సపోర్ట్ చేస్తుందో కొద్ది రోజుల్లో తేలనుంది.