Minister Vakiti Srihari: ఇటీవలే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొత్త మంత్రి వాకిటి శ్రీహరి తనకు కేటాయించిన శాఖలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కింద తనకు ఇచ్చిన శాఖలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయని ఆయన వాపోయారు. ఇది అదృష్టమో దురదృష్టమో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పదేళ్లలో ఆగమైన శాఖలను నాకు ఇచ్చారని వాకిటి శ్రీహరి అన్నారు. మత్స్యశాఖ, పశు సంవర్థక శాఖ గందరగోళంగా ఉన్నాయన్నారు. తనకిచ్చిన ఐదు శాఖలూ ఆగమాగంగానే ఉన్నాయని చెప్పారు. ”పదేళ్లలో కిందామీదా చేసి పడేసిన మత్స్యశాఖను నా చేతుల్లో పెట్టారు. పశు సంవర్ధక శాఖలో గొర్రెలు, బర్రెల్లో అంతా కిరికిరి చేశారు. యువజన సర్వీసుల శాఖను నాకు ఇస్తే నేనేం చేసుకోవాలి? గొర్రెలు, బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలి?” అంటూ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
Also Read: కేసీఆర్ లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారా? మెదక్‌లో క్లీన్ స్వీప్ ఖాయం- కేటీఆర్
కరీంనగర్‌లో క్రీడా పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడారు. క్రీడా పాఠశాలల అంతర్గత పోటీలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. కబడ్డీ, హ్యాండ్ బాల్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్‌లో స్పోర్ట్స్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కరీంనగర్ క్రీడా పాఠశాలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేస్తామని మంత్రి శ్రీహరి వెల్లడించారు.
ఇటీవలే తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగింది. ఎంతో మంది మంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. అయితే ముగ్గురికి మాత్రమే ఛాన్స్ దక్కింది. అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్, వాకిటి శ్రీహరికి మంత్రి పదవులు దక్కాయి. ఇక ఈ మధ్యే వారికి శాఖల కేటాయింపు కూడా జరిగింది. వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక , డెయిరీ డెవలప్ మెంట్, క్రీడలు, యువజన సర్వీసులు, మత్స్య శాఖలను కేటాయించారు. తాజాగా తనకు కేటాయించిన శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి వాకిటి శ్రీహరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.