BRS Party: బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఎందుకొచ్చారు.. ఎందుకు వెళ్లిపోతున్నారు?

గులాబీ పార్టీలో చేరుతున్న నేతల సంఖ్య కొన్నినెలలుగా పెరుగుతూనే వస్తోంది. అయితే ఇలా చేరిన నేతలు ఎన్నాళ్లో ఉండటం లేదు. తిరుగుటపాలో తిరిగి సొంతగూటికి వెళ్లిపోతుండటంతో అధికార పార్టీకి షాక్ తగులుతోంది.

BRS Party: బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఎందుకొచ్చారు.. ఎందుకు వెళ్లిపోతున్నారు?

why other parties leaders who joined brs party u turn

BRS Party – U turn Leaders : తెలంగాణ రాజకీయాల్లో అధికార బీఆర్‌ఎస్‌ది ప్రత్యేక స్థానం.. ఉద్యమ పార్టీగా తెలంగాణలో ఓ ఊపు ఊపిన బీఆర్‌ఎస్.. 2014 నుంచి సంపూర్ణ రాజకీయ పార్టీగా మారిపోయింది. రాష్ట్రంలో బలమైన పార్టీగా అవతరించేలా ఇతర పార్టీల నుంచి ఎందరో నాయకులను చేర్చుకుంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టులు ఇలా ప్రతిపార్టీ నేతా బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇలా వచ్చి చేరిన వారితో బీఆర్‌ఎస్ ఒకానొక సమయంలో హౌస్‌ఫుల్ బోర్డు పెట్టేసింది. ఎన్నికలు దగ్గరపడటంతో ఈ మధ్యకాలంలో మళ్లీ చేరికలు పెరగడంతో బీఆర్‌ఎస్‌లో హడావుడి కనిపించింది. ఐతే ఈ హంగామా మూనాళ్ల ముచ్చటగానే మారిపోయింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు వెంటనే యూటర్న్ తీసుకుంటున్నారు. సొంతగూట్లో వాళిపోతున్నారు. అసలు ఆ నేతలు ఎందుకొచ్చారు? ఎందుకు వెళ్లిపోతున్నారన్నదే బీఆర్‌ఎస్‌లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇంతకీ తెరవెనుక రాజకీయం ఏం జరుగుతోంది?

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ కొన్నిరోజులుగా విపక్ష పార్టీల్లో బలమైన నేతలను కారెక్కించుకుంది. కొత్తగా వచ్చిన నేతల స్థాయికి తగ్గ పదవులు కట్టబెడుతామనే హమీలు ఇచ్చింది. జిల్లా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా హామీలు గుప్పిస్తుండటంతో బీఆర్‌ఎస్‌లో ఈ మధ్య చాలామంది నేతలే చేరారు. వరుసగా రెండు సార్లు అధికారంలోకి రావడం.. వచ్చే ఎన్నికల్లోనూ బలమైన పక్షంగా నిలవడంతో బీఆర్‌ఎస్‌లో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఇలా చూస్తే గులాబీ పార్టీలో చేరుతున్న నేతల సంఖ్య కొన్నినెలలుగా పెరుగుతూనే వస్తోంది. అయితే ఇలా చేరిన నేతలు ఎన్నాళ్లో ఉండటం లేదు. తిరుగుటపాలో తిరిగి సొంతగూటికి వెళ్లిపోతుండటంతో అధికార పార్టీకి షాక్ తగులుతోంది.

Also Read: బీజేపీ, కాంగ్రెస్‌కి దిమ్మతిరిగేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చేస్తుంది: హరీశ్ రావు

గత ఎన్నికల్లో చెన్నూరు టికెట్‌ను ప్రస్తుత ఎమ్మెల్యే బాల్క సుమన్ దక్కించుకున్నారు. దీంతో అప్పటివరకు ఆ సీటును ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఓదేలు, ఆయన సతీమణి జడ్పీ చైర్మన్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికలు సమీపిస్తున్నందున నాలుగైదు నెలల క్రితం ఆ ఇద్దరిని మళ్లీ కారెక్కించారు ఎమ్మెల్యే సుమన్. ఓదేలు చేరికతో చెన్నూరులో బీఆర్‌ఎస్‌కు తిరుగులేదు అనుకుంటుండగా.. అధికార పార్టీకి షాక్ ఇస్తూ యూటర్న్ తీసుకున్నారు ఓదేలు. ఏమైందోగాని బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఓదేలు ఎన్నాళ్లు తిరగకుండానే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇదేవిధంగా రెండు నెలల క్రితం గులాబీ తీర్థం పుచ్చుకున్న యదాద్రి జిల్లా నేత కుంభం అనిల్ రెడ్డి కాంగ్రెస్‌లో మళ్లీ చేరారు. అనిల్‌ను బీఆర్‌ఎస్‌లో చేర్చకుని కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థిని లేకుండా చేశామని అధికార పార్టీ సంబరపడుతున్న సమయంలోనే ఝలక్ తగిలింది. ఇక జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఢిల్లీ వసంత్ కూడా ఈ మధ్యే కారెక్కారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టికెట్ దక్కలేదనే కారణంతో కారు దిగేశారు. వచ్చే ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు ఢిల్లీ వసంత్.

Also Read: ఎన్నికల వేళ గులాబీ పార్టీలో గుబులు, ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని టెన్షన్

ఈ ముగ్గురే కాకుండా ఈ మధ్యకాలంలో అధికారపార్టీలో చేరిన కొంత మంది నేతలు అసంతృప్తితో ఉన్నా.. ఇప్పటికిప్పుడే పార్టీ మారితే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయంతో సైలెంట్గా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ పరిణామాలపై గులాబీ పార్టీ పెద్దలు కూడా సీరియస్గా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీలో మరిన్ని చేరికలతోపాటు వలసలూ ఉంటాయని అంచనా వేస్తోంది గులాబీ పార్టీ. అందులో భాగంగా కాంగ్రెస్, బిజెపి అసంతృప్త నేతలతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు విపక్ష పార్టీలను డిఫెన్స్లో నెట్టేందుకు కీలక నేతలను కారెక్కించుకుని విపక్షాలకు చెక్ పెట్టాలన్న యోచనలో అధికార పార్టీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కారులో కుదరుకోని నేతలనూ ఓ కంట కనిపెడుతూ వారు ఎటూ కదలకుండా చూసేందుకు స్కెచ్ తయారు చేస్తోందని బీఆర్‌ఎస్ వర్గాల సమాచారం.