×
Ad

Ponguleti Srinivas Reddy: నేను ఏంటో అందరికీ తెలుసు.. రూ.70కోట్ల కోసం తాపత్రయ పడే అవసరం లేదు- మంత్రి పొంగులేటి

మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. ఇద్దరూ సమ్మక్క సారక్కలా పని చేస్తున్నారని ఆయన కితాబిచ్చారు.

Ponguleti Srinivas Reddy: శ్రీనివాస్ రెడ్డి అంటే ఏంటో అందరికీ తెలుసు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రూ.70 కోట్ల కాంట్రాక్ట్ కోసం తాపత్రయ పడే అంత అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా 211 కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు. నా మీద సహచర మంత్రులు ఎవరూ ఫిర్యాదు చేశారని తాను నమ్మడం లేదన్నారు. నా మీద పిర్యాదు చేయడానికి అసలు ఏం ఉంది? అని ఆయన ప్రశ్నించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. ఇద్దరూ సమ్మక్క సారక్కలా పని చేస్తున్నారని ఆయన కితాబిచ్చారు.

భక్తుల భద్రత, రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఆధునీకరణ పనులు చేస్తున్నామన్నారు. 90 రోజుల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. రాతి కట్టడాలకు కావాల్సిన గ్రానైట్ పొరుగు రాష్ట్రాల నుండి తెప్పిస్తున్నామని తెలిపారు. శాశ్వత ప్రతిపాదకన పనులు చేస్తున్నామన్నారు. ఆదివాసీల ఆచార సంప్రదాయాలకు విఘాతం కలగకుండా నిర్మాణాలు చేపట్టబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

కాగా.. మేడారం ఆలయ అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో మంత్రుల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. మంత్రి పొంగులేటిపై మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి తన శాఖలో, వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో పెత్తనం చేస్తున్నారని, ఆయన జోక్యం మితిమీరుతోందని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ములుగు జిల్లా మేడారంలో చేపడుతున్న అభివృద్ధి పనుల టెండర్లలో పొంగులేటి జోక్యం చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 70కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లను మంత్రి తన అనుచరులకు ఇప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం దుమారం రేపింది. తాజాగా ఈ అంశంపై మంత్రి పొంగులేటి ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చారు.

Also Read: కారు రావాలో.. బుల్డోజర్ రావాలో జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలి : కేటీఆర్