మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఉద్యమ సమయంలో తన దగ్గర రూ.10వేలు, రూ.20వేలు తీసుకునేవాడని, ఇప్పుడు వేల కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు.

Minister Komatireddy Venkat Reddy : అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీమంత్రి జగదీశ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగింది. వ్యక్తిగత దూషణలు, రాజీనామాల సవాళ్లతో సభను అట్టుడికించారు. అసెంబ్లీ ముగిసిన తర్వాత కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన లాబీలో చేసిన చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ జిల్లా మాజీ మంత్రి అంటూ జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేశారాయన.

ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీమంత్రి పెద్ద దొంగ అంటూ మండిపడ్డారు. ఆయనపై మర్డర్ కేసులు ఉన్న మాట వాస్తవమే అన్నారు. ఆయనపై ఉన్న కేసులను త్వరలోనే బయటపెడతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో తన దగ్గర రూ.10వేలు, రూ.20వేలు తీసుకునేవాడని, ఇప్పుడు వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఆ మాజీ మంత్రికి శంషాబాద్ దగ్గర 80 ఎకరాల భూములు ఉన్నాయని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

ఇవాళ ఉదయం నుంచి కూడా అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోంది. విద్యుత్ అంశంపై చర్చ సభను కుదిపేసింది. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, అధికార పార్టీ నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదమే జరిగింది. ఈ ఇద్దరి మధ్య వ్యక్తిగత దూషణల పర్వం కూడా సాగింది. సభలోనే జగదీశ్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. జగదీశ్ రెడ్డి పెద్ద దొంగ, ఆయనపై మర్డర్ కేసులు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. గతంలో ఏమీ లేని జగదీశ్ రెడ్డి.. ఇవాళ వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కేవలం పదేళ్లలోనే పెద్ద ఎత్తున దోపిడీ చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, వాటిని బయటపెడతానని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. శంషాబాద్ వంటి ప్రైమ్ ఏరియాలో జగదీశ్ రెడ్డికి వందల ఎకరాల భూములు ఉన్నాయన్నారు.

ఒక్కో ఎకరా ధర 20 నుంచి 30కోట్లు ఉంటుందని.. అలాంటి ల్యాండ్ ను జగదీశ్ రెడ్డి పెద్ద ఎత్తున కొనుగోలు చేశారని ఆరోపించారు. వాటికి సంబంధించిన ఆధారాలను కూడా తాము బయటపెడతామన్నారు. సభలో జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని, అందుకే అలాంటి వ్యాఖ్యలు చేశానని ఆయన అంటున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలతో త్వరలో మీడియా ముందుకొస్తానని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.

Also Read : బీఆర్ఎస్ నేతలపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఆగ్రహం

ట్రెండింగ్ వార్తలు