Miyapur Land Case : భూకబ్జాదారులకు చెక్.. ప్రభుత్వ భూములు ఇక ప్రజలకే.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్!

Miyapur Land Case : మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూములను కాపాడే ప్రయత్నం జరగలేదని విమర్శించారు.

Miyapur Land Verdict

  • మియాపూర్ భూములపై సుప్రీం తీర్పు..
  • ప్రభుత్వ భూముల విషయంలో సీఎం రేవంత్ కీలక ప్రకటన
  • రూ.1.50 లక్షల కోట్ల భూములపై రేవంత్ సర్కార్ ఫోకస్
  • ప్రభుత్వ భూముల స్వాధీనంపై సీఎం కామెంట్స్

Miyapur Land Case : తెలంగాణలో ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చారిత్రాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో తమ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వ భూముల విషయంలో నిర్లక్ష్యం జరిగిందని బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు.

మియాపూర్‌లోని 550 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయని సీఎం రేవంత్ ఆరోపించారు. భూ రికార్డుల్లో మార్పులు చేసి ఆక్రమణలకు పాల్పడే ప్రయత్నాలు చేశారని వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారంలో తమ ప్రభుత్వం న్యాయపరంగా సమర్థవంతంగా పోరాడిందని, భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు. అక్కడ ఇప్పటికే నిర్మాణాలు ఉన్నాయా అనే అంశంపై హెచ్‌ఎండీఏ సర్వే చేపట్టనుంది.

Read Also : Helicopter Badrinath : ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ మిస్సింగ్.. ఆరుగురి కోసం ముమ్మర గాలింపు.. రంగంలోకి మరో 2 చాపర్లు!

మియాపూర్‌తో పాటు ఐఎంజీ భూముల కేసులోనూ ప్రభుత్వానికి అనుకూల ఫలితం వచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మంచిరేవులలో 143 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామని, అందులో 50 ఎకరాలను యంగ్ ఇండియా స్కూల్‌కు కేటాయించినట్లు చెప్పారు. భూపాలపల్లిలో 104 ఎకరాల భూమిని తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

మరోవైపు, కేసీఆర్ ఫాంహౌస్ పరిసరాల్లోని రెండు గ్రామాల్లో భూ సర్వేలు నిర్వహించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు. ఇప్పటివరకు 388 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోగా, మరో 345 ఎకరాలను గుర్తించినట్లు తెలిపారు. మొత్తంగా గత మూడేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడినట్లు పేర్కొన్నారు.

ఈ భూములను అవసరాన్ని బట్టి విద్య, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను విక్రయించాల్సి వస్తే వచ్చే ఆదాయాన్ని కూడా ప్రజా ప్రయోజనాలకే ఖర్చు చేస్తామన్నారు. ఇదే సమయంలో ఎర్రవల్లి సమీపంలో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి పేరుతో ప్రత్యేక కాలనీ నిర్మించనున్నట్లు ప్రకటించారు.