ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో తొలిసారి… మంత్రి వివేక్‌తో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారిగా రాష్ట్ర ఎక్సైజ్‌, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.

Adilabad district: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారిగా రాష్ట్ర ఎక్సైజ్‌, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ జిల్లాలో పర్యటించనున్నారు. గురు, శుక్రవారాల్లో అదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంత్రి జూపల్లి పర్యటన కొనసాగనుంది. జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో జూపల్లి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

అదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొమురంభీం, అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలను శుద్ది కార్యక్రమంలో మంత్రులు పాల్గొంటారు. బైక్ ర్యాలీతో మంత్రులకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా సీతక్కను నియమించారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముగ్గురు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను మార్పు చేసిన విష యం తెలిసిందే. సీతక్కను నిజామాబాద్‌ జిల్లాకు, ఆ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న జూపల్లిని కృష్ణారావు ఆదిలాబాద్‌కు మార్చిన విషయం విధితమే. అయితే, మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఉమ్మడి జిల్లా నుంచి చెన్నూర్‌ ఎమ్మెల్యే వివేక్‌కు చోటు దక్కింది. ఈ క్రమంలో ఇద్దరు మంత్రులు తొలిసారిగా ఇన్‌ఛార్జి మంత్రి,  మంత్రి హోదాల్లో ఆదిలాబాద్‌లో పర్యటించనున్నారు.