Sridhar Babu: జీవన్ రెడ్డి పార్టీ మారరు, మా ఫుల్ సపోర్ట్ ఆయనకే- మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వంలో ఈ పదవి కావాలని జీవన్ రెడ్డి కోరుకోలేదు. కేవలం స్థానికంగానే ఆయనకు సమస్యలు ఉన్నాయి. జీవన్ రెడ్డికి మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది.

  • Published On : March 17, 2026 / 05:14 PM IST
  • జీవన్ రెడ్డి మా సీనియర్ నాయకుడు
  • కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నారు
  • టీపీసీసీ చీఫ్ జీవన్ రెడ్డితో మాట్లాడతారు
  • ఏఐసీసీ అధ్యక్షుడు ఎవరన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుంది

Sridhar Babu: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశంపై చిట్ చాట్ లో మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. జీవన్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారాయన. జీవన్ రెడ్డి తమ సీనియర్ నాయకుడు అని, కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నారని తెలిపారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ జీవన్ రెడ్డితో మాట్లాడతారని, తాను కూడా జీవన్ రెడ్డితో మాట్లాడతానని చెప్పారు. జీవన్ రెడ్డి పార్టీ మారేది లేదని మంత్రి శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు. అటు పీసీసీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి అనేది ఏఐసీసీ నిర్ణయిస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నామినేటెడ్ పదవుల భర్తీపై హైకమాండ్ కసరత్తు చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని చిట్ చాట్ లో అన్నారు మంత్రి శ్రీధర్ బాబు.

”సఫకేషన్ ఉండి ఉండొఛ్చు, జీవన్ రెడ్డి పార్టీ ఏమీ మారరు. ఈ వ్యవహారంలో పీసీసీ అధ్యక్షుడు చొరవ చూపి మాట్లాడాలి. పార్టీని వీడొద్దని జీవన్ రెడ్డిని కోరుతున్నా. ఇక, జగ్గారెడ్డి అంటే అందరికీ ఇష్టమే. జగ్గారెడ్డిని టీపీసీసీ చీఫ్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అభిప్రాయం చెప్పారు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. అల్టిమేట్ గా ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది.

జీవన్ రెడ్డి మా సీనియర్ నాయకుడు. కష్టకాలంలో ఆయన పార్టీతో ఉన్నారు. పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆయనతో మాట్లాడాల్సిందే. జీవన్ రెడ్డి పార్టీ మారరు. ఎవరో కార్యకర్తలు ఆయన ఇంటి వద్ద జెండాలు తొలగించి ఉంటారు. నేను కూడా జీవన్ రెడ్డితో మాట్లాడతా.

పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది ఏఐసీసీ నిర్ణయిస్తుంది..

జగ్గారెడ్డి సీనియర్ నాయకుడు. ప్రజాభిమానం కలిగిన నేత. పీసీసీ అధ్యక్షుడు ఎవరు ఉండాలి అనేది AICC నిర్ణయం. ప్రజల్లో ప్రభుత్వంపై చెడు అభిప్రాయం తీసుకురావడం కోసం కేటీఆర్ ప్రయత్నం చేశారు. కేటీఆర్ అబద్దాలతో 70 ఎంఎం సినిమా చూపించే ప్రయత్నం చేశారు. జీవన్ రెడ్డి అన్ని పదవులు అనుభవించారు. ఆయనకు ఏం బాధ ఉంటుంది?

నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గర. నేను చాలా జూనియర్ ని. మా నాన్నతో కలిసి పని చేశారు. పీసీసీ ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. ఆయన పార్టీ కోసం పోరాటం చేశారు. పార్టీ సిద్దాంతం కోసం పని చేశారు. ఒంటరి పోరాటం సాగించారు. బీఆర్ఎస్ పై సైతం ప్రతిపక్షంగా కొట్లాడారు. ఏఐసీసీ కోఆర్డినేషన్ కమిటీ పార్టీ అధికారంలో ఉన్న చోట ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వానికి, పార్టీకి మద్య సమ న్యాయం చేస్తుంది. వంశీ చందర్ రెడ్డి కమిటీ ఉండేందుకు అర్హుడే. ఆయన CWC మెంబర్, NSUI కి పని చేశారు.

బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలని బీఆర్ఎస్ చూస్తుంది. ప్రభుత్వంలో ఈ పదవి కావాలని జీవన్ రెడ్డి కోరుకోలేదు. కేవలం స్థానికంగానే ఆయనకు సమస్యలు ఉన్నాయి. జీవన్ రెడ్డికి మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. కేసీఆర్ గొప్ప అనుభవజ్ఞుడు. బాధ్యతగా కేసీఆర్ శాసన సభకి రావాలి. నామినేటెడ్ పదవులపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. పోర్ట్ ఫోలియోల కేటాయింపు ముఖ్యమంత్రి నిర్ణయం. మళ్లీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరుండాలి అనేది ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది” అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Also Read: రంజాన్ పండుగ ఎప్పుడు.. మార్చి 19 లేదా 20నా.. IAC ఏమంటుందంటే..!