హైదరాబాద్‌లో మే 10 నుంచి ఈ నెలాఖరు వరకు ప్రపంచ సుందరి అందాల పోటీలు జరగనున్నాయి. వీటి లావాదేవీల మొత్తం విలువ రూ.700 కోట్లు ఉంటుందని అంచనా. ఈ పోటీల నిర్వహణ కంపెనీకి రూ.400 – 500 కోట్ల మధ్య ఆదాయం వస్తుందని తెలుస్తోంది.
ఈ పోటీల నిర్వహణ వ్యయంలో తెలంగాణ సర్కారు సగం ఖర్చు పెట్టుకుంటోంది. అయినప్పటికీ స్పాన్సర్‌షిప్ ద్వారా వచ్చే ఆదాయంలో 90 శాతానికిపైగా మిస్ వరల్డ్ కంపెనీకే వెళ్తుంది. ఈ పోటీల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం, మిస్ వరల్డ్ లిమిటెడ్ రూ.57 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలంగాణ సర్కారు ఇంతకుముందు చెప్పింది.
Also Read: వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?
స్పాన్సర్‌షిప్స్ ద్వారా తెలంగాణ సర్కారుకి రూ.25 కోట్ల మేర సమకూరే అవకాశం ఉంది. ఈ అందాల పోటీలను 150కి పైగా దేశాల్లో లైవ్‌లో ప్రసారం చేస్తారు. అందుకుగానూ టీవీ ఛానళ్లు మిస్ వరల్డ్ కంపెనీతో ఒప్పందం చేసుకుంటాయి. దీంతో ఆ కంపెనీకి పెద్ద మొత్తం ఆదాయం వస్తుంది. పోటీలను చూడడానికి వచ్చే వారు టికెట్లను కొనాల్సి ఉంటుంది.
దీంతో ఆ కంపెనీకి మరింత ఆదాయం రానుంది. పలు డిజిటల్, సామాజిక మాధ్యమాల ఛానళ్లలో కూడా ఈ అందాల పోటీలను లైవ్‌లో ప్రసారం చేస్తారు. దీని ద్వారా కూడా మిస్ వరల్డ్ కంపెనీకి ఆదాయం వస్తుంది. ఆదాయ వివరాలను మిస్ వరల్డ్ సంస్థ గోప్యంగా ఉంచుతోంది.
మిస్ వరల్డ్ విజేతకు వజ్రాలు పొదిగిన కిరీటాన్ని పెడతారు. గత సంవత్సరం ముంబైలోజరిగిన పోటీల్లో విజేతగా చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనా పిజ్కోవా నిలిచారు. అప్పట్లో ఆమె ధరించిన కిరీటం విలువ రూ.6.21 కోట్లని సమాచారం. ఇప్పుడు విజేతకు బహుమతిగా రూ. 12 కోట్లు – రూ.15 కోట్ల మధ్య చెల్లిస్తారు.