Fine Rice : రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి 6 కేజీల సన్నబియ్యం- మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారు.

Fine Rice : ఈ నెల 30 నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని హూజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. తెలంగాణలో 84 శాతం మంది సన్నబియ్యం అందుతాయని, ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు ఉన్న ఒక్కో లబ్దిదారుడికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. సన్నబియ్యం పంపిణీతో చరిత్ర సృష్టించబోతున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.

Also Read : స్మితా సభర్వాల్‌పై ఆరోపణల్లో నిజమెంత? అసలు వివాదమేంటి? పూర్తి వివరాలు

”రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానీ ఏప్రిల్ నుంచి 6 కేజీల సన్నబియ్యం అందిస్తాం. రాష్ట్రంలోని 84శాతం మంది ఈ బియ్యం సరఫరా చేస్తాం. ఈ నెల 30న హూజూర్ నగర్ లో సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారు. ప్రాజెక్టుల కింద వరిసాగుకు నీరు అందించేందుకు వారినికోసారి సమీక్ష చేస్తున్నాం” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

 

”ఈ 30 తేదీ నుంచి మంచి క్వాలిటీ ఫైన్ రైస్.. తెలంగాణ జనాభాలో 84శాతం మందికి ప్రతి రేషన్ కార్డు లబ్దిదారుడికి 6 కిలోల ఫైన్ రైస్ ఉచితంగా ఇవ్వబోతున్నాం. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు, ముందడుగు. ఆహార భద్రత కోసం తీసుకుంటున్న గొప్ప నిర్ణయం ఇది, ఒక గొప్ప ముందడుగు” అని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

రేషన్ కార్డుదారులకు సాంప్రదాయకంగా పంపిణీ చేయబడిన ముతక రకం బియ్యాన్ని సన్న రకం బియ్యంతో భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అదనంగా, లక్షల ఎకరాల్లో సాగు చేసేలా రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం క్వింటాలు సన్న రకం వరికి రూ. 500 బోనస్ ప్రకటించింది. రైతుల నుంచి వరి సేకరించి మిల్లింగ్ కు తరలించింది ప్రభుత్వం. రేషన్ షాపుల్లో పంపిణీకి అనుగుణంగా ఇప్పటికే పెద్ద ఎత్తున సన్నబియ్యంను స్టాక్ చేసింది ప్రభుత్వం.