MLA Defection Case
MLA Defection Case : తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో స్పీకర్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Also Read : Jupally Krishna Rao : గోల్కొండలో ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్’.. గగనతలంలో మంత్రి జూపల్లి సాహస యాత్ర..
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ మసీహ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, స్పీకర్ తీసుకున్న చర్యలపై ఆయన తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీం ధర్మాసనానికి నివేదిక అందించారు. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలపై విచారణ జరిపి.. తీర్పు వెలువరించారని పేర్కొన్నారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో స్పీకర్ విఫలమయ్యారని బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా..? లేదంటే మేమే నిర్ణయం తీసుకోవాలా..? అని ప్రశ్నించింది. మీకిదే చివరి అవకాశం ఇస్తున్నాం.. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల విచారణను పూర్తి చేయాలి.. మిగతా ఎమ్మెల్యేలపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సుప్రీంకోర్టు గడువు విధించింది. రెండు వారాల్లో మీరు నిర్ణయం తీసుకోకపోతే మేమే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాక.. రెండు వారాల్లో ఎమ్మెల్యే అనర్హత వేటుపై స్పీకర్ తీసుకున్న చర్యల అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.