BRS : గెలుపు బాధ్యతను భుజానికెత్తుకున్న కృష్ణార్జునులు.. మరోసారి కేసీఆర్‌ను సీఎంను చేయడమే లక్ష్యం

రాజకీయం అయినా, ప్రభుత్వ వ్యవహారమైనా ఇద్దరూ కలిసి గోదాలోకి దిగిపోతారు. ప్రత్యర్థులను చీల్చి చెండాడటంలోనూ, పదునైన విమర్శలు సంధించడంలోనూ, ధీటైన వ్యూహాలు రచించి అమలు చేయడంలోనూ ఎవరికి వారే సాటి. BRS

KTR And Harish Rao

BRS – KTR And Harish Rao : తండ్రిని మించిన తనయుడు ఒకరు. మామను మించిన రాజకీయ చాణక్యుడు మరొకరు. యాస ప్రాసలతో ఆకట్టుకునే నేత ఒకరు. పదునైన విమర్శలతో ప్రత్యర్థులను చీల్చి చెండాడేది మరొకరు. అధినేత ఆలోచనలో ఏముందో గుర్తించి తూచ తప్పకుండా ఆచరణలో పెట్టడంలో ఇద్దరూ ఇద్దరే. వారిలో ఒకరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అయితే మరొకరు తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. వీరిద్దరి దూకుడు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీస్తోంది. బావ, బామ్మర్దులు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు బాధ్యతను భుజానికి ఎత్తుకుని తెలంగాణ కురుక్షేత్రంలో కృష్ణార్జునలా స్వారీ చేస్తున్నారు.

అటువైపు ఎవరైనా సరే.. ఇటువైపు కృష్ణార్జునులు.. బావ, బామ్మర్దులు.. జోడెద్దులు.. రాజకీయం అయినా, ప్రభుత్వ వ్యవహారమైనా ఇద్దరూ కలిసి గోదాలోకి దిగిపోతారు. ప్రత్యర్థులను చీల్చి చెండాడటంలోనూ, పదునైన విమర్శలు సంధించడంలోనూ, ధీటైన వ్యూహాలు రచించి అమలు చేయడంలోనూ ఎవరికి వారే సాటి. బుజ్జగింపులు, హెచ్చరికలతో దారికొస్తే సరి. లేదంటే తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోవడమే ఆ ఇద్దరి తెలిసిన రాజకీయం. తెలంగాణ రాజకీయంలో వెరీ వెరీ స్పెషల్ గా కనిపిస్తుంటారు హరీశ్, కేటీఆర్.

Also Read: జగిత్యాల త్రిముఖపోరులో గట్టెక్కేదెరో.. జీవన్‌రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తారా?

సీఎం కేసీఆర్ తర్వాత వీరిద్దరూ బీఆర్ఎస్ కు కర్త, కర్మ, క్రియ. సీఎం కేసీఆర్ జ్వరంతో బాధపడుతుండటంతో కేటీఆర్, హరీశ్ రావులలోని అసలుసిసలు నేతల మరోసారి బయటపడ్డారు. ఏ జంకు లేకుండా ప్రత్యర్థులపై రాజకీయ యుద్ధంలో దూసుకుపోతున్నారు. ఒకరు హైదరాబాద్ లో ఉంటే, మరొకరు జిల్లాలలో.. ఒకరు మెదక్ లో ఉంటే, మరొకరు నల్లగొండలో.. తూర్పు వైపు ఒకరు వెళితే, ఉత్తరాన చక్కబెట్టే వారు మరొకరు. అసంతృప్తులను బుజ్జగించడం, ఇతర పార్టీల నేతలను ఆకర్షించడం.. ఇలా అటూ ఇటూ రాజకీయం నెరుపుతూ అదుర్స్ అనిపిస్తున్నారు కేటీఆర్, హరీశ్ రావులు.

రాజకీయంలో తండ్రికి తగ్గ తనయుడిగా ఇప్పటికే నిరూపించుకున్నారు మంత్రి కేటీఆర్. ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్.. తెలంగాణ సమాజాన్ని ఆలోచనలో పడేసేలా సూటిగా, స్పష్టంగా తన వాదన వినిపిస్తూ ఉంటారు. రాజకీయాల్లోనే కాదు తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులపైనా, కంపెనీలు ఆకర్షించడంలోనూ కేటీఆర్ మార్క్ వేరు. ఇప్పుడు తండ్రి జ్వరంతో బాధపడుతుండటంతో ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించకుండా మొత్తం బాధ్యతలను భుజాన వేసుకుని బావ హరీశ్ రావుతో సమన్వయం చేసుకుంటూ దూసుకుపోతున్నారు.

Also Read: ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?

ఇక, హరీశ్ రావు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మామను మరోసారి సీఎం చేయడమే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వరుసగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడం, అదే సమయంలో పార్టీలో ప్యాచ్ వర్క్ చేయడమే ఈ ఇద్దరి పనిగా మారిపోయింది. మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికలకు ఆగస్టులోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ద్వారా మిగిలిన పార్టీలకన్నా.. ముందుగా ఎన్నికల రణక్షేత్రంలోకి దిగిపోయింది గులాబీదళం.

ఇక అభ్యర్థుల ప్రకటన తర్వాత ఆశావహలు, అసంతృప్తులు అధిష్టానంపై ఎంతో ఒత్తిడి చేశారు. అందరూ సీఎం కేసీఆర్ ని కలిసి తమ గోడు వెళ్లబోసుకునే అవకాశం సాధ్యమయ్యే పని కాదు. దీంతో ఆ బాధ్యత పూర్తిగా బావ, బామ్మర్దులపైనే పడింది. ఇక టికెట్ల ప్రకటన సమయంలో మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉండిపోవడంతో టికెట్ దక్కని కొందరు అసంతృప్తులకు మంత్రి హరీశ్ రావు టార్గెట్ అయ్యారు. ఇలాంటి సమయంలో కేటీఆర్, హరీశ్ రావు పూర్తి సమన్వయంతో వ్యవహరించి వీలైనంతవరకు అసంతృప్తులను చల్లబరిచారు. చల్లబడని నేతలను సైడ్ చేసేశారు. టికెట్ల ప్రకటన తర్వాత బీఆర్ఎస్ లో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడతాయని, అగ్నిగుండం అవుతుందని ప్రత్యర్థి పార్టీలు అంచనా వేస్తే కేటీఆర్, హరీశ్ రావు వ్యూహంతో అధికార పార్టీలో అసమ్మతి టీ కప్పులో తుపానులా చప్పున చల్లారిపోయింది.

ట్రెండింగ్ వార్తలు