Konda Surekha : సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. వీడియో వైరల్

Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. రాఖీ పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు.

Konda Surekha CM Revanth Reddy

Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పరకాల సీటు విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కొండా సురేఖ వెళ్లారు. రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సురేఖ.. కొద్దిసేపు ఇటీవల జరిగిన అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

Also Read : Nara Lokesh : మంత్రి నారా లోకేష్‌కు రాఖీ క‌ట్టిన మంత్రి స‌విత‌, ఎమ్మెల్యే గ‌ళ్లా మాధ‌వి.. ఫోటోలు..

సీఎం రేవంత్ రెడ్డికి గతేడాది కూడా మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు. గతేడాది కుమార్తె సుస్మిత పటేల్ తో కలిసి రేవంత్ నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. అయితే, ఈసారి మంత్రి సీతక్కతో కలిసి కొండా సురేఖ రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఇటీవల సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో కొండా సురేఖ మాత్రమే ఈసారి రేవంత్ నివాసానికి వెళ్లారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్నా. ప్రత్యేకంగా బంగారు రాఖీ చేయించి సీఎంకు కట్టా.. నేను అందరికీ ఆడపడచునే అని అన్నారు. ప్రస్తుతం రాజకీయాలు నేను మాట్లాడను. సీఎం రేవంత్ రెడ్డి మంచి పాలన అందించాలని కోరుకుంటున్నానని అన్నారు.

వివాదం తరువాత తొలిసారి..
పరకాల నియోజకవర్గం సీటు విషయంలో సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు కొండా సురేఖ ఫ్యామిలీని రాజకీయంగా ఇరకాటంలోకి నెట్టాయి. దీంతో తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డిపైనే సుస్మిత పటేల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని కొండా సురేఖ అనడంతో ఈ అంశం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్‌లోని కొందరు ఎమ్మెల్యేలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొండా సురేఖపై పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆ తరువాత.. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిశారు. మరోవైపు కొండా మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తె వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

రాష్ట్ర పార్టీలో జరుగుతున్న తాజా అంశాలపై, వివాదాలపై పీసీసీ నివేదికలు హైకమాండ్‌కు చేరినట్లు తెలిసింది. మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించడం ఖాయమని, అసెంబ్లీ సమావేశాలలోపే సంక్షోభాన్ని పరిష్కరించి, ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం లేకుండా చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోందని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో రాఖీ పండుగ సందర్భంగా కొండా సురేఖ సీఎం నివాసానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో కొండా ఫ్యామిలీ వివాదానికి తెరపడినట్లేనా అనే చర్చ జరుగుతుంది.