KTR fire BJP leaders : బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వరదసాయం రూ.10వేలు ఆపినోళ్లు.. రూ.25 వేలు ఇస్తారా అని ప్రశ్నించారు. వరద లాగా ఢిల్లీ నుంచి దిగుతున్న కేంద్ర మంత్రులకు స్వాగతమన్నారు. ఈ రాక ఏదో నగరం అకాల వర్షాలతో, వరదలతో..తల్లడిల్లుతున్నప్పుడు సాంత్వన చేకూర్చడానికి వస్తే బాగుండేదన్నారు. ఉత్త చేతులతో రాకుండా వస్తూ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్లు..వరద సాయంగా రూ.1350 కోట్లు తీసుకువస్తారని ఆశిస్తున్నామని చెప్పారు.
హిందు-ముస్లిం, ఇండియా-పాకిస్తాన్ తప్ప బీజేపీకి ఏం తెలియదని విమర్శించారు. అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా? అన్నారు. మన నినాదం విశ్వనగరం, వాళ్ల నినాదం విద్వేష నగరం పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను పట్టించుకునేవాళ్లే లేరన్నారు. హైదరాబాద్ లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మేము ఉప్పల్ లో ఐటీని తెస్తామంటే…కర్ఫ్యూ పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఆరేళ్లలో కేంద్రం చేసిన ఒక్క పనైనా ఉంటే కిషన్ రెడ్డి చెప్పాలన్నారు.
కేంద్రానికి తెలంగాణ రూ.2.72 లక్షల కోట్లు చెల్లిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1.40 లక్షల కోట్లు వచ్చాయని తెలిపారు. మిగిలిన డబ్బు ఏమయ్యాయంటే కిషన్ రెడ్డి మాట్లాడరని ఎద్దేవా చేశారు. సొమ్ము తెలంగాణది..సోకు కేంద్రానిది అన్నారు. వరదసాయం అందిస్తుంటే ఉత్తరాలు రాసి అడ్డుకున్నారని..వరదసాయం అందని వారికి డిసెంబర్ 4 తర్వాత ఇస్తామని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక పిచ్చోడేమో ఎన్టీఆర్, పీవీ సమాధులు కూలుస్తామంటారు..మరొకరేమో తాగి వాహనాలు నడపండి మేమే చలానాలు కడతామంటారు. ఆరేళ్లలో ఒక్కరూపాయి ఇవ్వని వారు ఇప్పుడు ఇస్తారా అని ప్రశ్నించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందువులు, ముస్లింలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. గెలిపిస్తే ఏం చేస్తారో బీజేపీ నేతలు చెప్పాలన్నారు. గల్లీ పార్టీకి ఓటు వేస్తారా..ఢిల్లీ పార్టీకి ఓటు వేస్తారా? అని అడిగారు. గ్రేటర్ ప్రజలు ఆలోచించి ఓటు వేయండన్నారు.