Laxman Kumar Adluri: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..
ఆసుపత్రిపై విచారణ జరపాలని వైద్య ఆరోగ్య శాఖకు మంత్రి అడ్లూరి ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
- Naveen
- Published on- May 14, 2026 / 12:56 AM IST
Laxman Kumar Adluri: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ పర్యటనలో ఉన్న ఆయన వన్ హాస్పిటల్ లో ఒక పేషంట్ ను పరామర్శించేందుకు వెళ్లారు. ఆసుపత్రిలోని లిఫ్ట్ లో ఉండగా కేబుల్ తెగింది. దీంతో ఒక్కసారిగా లిఫ్ట్ కింద పడింది. అయితే ఈ ఘటనలో మంత్రికి ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హాస్పిటల్ సిబ్బంది తీరుపై మంత్రి అడ్లూరి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తన నియోజకవర్గానికి చెందిన ఒక రైతు తీవ్రంగా గాయపడ్డాడు. అతడు వన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ రైతును పరామర్శించేందుకు మంత్రి అడ్లూరి వెళ్లారు. లిఫ్ట్ లో థర్డ్ ఫ్లోర్ కి వెళ్తుండగా ఒక్కసారిగా లిఫ్ట్ కి సంబంధించిన కేబుల్ తెగిపోయింది. సెకండ్ ఫ్లోర్ నుంచి డైరెక్ట్ గా గ్రౌండ్ ఫ్లోర్ కి లిఫ్ట్ పడిపోయింది. లిఫ్ట్ లో ఉన్న మంత్రి, ఆయన పీఏ, సిబ్బంది ఒక్కసారిగా కంగారు పడ్డారు. లిఫ్ట్ మెయింటైన్స్ సరిగా లేని కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆసుపత్రి వర్గాలపై సీరియస్ అయ్యారు.
ఆసుపత్రిపై విచారణ జరపాలని వైద్య ఆరోగ్య శాఖకు మంత్రి అడ్లూరి ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దాదాపు గంట 45 నిమిషాల పాటు ఆసుపత్రిలో ఉన్నారు మంత్రి. ఇంత జరిగినా ఆసుపత్రి యాజమాన్యం అక్కడికి రాకపోవడంతో మంత్రికి మరింత కోపం తెప్పించింది. దీనిపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్ ఓ అధికారులను సైతం ఆదేశించారు.
