Site icon 10TV Telugu

Double Bed Room Houses: ఆ ఇళ్ల నిర్మాణానికి 5లక్షలు, ఆగస్ట్ 15లోగా ఇళ్ల కేటాయింపు, రెండో రాజధానిగా వ‌రంగ‌ల్

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

Double Bed Room Houses: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయనుంది. అంతేకాదు అర్హులైన లబ్ధిదారులకు ఆగస్ట్ 15వ తేదీలోగా ఇళ్లు కేటాయించనుంది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇళ్ల కేటాయింపుపై కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఎప్పుడు దరఖాస్తు చేశారు అనేది కాకుండా, నిజమైన పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పొంగులేటి సూచించారు. ఇటీవల వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలన్నారు. ఇక ఇందిర‌మ్మ ఇళ్ల స‌మ‌స్య‌లు, ఫిర్యాదుల ప‌రిష్కారానికి త్వరలోనే టోల్ ఫ్రీ నెంబ‌ర్‌ ను ప్రారంభిస్తామన్నారు. రేషన్ కార్డుల పంపిణీకి ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రులు. వ‌రంగ‌ల్ స‌మ‌గ్రాభివృద్ధికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు.

భద్రకాళి ఆలయం అభివృద్ధికి డిసెంబర్ లోపల అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు. భద్రకాళి చెరువులో మట్టి తరలింపు వర్షాకాలం అనంతరం వేగవంతం చేయాలని సూచించారు. మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు ఇప్పటికే రూ.205 కోట్లు విడుదల చేశామన్నారు. భూమి సేకరణకు మరిన్ని నిధులు గ్రీన్ చానల్ ద్వారా విడుదల చేయనుంది ప్రభుత్వం.

మెగా టెక్స్‌టైల్ పార్క్ పరిధిలో 863 మంది లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు పూర్తయినట్లు వెల్లడించారు. 1,398 మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ప్రయోజనం కల్పించనుంది ప్రభుత్వం. వరంగల్ పట్టణం అభివృద్ధికి రూ.4170 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్ కేటాయించనున్నారు. వీధి దీపాలు, మాడ వీధులు, కళ్యాణ మండపం, పూజారి నివాస నిర్మాణాలు దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. వరంగల్ జిల్లాలో క్రికెట్ స్టేడియం కోసం తగిన భూమిని గుర్తించేందుకు ఆదేశాలు ఇచ్చారు.

వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వం సంకల్పం అని తెలిపారు. చరిత్రాత్మక వరంగల్ అభివృద్ధే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు.

Also Read: హైదరాబాద్‌లో రేషన్ కార్డు దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్.. కొత్త కార్డులు ఇచ్చేది ఆరోజే.. ఆలస్యంకు కారణాలు ఇవే.

Exit mobile version