Telangana Cabinet meeting
Telangana Cabinet Decisions: తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ కు క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ వారంలో కమిషన్ కు సమాచారం ఇవ్వనుంది ప్రభుత్వం. ఇక, బనకచర్ల ప్రాజెక్ట్ పై మంత్రుల కమిటీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పోర్ట్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రేపటి(జూన్ 24) నుండి రైతు భరోసా విజయోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు..
రైతులందరికీ రైతు నేస్తం
పండుగ వాతావరణంలో రైతు నేస్తం కార్యక్రమం
అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహం
201 కిమీ రీజనల్ రింగ్ రోడ్డుకు ఆమోదం
బనకచర్ల బంకను మా ప్రభుత్వానికి అంటించే కుట్ర
2016లోనే అప్పటి ప్రభుత్వం బనకచర్లకు అనుకూలమని చెప్పింది
బనకచర్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదు
Also Read: రూ.3.37 కోట్లు మోసపోయిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.. మహిళ పేరుతో ఆయనను ఎలా నమ్మించారంటే?
మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ నెల 16 న సీఎం రేవంత్ చెప్పిన మాట ప్రకారం రైతు భరోసా అమలు చేశామన్నారు. 9 రోజుల్లో 9 వేల కోట్ల రుణమాఫీ రేపటితో అమలు చేస్తున్నట్లు వెల్లడిచారు. ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఇది సాధ్యమైందన్నారు. రేపు రైతు భరోసా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు. రైతులతో విజయోత్సవ సభ ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో పండుగలా నిర్వహిస్తామన్నారు.
అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. నవంబర్ 9 వరకు ఏర్పాటు చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామన్నారు. సంగారెడ్డి-చౌటుప్పల్ వరకు RRR కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. బనకచర్ల బంకను మా ప్రభుత్వానికి రుద్దాలని బీఆర్ఎస్ చూస్తోందని ఆయన ఆరోపించారు. గోబెల్స్ ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. బనకచర్లపై తెలంగాణ వాటాలో ఉన్న ఒక్క చుక్కను కూడా వదులుకోమని, ఎంతవరకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బనకచర్లకు గత ప్రభుత్వంలో పునాది వేశారని, వారి తప్పును కప్పి పుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు.
జూలై మొదటి వారంలో బనకచర్లపై ప్రజాప్రతినిధులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందన్నారు. ప్రాజెక్ట్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తామన్నారు. బనకచర్లపై హైలెవల్ అధికారుల కమిటీ చర్చ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సమాచారాన్ని కమిషన్ కు అందిస్తామన్నారు.
నాటి కేబినెట్ తో పాటు, సబ్ కమిటీకి సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్ కు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ నెల 30వ తేదీ వరకు కమిషన్ కు వివరాలు అందిస్తామన్నారు. స్పోర్ట్స్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 2047 రైజింగ్ తెలంగాణ విజన్ కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందన్నారు. ప్రతి నెలకు రెండు సార్లు క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు.
స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ పెంపు- మంత్రి వాకిటి శ్రీహరి
స్పోర్ట్స్ పాలసీకి కేబినెట్ ఆమోదం. నేను మంత్రిగా ఉండటం సంతోషంగా ఉంది. తెలంగాణ క్రీడాకారులకు వరంగా పాలసీ. వచ్చే ఒలంపిక్స్ లో రాష్ట్ర సత్తా చూపుతాం. గ్రామీణ స్థాయి నుండి సీఎం కప్ నిర్వహిస్తాం. క్రీడలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది. స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్పోర్ట్స్ పాలసీ రూపొందించాం.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నోరి దత్తాత్రేయ- మంత్రి పొన్నం ప్రభాకర్
2047 విజన్ కు తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ట్రిలియన్ డాలర్ల గ్రోత్ టార్గెట్ గా ముందుకు వెళుతున్నాం. పాలమూరు బాసర త్రిపుల్ ఐటీ యూనివర్సిటీకి కేబినెట్ ఆమోదం. నోరి దత్తాత్రేయుడును తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం. క్యాన్సర్ నివారణకు ఆయన సేవలు ఉపయోగించుకుంటాం.