village secretary suicide : ఉద్యోగం చెయ్యలేక ఉత్తమ గ్రామ కార్యదర్శి ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం మిన్పూర్‌ లో విషాదం చోటు చేసుకుంది. మిన్పూర్ పంచాయతీ గ్రామ కార్యదర్శి జగన్నాథ్‌ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం(మార్చి 17,2021) తన స్వగ్రామం ఇసోజిపేటలో ఉరివేసుకుని తనువు చాలించాడు.

minpoor village secretary suicide: సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం మిన్పూర్‌ లో విషాదం చోటు చేసుకుంది. మిన్పూర్ పంచాయతీ  గ్రామ కార్యదర్శి జగన్నాథ్‌ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం(మార్చి 17,2021) తన స్వగ్రామం ఇసోజిపేటలో ఉరివేసుకుని తనువు చాలించాడు. కాగా, జగన్నాథ్ గతేడాది(2020) జిల్లా కలెక్టర్‌ నుంచి ఉత్తమ గ్రామ కార్యదర్శిగా పురస్కారం పొందాడు. అలాంటి వ్యక్తి… ఉద్యోగం చేయలేకపోతున్నానంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం అందరిని విస్మయానికి గురి చేసింది.

అధికారులు సహకరించకపోవడం, ఇన్‌ఛార్జి సర్పంచి తీరే తన ఆత్మహత్యకు కారణం అని జగన్నాథ్ తన లేఖలో తెలిపాడు. మిన్పూర్‌ గ్రామాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కొన్ని పనులకు జగన్నాథ్‌ సుమారు రూ.35 వేల సొంత డబ్బును ఖర్చు చేశాడు. ఆ డబ్బును తిరిగి ఇవ్వడంలో, ఇతర బిల్లుల విషయంలో ఇన్‌ఛార్జి సర్పంచి తనను ఇబ్బంది పెడుతున్నట్లు లేఖలో తెలిపాడు. ఎంపీడీఓ మధులత, ఏపీఓ స్వాతిలకు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని వాపోయాడు.

‘‘తమ్ముడూ.. అమ్మానాన్నలకు మనమే ప్రపంచం. వాళ్లను బాగా చూసుకో. నాకు బతకాలనే ఉన్నా.. ఇలా బతకడం నావల్ల కావడం లేదు. నా మరణాన్ని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు తమకున్న సమస్యల్లో ఏదో ఒక సమస్య పరిష్కారానికి వాడుకోవాలి’’ అని జగన్నాథ్‌ ఆ లేఖలో కోరాడు. తమ కుటుంబానికి అప్పుల సమస్య ఉందని అందరూ ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

జగన్నాథ్ ఆత్మహత్యపై ఏపీవో స్వాతి, మిన్పూర్‌ ఇన్‌ఛార్జి సర్పంచి మాణెమ్మ స్పందించారు. జగన్నాథ్‌ విధి నిర్వహణలో చురుకుగా ఉండేవాడని చెప్పారు. ఉద్యోగంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులతో ఇటీవల రాజీనామా చేయగా.. చిన్న వయసులో ఎందుకిలా చేస్తావంటూ ఎంపీడీవో, తాను సర్ది చెప్పడంతో మళ్లీ విధులకు హాజరవుతున్నాడని తెలిపారు.

కానీ, ఇంత ఆకస్మికంగా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం వచ్చిందో తెలియట్లేదన్నారు. బిల్లుల విషయం మాకు చెప్పలేదని, చెబితే ఇప్పించే వాళ్లం అని ఏపీవో స్వాతి అన్నారు. పంచాయతీలో చేసిన పనులకు సంబంధించి రూ.3 లక్షలు బిల్లులు రావాల్సి ఉందని, ఈ బిల్లుల విషయంలో ఆర్నెల్ల క్రితం జగన్నాథ్‌ను అడిగానని మిన్పూర్‌ ఇన్‌ఛార్జి సర్పంచి మాణెమ్మ తెలిపారు.

జగన్నాథ్ ఆత్మహత్యతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు తమకు అండగా ఉంటాడని అనుకుంటే, ఇలా దూరం అవుతాడని అనుకోలేదని బోరుమన్నారు.

ట్రెండింగ్ వార్తలు