Miss World 2025 : మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్ సుందరి..

72వ మిస్ వరల్డ్ విన్నర్ థాయిలాండ్ యువతికి కిరీటంతో సత్కరించారు.

Miss World 2025 : మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్ సుందరి నిలిచారు. మిస్ థాయిలాండ్ ఓపల్ సుచాత చువాంశ్రీ… ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్నారు. జడ్జి జూలియా మొర్లి విజేత పేరుని ప్రకటించారు. 2024 మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిస్కోవా.. 72వ మిస్ వరల్డ్ విన్నర్ థాయిలాండ్ యువతికి కిరీటంతో సత్కరించారు.

మిస్ వరల్డ్ 2025 ఫస్ట్ రన్నరప్ – మిస్ ఇథియోపియా
మిస్ వరల్డ్ 2025 సెకండ్ రన్నరప్ – మిస్ పోలాండ్
మిస్ వరల్డ్ 2025 థర్డ్ రన్నరప్ – మిస్ మార్టినిక్

ప్రపంచ సుందరిని ఎంపిక చేసే మిస్ వరల్డ్ ఫైనల్స్ కాంటెస్ట్ హైదరాబాద్ హైటెక్స్ లో కనుల విందుగా సాగింది. మిస్ వరల్డ్ పోటీలకు 108 దేశాల నుంచి అందాల భామలు పోటీపడ్డారు. ఇండియా నుంచి నందిని గుప్తా పోటీ పడ్డారు. ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలకు జడ్జీలుగా జూలియా మోర్లీ, సోనూ సూద్, రానా దగ్గుబాటి, మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, జయేశ్ రంజన్, మానుషి చిల్లర్, సుధారెడ్డి ఉన్నారు.

సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో ముద్దుగుమ్మలు పాల్గొని తమ ప్రతిభను చాటడంతో పాటు తెలంగాణలో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు.

ప్రముఖ నటుడు, గొప్ప మానవతావాది సోనూసూద్ కు మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డ్ దక్కింది. నటుడు రానా దగ్గుబాటి చేతుల మీదుగా సోనూ సూద్ ఆ పురస్కారం అందుకున్నారు.

మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ కు అతిరథ మహారధులు తరలివచ్చారు. రాజకీయ, సినీ ప్రముఖులు ఈవెంట్ లో తళుక్కుమన్నారు. ఫైనల్స్‌ ఈవెంట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి దంపతులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు దంపతులు సందడి చేశారు.

మిస్‌ వరల్డ్‌గా ఎంపికైన సుచాత 8.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందుకుంటారు. సుచాత.. థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో జన్మించారు. 16 ఏళ్ల వయస్సులోనే క్యాన్సర్‌ ముప్పు నుంచి బయటపడిన ఆమె.. థాయిలాండ్‌లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నారు. క్యాన్సర్‌ బాధితులకు అండగా ఉండేందుకు నిధుల సేకరించడంతోపాటు, కొన్ని సంస్థలతో కలిసి పని చేస్తున్నారు.

కాగా, మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా నిష్క్రమించారు. మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 8లో చోటు దక్కించుకోలేకపోయారు. ఆసియా అండ్ ఓషియానియా ఖండం నుంచి టాప్ 8కి ఫిలిప్పీన్స్, థాయిలాండ్ అందగత్తెలు ఎంపికయ్యారు.