ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు..

దళితబంధు కోసం స్వయంగా దరఖాస్తులు స్వీకరిస్తానని ఇటీవల కౌశిక్ రెడ్డి ప్రకటించారు.

MLA Padi Kaushik Reddy : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. దళితబంధు రెండో విడత నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరసనకు దిగారు. లబ్దిదారులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో వారితో కలిసి ధర్నా చేశారు. కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. అతడిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగ్గా కౌశిక్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దళితబంధు కోసం స్వయంగా దరఖాస్తులు స్వీకరిస్తానని ఇటీవల కౌశిక్ రెడ్డి ప్రకటించారు. దీంతో లబ్దిదారులు భారీ సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు.

హుజూరాబాద్ లో ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళితబంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లబ్దిదారులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని రెండు రోజుల క్రితం పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. మొదటి విడతలో నిధులు రాని వారిలో అర్హులైన వారంతా దరఖాస్తులు తీసుకుని తన ఇంటికి వస్తే.. అధికారుల వద్దకు వెళ్దామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలోని వందలాది మంది దళితులు, దళిత కుటుంబాలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.

అధికారుల వద్దకు వెళ్లి కచ్చితంగా తమ డిమాండ్ వినిపించాలని అక్కడికి వచ్చిన దళితులు అన్నారు. హుజురాబాద్ లో ఉన్న అంబేద్కర్ చౌరస్తా వద్దకు వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ధర్నా నిర్వహించిన తర్వాత అధికారుల వద్దకు వెళ్తామని కొంతమంది సూచించారు. దీంతో వారి సూచన మేరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్కడ ధర్నాకు దిగే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. అనుమతి లేకుండా రోడ్డు మీదకు రావొద్దన్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలో పోలీసులు, కౌశిక్ రెడ్డి మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కౌశిక్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో వెంటనే హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి కౌశిక్ రెడ్డిని తరలించారు. కేవలం ఎమ్మెల్యేనే కాదు అనేక మంది ఆందోళనకారులు అస్వస్థతకు గురయ్యారు. వారిని కూడా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని మాజీ మంత్రి గంగుల కమలాకర్ పరామర్శించారు. ఫోన్ లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కూడా పరామర్శించారు.

Also Read : ఆ అధికారులు, బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో అరెస్ట్‌ టెన్షన్!