Ponnam Prabhakar: ఆటో కార్మికులు సమ్మెను వెనక్కి తీసుకోవాలి.. చార్జీల పెంపునకు ప్రత్యేక కమిటీ.. పొన్నం కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ఆటో కార్మికులు చేపట్టిన సమ్మె పిలుపుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)సానుకూలంగా స్పందించారు.
- V Santhosh Kumar
- Updated on- August 23, 2026 / 02:46 PM IST
Minister Ponnam Prabhakar makes key remarks on the Telangana auto drivers strike.
- ఆటో డ్రైవర్ల సమ్మె ఉపసంహరణ
- సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ
- ప్రత్యేక కమిటీతో చార్జీల పెంపు
Ponnam Prabhakar: తెలంగాణవ్యాప్తంగా ఆటో కార్మికులు అర్ధరాత్రి నుండి చేపట్టిన సమ్మె పిలుపుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) సానుకూలంగా స్పందించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరంలో నిర్వహించిన ‘పల్లె పల్లెకు పొన్నం అన్న’ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తకుండా కార్మిక సంఘాల నాయకులు తమ సమ్మె నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
సంక్షేమ బోర్డు, చార్జీల పెంపునకు హామీ
ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని, 2015 నుండి చార్జీలు పెరగకపోవడంతో పెరిగిన జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని నూతన చార్జీల పెంపుపై అధ్యయనం చేయడానికి అధికారులతో కలిసి ప్రత్యేక కమిటీని వేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పాత ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహించడంతో పాటు పెట్రోల్, డీజిల్ వాహనాల కోసం ప్రత్యేకంగా రెట్రోఫిట్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.
