BJP: ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?

కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌ల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర డిమాండ్ ఉండగా.. కమలం పార్టీలో పూర్తి రివర్స్‌గా తయారైంది పరిస్థితి.. అసలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?

BJP: ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?

why BJP Telangana top leaders not interest to contest assembly?

BJP Telangana: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్‌ను ఏ లీడరైనా వదులుకుంటారా? ఎమ్మెల్యే టికెట్ కోసం నేతలు ఎంతలా పాకులాడుతుంటారు. ఎన్ని పైరవీలు చేస్తుంటారు… కానీ బీజేపీలో కొందరు నేతలు అసెంబ్లీ పేరు చెబితేనే చాలు కిలోమీటరు దూరం పరుగు తీస్తున్నారట.. పార్టీ పిలిచి మరీ టికెట్లు ఇస్తామంటున్నా.. నో.. నో.. మేము ఎంపీలుగానే పోటీ చేస్తాం.. ఎమ్మెల్యే పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని చెప్పేస్తున్నారట.. కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌ల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర డిమాండ్ ఉండగా.. కమలం పార్టీలో పూర్తి రివర్స్‌గా తయారైంది పరిస్థితి.. అసలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు? తెరవెనుక రాజకీయం ఏంటి?

ఎన్నికలు తరముకొస్తుండటంతో తెలంగాణ రాజకీయం హాట్ హాట్‌గా మారుతోంది. ప్రధాన పార్టీలు అన్నీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. బీఆర్‌ఎస్ ఇప్పటికీ ఈ పని పూర్తిచేయగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల జాబితాపై కుస్తీ పడుతున్నాయి. ఐతే బీజేపీలో చాలామంది ముఖ్యనేతలు అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్‌కే పోటీ అంటుండటం ఆ పార్టీలో హాట్‌టాపిక్ అవుతోంది. బీఆర్ఎస్‌లో చాలామంది ఎంపీలు అసెంబ్లీ టికెట్లు ఆశిస్తే.. ఒక్క మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి మాత్రమే చాన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్. దుబ్బాకలో బీఆర్‌ఎస్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యే లేకపోవడంతో అక్కడ పోటీ చేసేందుకు ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు సీఎం.. ఇక కాంగ్రెస్లో ముగ్గురు ఎంపీలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీకి రెడీ అవుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ఈ సారి కొడంగల్ నుండి పోటీ చేయనుండగా నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇక బీజేపీలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.. మొన్నటివరకు అసెంబ్లీ టికెట్ల కోసం పోటీపడిన నేతలంతా ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. పైగా తాము లోక్సభకే పోటీ చేస్తామని ప్లేట్ ఫిరాయించేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా పరిస్థితి మారిపోవడంతో అసెంబ్లీకి పోటీ చేసినా ప్రయోజనం లేదని భావిస్తున్నారు కమలనాథులు. లోక్‌సభకు పోటీ చేస్తే ప్రధాని మోదీ చరిష్మాతో గెలవడంతోపాటు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ఈజీగా గెలవచ్చని భావిస్తున్నారు బీజేపీ నేతలు.

అంబర్ పేట నుంచి రెండు సార్లు గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 2019లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి అయ్యారు.. ఇప్పుడు కూడా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకే కిషన్‌రెడ్డి మొగ్గు చూస్తున్నట్లు సమాచారం.. ఇక తాజా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం కరీంనగర్ పార్లమెంట్ స్థానంపైనే ఫోకస్ పెట్టారు. తనను అధ్యక్షుడిగా తప్పించాక అసెంబ్లీ ఎన్నికలతో తనకేం పనంటూ సైడైపోతున్నారు బండి.. ముషీరాబాద్ నుంచి పోటీ చేసే డాక్టర్ లక్ష్మణ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఈయన కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఆసక్తి కనబరచడం లేదంట.. ఎలాగూ మరోసారి కేంద్రంలో బీజేపీయే అధికారంలోకి వస్తుందని.. ఎంపీగా ఉంటే కేంద్ర మంత్రిగా అవకాశం దొరుకుతుందని భావిస్తున్నారు లక్ష్మణ్.

Also Read: బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఎందుకొచ్చారు.. ఎందుకు వెళ్లిపోతున్నారు?

ఇక మాజీ ఎంపీలు రాజగోపాల్ రెడ్డి నిన్నమొన్నటి వరకు మునుగోడు నుంచి పోటీ చేస్తానని చెప్పినప్పటికీ ఇప్పుడు పార్లమెంటుకే పోటీ అంటున్నట్లు తెలుస్తోంది.. ధర్మపురి లేదా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని చెప్పిన మాజీ ఎంపీ వివేక్ కూడా పెద్దపల్లి పార్లమెంటు సీటుపైనే ఆసక్తి చూపుతున్నారు. మరో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సైతం చేవెళ్ల పార్లమెంటు స్థానం కోరుతున్నారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జితేందర్ రెడ్డి అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ ఎంపీగానే పోటీచేస్తానని చెబుతున్నారు. మాజీ ఎంపీలు విజయశాంతి, చాడా సురేష్ రెడ్డి, రవీంద్రనాయక్ ఇదేవిధంగా చెబుతున్నట్లు కాషాయపార్టీ సమాచారం.

Also Read: తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం: ఎన్నికల వేళ మోదీ వరాల వర్షం

గత ఎన్నికల్లో 108 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది బీజేపీ.. కానీ 2019 ఎన్నికల్లో 40 నియోజకవర్గాల్లో మెజార్టీ తెచ్చుకుని 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. ఈ లెక్కలను మరోసారి గుర్తుచేసుకుంటున్న కమలం పార్టీ నేతలు.. అసెంబ్లీకన్నా.. పార్లమెంటే సేఫ్ అనుకుంటున్నారని చెబుతున్నారు. ప్రధాని మోదీ మేజిక్‌తో లోక్‌సభకు గెలవొచ్చనే ఏకైక అజెండాతో సీనియర్ల అంతా అసెంబ్లీ పోటీ నుంచి సైడ్ అయిపోతున్నారని అంటున్నారు.