Minister Puvvada Ajay Kumar
minister puvvada: డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారత దేశంలో దళితులు ఇంకా వెనుకబడే ఉన్నారని, దళితుల అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా దళిత బంధు తీసుకొచ్చారని అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకం గురించి మాట్లాడారు. ‘‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల పరిధిలో వెయ్యి మందికి దళిత బంధు అమలు చేయడమే కాకుండా.. అదనంగా చింతకాని మండలంలో కూడా మరో 4,500 మందికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం.
రానున్న రోజుల్లో నియోజకవర్గ పరిధిలో మరో 1,500 మందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తాం. దళిత బంధుపై అవాకులు చెవాకులు పేలే ప్రతిపక్షాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైతుల కోసం రైతు బంధు, నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు అత్యధికంగా ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. దళిత బంధు పథకాన్ని వినియోగించుకుని దళిత సోదరులు ఆర్థికాభివృద్ధి చెందాలి’’ అని పువ్వాడ అన్నారు.